కృష్ణుని పుత్ర శోకం
కృష్ణుని పుత్ర శోకం
శ్రీ కృష్ణుడు శిశుపాలుడి బారినుంచి తప్పించి రుక్మిణీ దేవిని అపహరించి తెచ్చి రాక్షసవివాహం చేసుకున్నాడు. అటు పైని క్రమక్రమంగా జాంబవతి, సత్యభామ, మిత్రవింద, కాళింది, లక్షణ, భద్ర, నాగ్నజితి అనే కన్యలను పరిణయమాడాడు. అష్టమహిషులతో ఆనందాలు అనుభవించాడు. రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు అనే అత్యంత సుందరాకారుడు జన్మించాడు. జాతకర్మాదులు అయ్యాయి. ఒకనాడు శంబరాసురుడు మాయారూపంలో వచ్చి పురిటింటి నుంచి బాల ప్రద్యుమ్నుడిని అపహరించి తీసుకుపోయాడు. తన పట్టణానికి ఎత్తుకు పోయి మాయావతికి సమర్పించాడు.
వాసుదేవుడు పుత్రశోకంతో విలవిలలాడాడు. మనస్సులో జగన్మాతను శరణువేడుకున్నాడు. వృత్రాసురాది మహారాక్షసులను సంహరించిన యోగమాయను స్తుతించాడు.
పరాశక్తీ! పూర్వజన్మలో నా తపస్సులను నువ్వు మెచ్చుకున్నావు. నారాయణుడిగా (ధర్ముడి కుమారుడు) బదరికాశ్రమంలో వేలసంవత్సరాలు తపస్సు చేసి నీ అనుగ్రహం పొందాను. మరిచిపోయావా తల్లీ! ఇవ్వేళ పురిటింటి నుంచి ఎవరో నా బిడ్డను అపహరించి తీసుకుపోయారు. దుర్బుద్ధితోనే తీసుకుపోయారో, వేళాకోళానికి తీసుకుపోయారో? నా అహంకారం మీదమాత్రం దెబ్బవేశారు. అమ్మా! నీ భక్తుడికి ఇలా అవమానం జరిగితే నీకు అప్రతిష్ఠకాదా? ఈ ద్వారకా పట్టణం ఒక మహాదుర్గం. కట్టుదిట్టమైన కాపలా ఉంది. ఇందులో నేనుంటున్న ఇల్లు మధ్యభాగంలో ఉంది. ఆ ఇంటిలో అంతఃపురం మరింత లోపలగా ఉంది. అందులో పురిటిగది ఇంకా దుష్ప్రవేశ్యము. అయినా ఎవడో ఎలాగో వచ్చి బాలుణ్ణి ఎత్తుకుపోయాడు. ఎంత దురదృష్టం! నేను నగరంలోనే ఉన్నాను. ఎక్కడికీ పోలేదు. యదువీరులు కాపలా కాస్తూనే ఉన్నారు. అయినా అపహరణం జరిగింది. ఈ మాయను ఛేదించగలిగిన శక్తి నీకు మాత్రమే ఉంది.
అమ్మా ! నీ చరితం దురవగాహం. అతినిగూఢం. అన్నీ తెలుసుననుకుంటున్న నాకే తెలీదు.
ఇక సాధారణదేహధారుల సంగతి చెప్పాలా?
తల్లీ! నా బిడ్డడు ఏమైపోయాడు? ఎక్కడికి పోయాడు? ఇదంతా నువ్వు కల్పించిన మాయతెర. దయచేసి తెర తొలగించు. నీ లీలలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. దేవకీ గర్భం నుంచి బలరాముణ్ణి హరించి రోహిణీ గర్భంలో ప్రవేశ పెట్టావు. తల్లి ఒడినుంచి నన్ను అపహరించి యశోదమ్మ పొత్తిళ్లలో పడుకోబెట్టావు. జగన్మాతా! నీ మాయాశక్తి అపారం. త్రిగుణాత్మకంగా జగత్తును సృష్టిస్తున్నావు. పాలిస్తున్నావు. ఉపసంహరిస్తున్నావు. ఇది నీకొక నిత్యక్రీడ. సంసారులకు పుత్రోత్సవాన్ని కల్పిస్తున్నావు. పుత్ర విరహాన్ని రుచి చూపిస్తున్నావు. మా సుఖదుఃఖాలతో నువ్వు క్రీడిస్తున్నావు. వినోదిస్తున్నావు. ఇంతేకాకపోతే నాకు ఈ పుత్ర విరహం ఏమిటి!?
ఉత్పాద్య పుత్రజనన ప్రభవం ప్రమోదం
దత్త్వా పునర్విరహజం కిల దుఃఖభారమ్ |
త్వం క్రీడ సే సులలితైః ఖలు తైర్విహారైః
నో చేత్కథం మమ సుతాప్తి రతిర్వ్రుధా స్యాత్ ||
ప్రద్యుమ్నజనని (రుక్మిణి) వోలువోలున విలపిస్తోంది. నేను సన్నిధిలో ఉండీ ఓదార్చలేక పోతున్నాను. హే లలితే! మా దుఃఖాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. దుఃఖితులకూ భవరోగపీడితులకూ నువ్వేకదా దిక్కు ! మా దుఃఖాన్ని కడతేర్చు. ఏ సంసారికైనా పుత్రోత్పత్తి అనేది సుఖాలకు పరసీమకదా! అలాంటి సుఖాన్ని నాకు అందించినట్టే అందించి ఎందుకు దూరం చేశావు? నా గుండె పగిలిపోయేట్టుంది. అమ్మా! దారి నువ్వే చూపించాలి. నీకు సంతృప్తికరంగా యజ్ఞం చేస్తాను. వ్రతం చేస్తాను. పూజలు జరుపుతాను. నా పుత్రుణ్ణి నాకు దక్కించు.
శ్రీ కృష్ణుడి ప్రార్థనకు ఆదిపరాశక్తి ప్రత్యక్షమయ్యింది. ఓదార్చింది.
జనార్ధనా! దుఃఖించకు. ఒక పురాతనశాపం కారణంగా శంబరుడు తన యోగశక్తితో నీ పుత్రుణ్ణి అపహరించాడు. పదహారో ఏడు వచ్చేసరికి ప్రద్యుమ్నుడు తన బలంతో ఆ రాక్షసుణ్ణి సంహరించి నిన్ను కలుసుకుంటాడు. సందేహించకు. ఇది నా అనుగ్రహం - అని చెప్పి జగన్మాత అదృశ్యమయ్యింది. శ్రీకృష్ణుడూ రుక్మిణీ ప్రభృతులూ ఊరడిల్లారు.
జనమేజయుడికి ఇక్కడ ఒక సందేహం కలిగింది. వ్యాసుణ్ణి అడిగాడు. మహరీ! వైష్ణవాంశ సంభూతుడైన శ్రీకృష్ణుడికి దుఃఖమేమిటి? సూతికాగృహం నుంచి బాలుణ్ణి ఎవడో అపహరించి తీసుకుపోతూంటే తెలుసుకోలేకపోవడమేమిటి? అడ్డుకోలేకపోవడమేమిటి? అంత రకణ ఉన్న సూతికాగృహం నుంచి ఆ శంబరుడు అసలు ఎలా అపహరించగలిగాడు? ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. కొంచెం వివరించి నా సందేహాలు తీర్చు అని అడిగాడు. వ్యాసుడు వివరించాడు.
జనమేజయా! మాయాశక్తి చాలా బలవతి, మానవుల బుద్ధిని దారుణంగా మోహపరుస్తుంది. అది శాంభవీ విద్య, మానవజన్మ ఎత్తిన తరవాత ఎంతటి మధుసూదనుడికైనా మానవ లక్షణాలు తప్పవు. పూర్వజన్మలో దేవతలా దానవులా అనేది అప్రధానం. మానుషజన్మ - మానుషలక్షణాలు తప్పదు.
మానుషం జన్మ సంప్రాప్య గుణాస్సర్వే పి మానుషాః |
భవంతి దేహజా: కామం న దేవా నాసురాస్తదా |
ఆకలి, దప్పిక, నిద్ర, భయం, వ్యామోహం, శోకం, సంశయం, హర్షం, అభిమానం, వార్ధక్యం, మరణం, అజ్ఞానం, గ్లాని, అప్రీతి, ఈర్య, అసూయ, మదం, శ్రమ - ఇవన్నీ మానవదేహం ధరించినవారికల్లా తప్పని గుణాలు. అందుకే రాముడు కూడా తన పట్టాభిషేకం భంగమవుతుందనిగానీ, కాంచనమృగం ఉండదనిగానీ, సీతాదేవి అపహరింపబడుతుందనిగానీ, జటాయువు మరణిస్తాడనిగానీ ముందుగా తెలుసుకోలేకపోయాడు. అలాగే దశరథ మరణాన్ని తెలుసుకోలేకపోయాడు. అజ్ఞుడిలా అడవి అడవీ తిరిగాడు. జానకీదేవి జాడ తెలుసుకోలేకపోయాడు. వానరుల సహాయం అపేక్షించాడు. వారే సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చి చెప్పారు. సముద్రానికి సేతువు కట్టారు.
రావణ సైన్యంతో ఘోరయుద్ధం చేశారు. ఆ యుద్ధంలో రాముడు నాగపాశబద్దుడయ్యాడు తెలుసుగా! గరుత్మంతుడు వచ్చి విడిపించవలసి వచ్చింది. సరే - కట్టకడపటికి రావణుడిని సంహరించాడనుకో. అదికాదు, తాను జనార్దనుడైయుండీ సీతాదేవి సౌశీల్యాన్ని గ్రహించలేకపోయాడు. అగ్నిపరీక్ష పెట్టాడు. పోనీ అంటే - మరికొన్నాళ్ళకి లోకాపవాదానికి భయపడి పట్టమహిషిని - నిండు గర్భవతిని అడవులకు పంపించేశాడు. అక్కడ కుశలవులు జన్మించారు. అది తెలుసుకోలేకపోయాడు. వాల్మీకి తెలియజెప్పవలసి వచ్చింది. చివరికి - సీతాదేవి పాతాళానికి వెళ్ళిపోవడం కూడా రాముడికి తెలియలేదు. ఒళ్ళు తెలియని ఆ కోపంలో సోదరులపై విరుచుకుపడ్డాడు. తనకు కాలం ఆసన్నమైన సంగతిని మాత్రం తెలుసుకోగలిగాడా? అదీ లేదు. మానుషదేహాన్ని ఆశ్రయించాడు కాబట్టి అన్నీ మానుషచేష్టలే ఆచరించాడు..
ఇప్పుడు ఈ శ్రీకృష్ణుడూ అంతే. కంసుడికి భయపడి గోకులం చేరుకున్నాడు. జరాసంధుడికి భయపడి ద్వారపతికి పారిపోయాడు. రుక్మిణీ హరణం ఒకరకంగా అధర్మమే. శిశుపాలుడికి ఇవ్వాలనికదా వారి పెద్దల నిర్ణయం. ప్రద్యుమ్నుడు జన్మించాడని ఆనందించాడు, శంబరుడు అపహరించాడని దుఃఖించాడు. సత్యభామ కోరిక తీర్చడం కోసం భార్యావిధేయుడై ఇంద్రుడిమీదకి దండెత్తి పారిజాతాన్ని అపహరించి తెచ్చాడు. పుణ్యకవ్రతం పేరుతో సత్యభామ ఈ శ్రీ కృష్ణుణ్ణి చెట్టుకి కట్టేసి నారదుడికి దానంగా ధారపోసేసింది. బంగారం ఇచ్చి విడిపించుకుంది. ఎంతటి స్త్రీలోలుడో అనిపిస్తాడు.
- దేవీ భాగవతం ఆధారం గా