ముక్కెర పెట్టిన కన్నయ్య
ముక్కెర పెట్టిన కన్నయ్య ఆ రాక్షసులని మూడుచెరువులనీళ్ళూ తాగించాడు !
లక్ష్మీ రమణ
పిల్లలకి ఏమవుతుందోనని అమ్మకడుపు పడే ఆరాటం అంతా,ఇంతాకాదు . పిల్లాడికి ముల్లు గుచ్చుకుంటే, అది తన గుండెలో దిగిన బాకులా అల్లాడిపోతోంది అమ్మ . అమ్మతనంలోని కమ్మదనాన్ని అనుభవించేందుకు పరమాత్ముడు పసివాడై, యశోదమ్మని అనుగ్రహించారు. ఆ చిన్ని కన్నయ్య కొన్నిచోట్ల ముక్కుకి బులాకీ (ముక్కెర / నత్తు ) పెట్టుకొని కనిపిస్తారు . యశోదమ్మ తన కన్నయ్యని దుష్టమైన రాక్షసులబారి నుండీ కాపాడుకోవడానికి ఒక పాపలాగా అలా అలంకరించేవారట . మరి ఆయన పసివాడిగా కడతేర్చిన రాక్షసుల చిట్టా అలాంటిది మరి .
పూతన:
రామావతారంలో తాటాకిని చంపితే, కృష్ణుడిగా మొదట కంసుడు పంపిన పూతన అనే రాక్షసిని కడతేర్చారు పరమాత్మ . పూతన అందమైన అతివ రూపం దాల్చి కృష్ణునికి విషం పూసిన తన రొమ్ముల ద్వారా పాలిచ్చి చంపాలనుకుంటుంది. కానీ కృష్ణపరమాత్ముడు విషంతో సహా పూతన ప్రాణవాయువును కూడా పీల్చివేస్తాడు. పూతన హాహాకారాలతో మరణిస్తుంది.
శకటాసురుడు :
కంసుడు ఒకసారి శకటాసురుడనే రాక్షసుని శ్రీకృష్ణుని చంపటానికి పంపుతాడు శకటాసురుడు అక్కడున్న ఒక బండిలో ప్రవేశించి కృష్ణుని మీదికొస్తాడు. కృష్ణుడు తన కాలితో ఆ శకటాసురిణ్ణి తన్ని సంహరిస్తాడు.
అఘూసురుడు:
ఇంకొక సారి గోవులను అడవిలో మేపుతుండగా అఘూసురుడు రాక్షసుడు కృష్ణుణ్ణి సంహరించేందుకు భయంకరమైన సర్పరూపం ధరించి కొండగుహలాగా నోరు తెరచి ఉంచుతాడు. గోప బాలకులు అది కొండగుహగా భావించి అందులో ప్రవేశిస్తారు. కృష్ణుడు అఘూసురుణ్ణి గుర్తించి తానుకూడా అఘూసురుడి నోటిలో ప్రవేశించి తన శరీరాన్ని పెంచి అఘూసురుణ్ణి చీల్చుకొని బయటకు వస్తాడు.
కాళీయుడు:
వ్రేపల్లెకు దగ్గరలోని కాళింది మడుగులో కాళీయుడనే విషసర్పం తన భార్యలతో సహా నివసిస్తుంటాడు. కాళీయుని విషం కారణంగా మడుగులోని నీరంతా విషమయమవుతుంది. ఆ నీరు త్రాగి గోవులు మరణిస్తుంటాయి. కృష్ణుడు కాళీయుని పడగమీదకు ఎగసి కాళీయమర్ధనం చేస్తాడు. కాళీయుడు కృష్ణుని శరణుకోరి ఆ మడుగు వదలి వెళ్ళిపోతాడు.
తృణావర్తుడు :
మరోసారి కంసుడు తృణావర్తుడనే రాక్షసుడుని పంపుతాడు. వాడు పెద్దసుడిగాలి రూపంలో వచ్చి కృష్ణుణ్ణి గాలిలోకి ఎగరవేసుకొని పోతాడు. కానీ చిన్ని కృష్ణుడు తృణావర్తుణ్ణి కూడా గాలిలోనే సంహరిస్తాడు.
కేశి:
కంసుడు మరొక సారి వేగంగా పరుగెత్తగలిగే కేశి అనే రాక్షసిని శ్రీకృష్ణుని చంపిరమ్మని పంపుతాడు. కేసి గుర్రం రూపం దాల్చి వేగంగా కృష్ణుని మీదకు వస్తుంది. కృష్ణుడు లాఘవంగా కేశిని పట్టుకొని హతమారుస్తాడు.
ఏమీ తెలియని బోసినవ్వులతో అల్లరి చేస్తూ, దొంగిలించిన వెన్నని కోతులతో పంచుకుంటూ ఉండే ఆ చిన్నారి కన్నయ్య ఇందరు దారుణమైన రాక్షసులని కూల్చేశాడంటే, నమ్మబుద్ధి వేస్తుందా !! ఏ తల్లయినా దేన్నీ జీర్ణించు కుంటుందా !
ఇంతటి సాహసముతోటి పాటుగా అంతులేని అల్లరి చేసే తన కన్నయ్యని దారిలో పెట్టాలి అనుకున్న అమ్మ యశోద , త్రాటితో చిన్నికృష్ణుని రోటికి కట్టివేస్తుంది. కృష్ణుడు రోటిని లాక్కుంటూ వెళ్ళి మద్ది చెట్లను కూల్చివేసి మద్దిచెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిముక్తిని ప్రసాదిస్తాడు. అదండీ మన కన్నయ్య అల్లరి .
ఇక చేసేదేమీలేక, చిన్నారి కన్నయ్యని ఆడపిల్లల అలంకరించి, ఎవరూ కిట్టయ్యాని గుర్తుపట్టకుండా ఉండేలా ప్రయత్నించేవారట యశోదమ్మ . ఇప్పటికీ రాజస్థాన్ లోని నతఁద్వారా (Nathdwara) లో శ్రీకృష్ణుణ్ణి ఈ రూపంలో దర్శించుకోవచ్చు .