వాతాపి గణపతికి, వాతాపి రాక్షసుడికి ఏదైనా సంబంధం ఉందా ?

వాతాపి గణపతికి, వాతాపి రాక్షసుడికి ఏదైనా సంబంధం ఉందా ?
- లక్ష్మీరమణ
వాతాపి గణపతిం భజేహం అనే కీర్తన ఎన్నో కార్యక్రమాలలో ప్రారంభ కీర్తనగా వినిపిస్తూనే ఉంటుంది . ఈ కీర్తనలో ఉన్న గణపతి వాతాపి అనే నగరంలో వెలసి ఉన్న గణపతి. వాతాపి లో వెలసి ఉన్న గణపతిని పూజిస్తున్నాను అని హంసధ్వని రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ ఈ కీర్తనని రచించారు. అగస్త్య మహాముని వాతాపి అనే రాక్షసుణ్ణి సంహరించిన ప్రదేశం ఇదేనని ఐతిహ్యం.
వాతాపి అనే రాక్షసుడు పరిపాలించిన ప్రాంతం కావడం వల్ల ఈ పట్టణానికి వాతాపి అన్న పేరు స్థిరపడింది. మహిషాసురుని పేరిట అతనేలిన పట్టణానికి మైసూరు అనే పేరు వచ్చింది. అదే విధంగా వాతాపి పరిపాలించిన ప్రదేశానికి ఆ రాక్షసుని పేరు ఏర్పడిందని పురాణ కథనం. వాతాపి గాధ విష్ణు పురాణంలోనూ, వ్యాస మహాభారతంలోనూ, వాల్మీకి రామాయణంలోనూ చెప్పారు. వాతాపి, ఇల్వలులు అన్నదమ్ములు. వీరి తల్లిదండ్రులు ఎవరనే విషయంలో పలు భేదాలు ఉన్నాయి.
మొత్తానికి వీరు రాక్షస ప్రవృత్తితో ప్రవర్తించేవారు. వీరి స్వభావాన్ని తెలుసున్న ఒక విప్రోత్తముణ్ణి సర్వార్ధ సిద్ధికి ఒక మంత్రాన్ని ఉపదేశించమని ఇల్వలుడు అర్థించాడు. కానీ రాక్షస స్వభావులైన వారికి ప్రభావసంపన్నమైన మంత్రాలను ఉపదేశించడానికి ఆ విప్రుడు అంగీకరించలేదు. అంతేకాక ఇంద్రుడికి సాటి కాగల ఒక కుమారుడు కలిగేటట్లు వరాన్ని అనుగ్రహించమని కూడా ఇల్వలుడు ఆ విప్రుని ప్రార్థించాడు. అటువంటి కౄరాత్ములకి, ఇటువంటి వరాలు అనుగ్రహిస్తే, అవి లోకపీడకే కారణం కాగలవని తెలిసిన విజ్ఞుడా విప్రుడు . అందువల్ల అది కూడా కుదరదని నిర్మొహమాటంగా తిరస్కరించారు.
ఆనాటి నుంచి వాతాపి, ఇల్వలులు విప్రులపైన పగబట్టారు. ఆనాటి కాలంలో విప్రులు పితృకార్యాలలో మాంసాహారాన్ని గ్రహించేవారు. ఇంతకు ముందర యుగాలలో యజ్ఞాలు, పితృకార్యాలు ప్రత్యేక సందర్భాలలో మాంసాహారం తీసుకోవాలని ధర్మం ఉండేది . ఆ తర్వాత కాళీ యుగంలో అశ్వమేథం వంటి బలిసమర్పణ యాగాలతో పాటుగా పితృకార్యాలలో మాంసాహారం కూడా కూడదని, బ్రాహ్మలు పూర్తిగా శాకాహారమే తీసుకోవాలని ధర్మనిర్దేశనం చేశారు ఋషులు.
ఇంతకీ ఇల్వలుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి , నిర్జన ప్రదేశాలలోనూ అరణ్య మార్గాలలోను దారి కాచి ఉండేవాడు. తమ ఇంట పితృ కార్యమని భోజనానికి రావాల్సిందని చెప్పి, ఆ దారిన వెళ్లే విప్రులను తీసుకొచ్చేవాడు. ఇల్వలుడికి కామరూపము, ఎన్ని ముక్కలుగా చేసిన తిరిగి అతుక్కునే వరము ఉన్నాయి. అందువల్ల వాతాపి మేక రూపాన్ని ధరించగా ఇల్వలుడు వాడిని కోసి పితృకార్యం నిమిత్తం అన్నట్టుగా విప్రులకు వండి పెట్టేవాడు. వారు భుజించాక ఇల్వలుడు వాతాపిని పిలిచేవాడు. వాతాపి తిన్నవారి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేవాడు.
ఇదిలా ఉంటే, అగస్త్య మహర్షి తన భార్య అయిన లోపాముద్ర యొక్క అభీష్టాన్ని చెల్లించే నిమిత్తం ఆమె కోరిన వస్త్రాభరణాల కోసం ధనాన్నిసమకూర్చుకొని ప్రయత్నం చేస్తున్నారు. అలా రాజులని రాజ్య వ్యయానికి సరిపోవుగా, ధనం మిగిలితే దానిని మాత్రమే తనకి ఇమ్మని కోరుతున్నారు . ఆ విధంగా అగస్యుడు ఇద్దరు రాజులని కలిసినా దానం లభించలేదు . వాతాపి పరిపాలకులైన ఇల్వలుడి దగ్గర అపారమైన ధనరాశులు ఉన్నాయని అతన్ని అర్థించే నిమిత్తం అగస్త్యుడు ఆ రాక్షసుని గడప తొక్కారు .
వచ్చినవాడు విప్రుడు , మహర్షి కాబట్టి ఇల్వలుడు తన అలవాటుని కొనసాగించాడు . ఇల్వలుని దురాగతాలు అగస్త్యుడు ముందే తెలుసుకొని ఉన్నారు . మేక రూపంలోని వాతాపిని ఖండించి, వండి ఆగస్త్యమహర్షికి భోజనం పెట్టాడు. మహా తపస్వి అయిన అగస్యుడు ఈ రాక్షస పీడ వదిలించడానికే నిశయించుకొని ఉన్నారు. తన తపస్సు ప్రభావంతో వాతాపి జీర్ణం అయ్యేటట్లు చేశాడు. ఇల్వలుడు అలవాటు ప్రకారం వాతాపీ వెలుపలికి రా! అని పిలిచాడు. కానీ అప్పటికే వాతాపి జీర్ణమైపోయాడు. ఇది అగస్త్యుని ప్రభావమే అని గ్రహించుకున్న ఇల్వలుడు, తనకు కూడా అగస్త్యుని వల్ల చావు మూడుతుందనే భయంతో ఏమీ మాట్లాడలేకపోయాడు. తనకేమీ తెలియనట్లుగానే ఉండి, ఆ మహర్షి తన వద్దకు వచ్చిన కారణాన్ని తెలుసుకుని, వారు కోరిన ధనాన్ని ఇచ్చి పంపించేశాడు. ఇది వ్యాసభారతంలో ఉన్న కథ.
కాగా రామాయణంలోనూ మరొక విధంగా ఉంది. అదేమంటే వాతాపిని జీర్ణం చేసుకున్న అగస్యుని పైకి ఇల్వలుడు ఆగ్రహంతో దుమికాడు. అప్పుడు ఆగస్యుడు ఒక్కసారిగా హోంకరించి తన తీక్షణమైన చూపులతో ఇల్వలుణ్ణి కూడా సంహరించాడు. రాక్షస పీడని తొలగించినందుకు ప్రజలందరూ అగస్త్యుని కీర్తించారు.
ఆ విధంగా అగస్త్యుడు వాతాపిని సంహరించిన ప్రదేశము, వాతాపి ఏలిన ప్రదేశము వాతాపి పట్టణంగా ప్రసిద్ధమయింది. ఒకనాటి దక్షిణ భారతదేశంలో వాతాపి పట్టణం ఎన్నో ఏళ్ల తరబడి చాలా వైభవాన్ని పొందిన నగరం. చోళులు చాణుక్యులు పల్లవులు పరిపాలించిన కాలంలో ఈ పట్టణం ఎంతో ప్రాచుర్యాన్ని కలిగి ఉండేది. చారిత్రిక వైభవం కలిగిన వాతాపి నగరంలో నిర్మితమైన గణపతి దేవాలయంలోని ప్రధాన దైవమే ఈ ముత్తుస్వామి గారి కీర్తనలో ఉటంకించబడిన వాతాపి గణపతి. పల్లవులు ,చోళులు, చాళుక్యులు ఇత్యాది ప్రభువులు ఈ వాతాపి గణపతిని పూజించినట్లు, ఆయన అనుగ్రహాన్ని పొందినట్లు చారిత్రిక నిదర్శనాలు ఉన్నాయి. ఇంతకీ ఆ రాక్షసుడైన వాతాపి పరిపాలించిన నగరంలో నెలకొన్న, దైవ గణపతే ఈ వాతాపి గణపతన్నమాట! అదీ సంగతి .
#vathapiganapathimbhajeham #vathapiganapathi
Tags: vathapi, ganapathi, vathapi ganapathim bhajeham, ganapati, vatapi,