ఆ ఎనిమిదిమంది కధలూ తెలిసినవే! మరి 16 వేలమంది ఎవరు?
ఆ ఎనిమిదిమంది కధలూ తెలిసినవే! మరి 16 వేలమంది ఎవరు?
శ్రీకృష్ణ పరమాత్మకు భార్యలు ఎంతమంది అంటే, ఎనిమిదిమంది అని అందరూ చెబుతారు. ఆయన వరించి, వివాహం చేసుకున్నవారు ఈ ఎనిమిదిమంది. వారే రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నగ్నజితి, కాళింది, మిత్రవింద, భద్ర, లక్ష్మణ. తిరుపతి వెళ్ళేవాలందరూ సాధారణంగా అక్కడి హరేరామ హరేకృష్ణ మందిరాన్ని ఒక్కసారైనా దర్శించే ఉంటారు . అక్కడ తన అష్టభార్యలతో కూడిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత సుందరంగా దర్శనమిస్తారు. వినాయక చవితినాడు చదువుకునే శమంతకోపాఖ్యానం కథలోనూ ఆయన జాంబవతీ దేవిని , సత్యభామాదేవినీ చేపట్టిన కథలు చదువుకుంటాం కదా . కానీ అష్టపత్నుల్లో రుక్మిణి , సత్యభామ , జాంబవతి తక్క మిగిలిన వారిని కళ్యాణమాడినకథలు తెలిసినవారు తక్కువేనని చెప్పాలి . మరి అద్భితమైన ఆవిషయాలు ఇక్కడ మీకోసం .
రుక్మిణి :
విదర్భ రాజు భీష్మకుని కుమార్తె రుక్మిణి శ్రీకృష్ణుడిని ఎంతగానో ప్రేమిస్తుంది. కానీ ఆమె తండ్రి రుక్మిణిని శిశుపాలునికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించాడు. రుక్మిణి దేవి సందేశం పంపడంతో, కృష్ణుడు విదర్భకు చేరుకుని, ఆమె అభీష్టం మేరకు ఎత్తుకెళ్లి వివాహం చేసుకున్నాడు.
సత్యభామ:
సత్యభామ సత్రాజిత్తు కూతురు. ఈమెను భూదేవి అవతారంగా భావిస్తారు. అంతకు ముందు జన్మలో ఎలాగైనా సరే శ్రీమహావిష్ణువుకు భార్య కావాలని తీవ్రమైన తపస్సు చేస్తుంది. దీంతో విష్ణుమూర్తిగా వరం అనుగ్రహించి , కృష్ణావతారంలో ఆమెను చేపడతారు పరమాత్మ.
జాంబవతి:
జాంబవంతుడు రామాయణ కథలోని వానర వీరుడు. రావణ సంహారానంతరం వరం కోరుకోమన్న రామునితో , నీతో ద్వంద్వ యుద్ధం చేయాలనుంది రామా ! అని కోరతాడు . త్వరలోనే నీ కోరిక తీరుస్తానన్న జగన్నాటక సూత్రధారి కృష్ణావతారంలోదానిని సాకారం చేస్తారు.
సూర్యుడి వరంతో శమంతకమణిని వరంగా పొందుతాడు సత్రాజిత్తు మహారాజు . దానిని తనకి ఇవ్వమని కోరతారు కృష్ణపరమాత్మ. అందుకు అంగీకరించడు సత్రాజిత్తు . ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్తారు . అక్కడ ఓ సింహం అతనిని చంపి, మణిని అపహరిస్తుంది. ఆ సింహాన్ని చంపి జాంబవంతుడు ఆ మణిని చేజిక్కించుకుంటారు . కానీ, సత్రాజిత్తు, శ్రీకృష్ణుడే మాణి మీది మొహంతో ప్రసేనుని వధించి దానిని అపహరించాడని పరమాత్మమీద నిండా మోపుతాడు . దీంతో ఆ మణిని వెతికేందుకు వెళ్లిన కృష్ణునికి జాంబవంతుడు తారసపడతారు. ఆయన కిచ్చిన వరాన్నిగుర్తుచేసుకొని, ద్వంద్వ యుద్ధంలో జాంబవంతుణ్ణి ఓడించి మణిని కైవసం చేసుకుంటారు పరమాత్మ . నాటి రాముడే , ఈ కృష్ణుడని తెలుసుకొని మణితోపాటు తన కుమార్తె జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు జాంబవంతుడు.
కాళింది:
సూర్యుని కుమార్తె కాళింది. విష్ణువుని భర్తగా చేసుకోవడానికి ఘోరంగా తపస్సు చేయడంతో, మహావిష్ణువు ప్రత్యక్షమై వరం అనుగ్రహిస్తారు. కృష్ణావతారంలో ఆమెని కళ్యాణం చేసుకొని కాళింది కోర్కెను తీరుస్తారు .
మిత్రవింద:
శ్రీకృష్ణుడి మేనత్త కుమార్తె, అవంతీ రాజ రాజకుమార్తె మిత్రవింద. కృష్ణుడు ఆమెను స్వయంవరంలో వరించి వివాహం చేసుకుంటాడు.
భద్ర:
శ్రీకృష్ణుడి మరో మేనత్త కేకయ దేశపు రాజు భార్య అయిన శృతకీర్తి పుత్రిక భద్రను కూడా ఆయన వరించి వివాహం చేసుకున్నారు.
నాగ్నజితి:
కోసల దేశాధిపతి నాగ్నజిత్తుకు ఏనుగుల వంటి శక్తి కలిలిగిన ఏడు వృషభాలు ఉండేవి. వాటిని నిలువరించిన వారికి తన కుమార్తె నాగ్నజితినిచ్చి వివాహం చేస్తానని ఆయన ప్రకటించాడు. కృష్ణ స్వామి ఏడు రూపాలు ధరించి వాటిని బంధిస్తారు. ఆపై నాగ్నజితిని పరిణయమాడతారు.
లక్ష్మణ:
మద్ర రాజ్యానికి చెందిన దేశాధిపతి కూతురు లాక్ష్మణిక. లాక్ష్మణిక స్వయంవరానికి కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, జరాసంధుడు వస్తారు. ఆ స్వయంవరంలో గెలిచి ఆమెను చేపట్టి భార్యగా అనుగ్రహిస్తారు .
అయితే ఈ ఎనిమిదిమందితోపాటు మరో పరిహారువేలమంది భార్యలు ఉన్నట్టు మన ఐతిహ్యాలు చెబుతున్నాయి . నరకాసుర వథ తర్వాత, అతని చెరలో ఉన్న 16 వేల మంది యువ రాణులను విడిపిస్తారు పరమాత్మ . వారు తాము కృష్ణుణ్ణే వరించామని , తమని చేపట్టమని వేడుకుంటారు . దీంతో వారిని అనుగ్రహించి భార్యలుగా చేపడతారు ద్వారకాధిపతి . భర్తగా ఉండమని వేడుకుంటే అందుకు కృష్ణుడు అంగీకరించి వారిని పెళ్లి చేసుకుంటాడు.
ఇలా శ్రీకృష్ణుడికి 16,వేల ఎనిమిది మంది భార్యలన్న మాట.
- లక్ష్మి రమణ