శ్రీకృష్ణుని మహిమ
శ్రీకృష్ణుని మహిమ నారదుండరయుట
.నారదమహర్షి అన్ని లోకములు తిరుగుతున్నప్పుడు ఆయనతో ఎవరో ‘నారదా, కృష్ణుడు పదహారు వేలమందిని పెళ్లి చేసుకున్నప్పుడు నీవు వెళ్ళావా? ఆయన అంతమందిని ఎన్ని రోజులు పెళ్ళి చేసుకున్నాడు? ఆయన నరకాసురుడి మీదికి యుద్ధమునకు వెళ్ళినపుడు నరకాసురుడు తీసుకువచ్చి కారాగారంలో బంధించి దాచిన పదహారు వేలమంది రాజ కుమార్తెలను తన రాజధానికి తీసుకువచ్చి అందరికి సౌధములు నిర్మించి ఒకే ముహూర్తంలో ఒకే కృష్ణుడు పదహారు వేలమంది కృష్ణులై తాళి కట్టారట’ అన్నారు.
ఈ మాటలు విని నారదుడు ఆశ్చర్యపోయి ఇది ఎలా జరుగుతుంది? అన్నాడు. అనగా అంతటి జ్ఞాని ఎటువంటి మోహమునకు గురి అయ్యారో గమనించాలి. తాళి అయితే కట్టాడు. మరి సంసారం ఎలా చేస్తూ ఉంటాడు? అనుకుని చూసి వద్దామని కృష్ణుని దగ్గరకు బయలుదేరి భూలోకమునకు వచ్చాడు. ద్వారకానగరంలోకి ప్రవేశించాడు.
ద్వారకా నగరం పరమ రమణీయంగా ఉన్నది. ఆ నగరంలోని ఒక ఇంట్లోకి వెళ్ళాడు. అది కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్న స్త్రీలలో ఒకస్త్రీ గృహం. ఆవిడ తామర పూవువంటి తన చేతితో వింజామర చేత పట్టి కృష్ణ భగవానునికి విసురుతోంది. భార్యచేత సేవలు పొందుతున్నాడని వెనక్కి వెళ్ళిపోబోతుండగా అటు తిరిగి కూర్చుని సేవలందుకుంటున్నవాడు వెనక కన్ను లేకుండానే ఇతనిని గమనించి తాను కూర్చున్న ఆసనం దిగి నారదునికి ఎదురు వచ్చి అలా వెళ్ళిపోతున్నారే నారదా! లోపలికి రండి. మీరు నాతో ఏదయినా పని ఉండి వచ్చారా? మీరు ఏ పని చెప్పినా ఆ పనిని ఔదల దాల్చి చేయడానికి ఈ సేవకుడు సిద్ధంగా ఉంటాడు ’ అన్నాడు.
నారదుడు ‘కృష్ణా! మహానుభావా! దామోదరా నీవు భక్తులపాలిట సర్వ కాలముల యందు కల్పవృక్షము వంటి వాడివి. దుష్ట జనులను నిగ్రహించడానికి నీవు ఇటువంటి అవతారములను స్వీకరిస్తావు. ఏ నీ పద సేవ చేయాలని బ్రహ్మాది దేవతలు కోరుకుంటారో అటువంటి నీ పాదపద్మముల యందు నిరంతరమూ నా మనస్సు వశించి ఉండే వరమును నాకు ఇవ్వవలసినది’ అని నారదుడు కృష్ణుని అడిగాడు.
బయటికి వచ్చి ఈ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పక్క ఇంట్లో ఎలా ఉండగలడు అనుకుని ఆ ఇంట్లోకి తొంగి చూశాడు. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్లి ఇలా తలుపు తీసి చూశాడు. ఎక్కడికి వెళ్ళినా సంసారిలాగే కనపడుతున్నాడు. ఎక్కడా పరబ్రహ్మలా లేడు. ఎక్కడికి వెడితే అక్కడే ఉన్నాడు. అన్నీ చూసి బయటకు వచ్చి అంతఃపురమునందు నిలబడిన నారదుడు – ఏమి ఆశ్చర్యము! ఏమి ఆనందము! ఏమి కృష్ణ పరమాత్మ! మహానుభావుడు ఇంతమందితో రమిస్తున్నాడు. ఎలా? ఏకకాలమునందు అగ్నిహోత్రము ఎన్ని వస్తువులను కాల్చినా వాటి పవిత్రత కాని, అపవిత్రత కాని తనకి అంటనట్లు సూర్యకిరణములు బురద మీద పడినా, సజ్జనుడి మీద పడినా, దుర్జనుడి మీద పడినా సూర్యునికి అపవిత్రత లేనట్లు ఇన్ని ఇళ్ళల్లో సంసారం చేస్తున్నవాడు సంసారాతీతుడై ఉన్నాడు’ అని పొంగిపోయి ఆనందంతో వైకుంఠమునకు వెళ్ళిపోయాడు.
ఇది కృష్ణ పరమాత్మ ఆశ్చర్యకరమయిన సంసార రీతి. దీనివలన మనకు ఏమి తెలుస్తున్నది? కృష్ణ పరమాత్మ అన్ని వేలమంది కన్యలను వారిని ఉద్ధరించాలని చేసుకున్నాడు. ఇది కృష్ణ పరమాత్మ వ్యాపకత్వమును, విష్ణు తత్త్వమును ఆవిష్కరిస్తుంది. కృష్ణుడి చేష్టితములను మీరు వేలెత్తి చూపించే ప్రయత్నం చేయకూడదు. నారదుడంతటి వాడు నమస్కరించి వెనుదిరిగాడు. మనం ఎంతటి వారము!
ఈ లీల విన్న తరువాత పొంగిపోయి ఎవరు కృష్ణ పరమాత్మకి నమస్కరించి వ్యాపకత్వము ఉన్న స్వామి అంతటా ఉన్నాడని గ్రహించి ఆనందిస్తారో వారికి స్వామి ఒక వరం ఇచ్చారు. ఎవరయితే పరమభక్తితో కృష్ణ భగవానుని సంసారమును నారదుడు చూసే ప్రయత్నము చేసి తాను ఆనందించిన కథా వృత్తాంతమును విని పరమాత్మకు నమస్కరిస్తున్నారో, వారియందు కృష్ణ భక్తి ద్విగుణీకృతమై వారు భగవంతుడిని తొందరగా చేరుకుంటారు. దానితో పాటు ఇహమునందు అపారమయిన ధనమును పొంది పశు, పుత్ర, మిత్ర, వనితాముఖ సౌఖ్యములన్నిటిని అనుభవించగల స్థితిని కృష్ణ పరమాత్మ వారికి కల్పిస్తాడని ఆ ఆఖ్యానమును పూర్తిచేశారు.
- విన్ను వినోద్