దండపాణిని తలుచుకున్నవారికి అపమృత్యుభయాలు ఉండవు .
దండపాణిని తలుచుకున్నవారికి అపమృత్యుభయాలు , శత్రుబాధలూ ఉండవు .
- లక్ష్మి రమణ
శ్లో॥ విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవమ్
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్ ॥
అని కాశీ క్షేత్రంలో విచ్చేసి ఉన్న దేవేతలని తలుచుకొని నమస్కరించుకుంటాం. సనాతన ధర్మావలంబకులైన ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రోజూ ఈ శ్లోకాన్ని చదువుకొని ‘మాకు కాశీ వెళ్లే అదృష్టాన్ని జీవితంలో ఒక్కసారైనా అనుగ్రహించమని, వీలయితే, కాశీలో అనాయాస మరణాన్ని అనుగ్రహించమని ఆ విశ్వేశ్వరున్ని వేడుకుంటూంటారు. ఈ కాశీ క్షేత్రం అంత గొప్పది . మహిమోపేతమైనది. ఈ శ్లోకములో మనం స్మరించుకొనే మహనీయ దేవతా మూర్తుల్లో దండపాణి ఒకరు . ఆయన గురించిన విశేషాలు తెలిసినవారు తక్కువేనని చెప్పుకోవాలి . కాశీ ఖండంలో ఆ దండపాణి ఆవిర్భావ వైశిష్యం తెలియవస్తూ ఉంది . ఆ కథని ఇక్కడ చెప్పుకుందాం .
పూర్వం రత్న భద్రుడు అనే యక్షుడుండే వాడు. అతను పుణ్యాత్ముడు, పరమ ధార్మికుడు. అతనికి పూర్ణ భద్రుడనే కుమారుడున్నాడు .కుమారునికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత తండ్రి అన్నిటి విషయాలు కొడుక్కి అప్పగించి శాంభవ యోగం చేత ఈశ్వరైక్యం చెందారు. కుమారుడు సర్వభోగాలు అనుభవిస్తూ, జీవనం గడుపుతున్నప్పటికీ, పుత్రులు లేకపోవడం చేత మనస్తాపం చెందాడు. పుత్రుని పొందితేనే జీవితం ధన్యమని తలపోశాడు. దాంతో తనకున్న అపార సంగీత విజ్ఞానంతో పూర్ణ భద్రుడు మహా శివుని మెప్పించాడు .శివానుగ్రహం వల్ల భార్య కనక కుండల గర్భం దాల్చింది .కుమారుడు జన్మించాడు .అతనికి హరి కేషుడు అని పేరు పెట్టారు .
శివుని అనుగ్రహంతో జన్మించిన హరికేశుడు మహా శివభక్తుడు. ఎనిమిదో ఏటే హరి కేశునికి శివభక్తి అలవడింది. శివుడి ధ్యానం, ద్యాస తప్ప ఆ పిల్లవాడికి మరో ప్రాపంచిక ధ్యాసే లేదు. నాలుక నిత్యమూ ఆ హర నామం మాత్రమె నర్తిస్తూ ఉండేది. దుమ్ముతో లింగాన్ని చేసి, గరిక తొ పూజించే వాడు .
తండ్రి పూర్ణ భద్రుడికి కొడుకు వింత ప్రకృతి అర్ధం కాలేదు .ఈ పూజలు, వైరాగ్య చింతన రావలసింది ముసలి తనంలో. ప్రస్తుతం నీకర్తవ్యం గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం . ముందు వివాహం చేసుకొని సంతానాన్ని కని తమకు సంతోషం కలుగ జేయమని నచ్చ చెప్పే వాడు. ఇదేవిధంగా ఒకరోజు తండ్రి గట్టిగా మందలించేసరికి, హరికేశుడు ఇల్లు వదిలి పెట్టి వెళ్లి పోయాడు .
ఏదిక్కూ లేనివారికి ఆ విశ్వేశ్వరుడే దిక్కు . అందువల్ల విశ్వేశ్వరుడైన శివుడే సర్వశ్యా శరణాగతి అని తలిచి, కాశీ బాటపట్టారు. కాశీ నగరానికి చేరుకొనే ప్రయత్నంలో ఒక అరణ్యంలో ప్రవేశించి అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని పరమేశ్వరుని కోసం ఉత్తమ తపస్సాచరించాడు .
పరమేశ్వరుడు అతని తపస్సుకి మెచ్చి, పార్వతీ సమేతం గా ప్రత్యక్ష మైనాడు. అప్పటికి హరికేశుని రూపం పూర్తిగా మారిపోయింది . అతని జుట్టు అంత జడలు కట్టింది .శరీరం అంతా పుట్టలు పట్టాయి .మాంసం లేని ఎముకల గూడుగా మిగిలి ఉన్నారు. తెల్లని శరీరంతో శంఖంలా మెరుస్తున్నారు. ఆయన మాంసాన్ని కీటకాలు పొడుచుకు తింటున్నాయి. అతని పింగళా దృష్టి దిగంతాల వరకు వ్యాపించి ,అతని తపోగ్ని అంతటా ప్రసరిస్తోంది . భక్తీ తప్ప ఇంకేమీ అతనికి తెలియదు సింహానికి భయ పడ్డ లేడి పిల్లలు అతన్ని రక్షిస్తున్నాయి .
పరమేశ్వరుడు వృషభ వాహనం దిగి పుట్టలో ఉన్న హరి కేషుని చేయి పట్టి బయటికి తెచ్చాడు .అతడు పరమేశ్వర సాక్షాత్కారంతో పరవశించి ఈశ్వరుణ్ణి పరిపరి విధాలుగా స్తుతించాడు. అప్పుడు అపారమైన కారుణ్యాన్ని పొందిన ఈశ్వరుడు మెచ్చి “నువ్వు దక్షిణ దిశలో నివశిస్తూ నా కనుసన్న లలో మెలుగుతూ ఉండు. దుష్టులను దండిస్తు, భక్తులని రక్షిస్తూ దండపాణి అనే పేర ప్రసిద్ధి పొందుమని” ఆశీర్వదించారు.
ఆవిధంగా హరికేశుడు దండపాణిగా పేరొందిన వైనాన్ని స్కందుడు అగస్త్య మహర్షికి వివరించారు . కాశీ క్షేత్రంలోనూ, విశ్వేశ్వరుని భక్తులైనవారినీ ఆ దండపాణి సదా రక్షిస్తూ ఉంటారు .
సదా భక్తులైనవారిని , నిజమైన భక్తితో తనని ఆశ్రయించేవారిని ఆ విశ్వేశ్వరుడు వెన్నంటి అడిగినా అడగకపోయినా అపారమైన కృపా కటాక్షాలతో ఆశీర్వదిస్తారని , అనుగ్రహిస్తారని ఈ కథ తెలియజేస్తుంది . అందువల్ల పూర్ణమైన మనస్సుతో ఆ పరమపావనమైన పరమేశ్వరనామాన్ని ఒక్కసారి స్మరిద్దాం .
శివాయ గురవే నమః !!
శుభం .