Online Puja Services

కృష్ణ యుక్తి

3.144.105.255

కృష్ణ యుక్తి 

అశ్వద్దామను అర్థం చేసుకోని దుర్యోధనుడు.. 

పాండవులకు కౌరవులకు  మధ్య యుద్ధం మొదలవబోతుందని  తెలిసి కృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని, యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళాడు.  

యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో భీష్ముడు,  ద్రోణుడు అయన కొడుకు అశ్వద్దామ, కర్ణుడు అని చాల మంచి యోధపరులు ఉన్నారని కృష్ణుడికి బాగా తెలుసు..

అందులోనూ అశ్వద్దామ మరణం లేని వరం పొందినవాడని తెలుసు.. కౌరవుల పక్షంలో అశ్వద్దామ సైన్యాధిపతిగా నియమించబడితే  పాండవులు గెలవలేరని  తలచిన కృష్ణుడు ఒక ఆలోచనను పన్నాడు.. 

హస్తినాపురం చేరుకున్న కృష్ణుడు సభలోని  అందరికి నమస్కరించి అశ్వద్దామని మాత్రం ఒంటరిగా తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా దుర్యోధనుడు గమనించసాగాడు..

అశ్వద్దామను క్షేమ సమాచారాలు అడుగుతూ తన వేలిలోని ఉంగరాన్ని కిందకు జారవిడిచారు..  

అశ్వద్దామ వంగి నేలపై ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా కృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి  మాట్లాడడం మొదలుపెట్టాడు..  

ఆకాశం వైపు చూసిన తరువాత అశ్వద్దామ కృష్ణుడి వేలికి ఉంగరాన్ని తొడిగాడు..  

ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడికి  అశ్వద్దామ "నేను కౌరవుల పక్షంలో ఉన్నా పాండవుల గెలుపుకు తోడ్పడతానని ఆ నింగి నేలపై ప్రమాణం చేసి మాట యిస్తున్నట్టు"  అర్థం చేసుకున్నాడు దుర్యోధనుడు.

ఈ అనుమానం తోనే చివరి వరకు అతన్ని యుద్ధంలో సైన్యాధిపతిగా నియమించలేదు  దుర్యోధనుడు.. 

17 వ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడి దెబ్బకు కాళ్ళు విరిగి పడిపోయిన  సమయంలో అశ్వద్దామ పలకరించాడు. నన్ను సేనాధిపతి చేసి ఉంటే మీకు అండగా ఉండేవాడిని అని అనగానే అప్పుడు దుర్యోధనుడు.. నువ్వు పాండవులకు సహాయం చేస్తానని ఆ కృష్ణుడికి మాట ఇచ్చావు కదా అని చెప్పాడు..

ఎవరు మాట ఇచ్చింది అని అశ్వద్దామ అడగగా అక్కడ జరిగింది, తను అర్థం చేసుకున్నది దుర్యోధనుడు వివరించగా 
ఆ మాటలు విన్న అశ్వద్దామ విరక్తితో  నవ్వాడు..  

ఆ కృష్ణుడి ఉంగరం జారిపడిపోతే అది తీసి ఇచ్చాను కానీ ఎటువంటి మాట ఇవ్వలేదు.. 
నాపైన అనుమానంతో నీ ఓటమికి నువ్వే కారణం అయ్యావు...  అప్పుడే నన్ను ఈ విషయం అడిగి ఉంటె నీకు తెలుసుండేది.. 
ఇది కూడా ఆ పరమాత్మ  పాండవులను  గెలిపించదానికి ఆడిన నాటకమే అని చెప్పాడు అశ్వద్దామ..

నిజమే.., అనుమానం వస్తే వెంటనే అడిగేయడం ఉత్తమం.. అంతే కానీ.. మనసులో దాచుకుని దానిని పెంచుకుంటూ  పోతే జీవితాల్లో దుర్యోధనుడిలా మనకు ఓటమి తప్పదు.. 

అనుమానం పెను భూతం అనే మాట నిజమే అనడానికి మంచి ఉదాహరణ భారతం లోని ఈ కధ..

- లలితా రాణి 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha