Online Puja Services

ఆ భోళాశంకరుడే దిక్కు

3.138.114.140

సాధించలేనిది ఏదైనా సాధించాలంటే, ఆ భోళాశంకరుడే దిక్కు !!
- లక్ష్మి రమణ 

పరమేశ్వరుణ్ణి కోరుకుంటేనే కొంగు బంగారం కాదు, భోళా శంకరుడు మనం ఏమీ కొరకపోయినా మానవ జన్మకి ఏంకావాలో దాన్ని అయాచితంగా అనుగ్రహించే వరదుడు.  ఆ దేవదేవుని అనుగ్రహం ఎలాంటిదో ఇదివరకే పురాణాంతర్గతమైన అనేక ఉదంతాలలో మనం  తెలుసుకున్నాం . అటువంటి అపారమైన పరమేశ్వర కృపా కటాక్షాన్ని వివరించే అద్భుతమైన ఆధ్యాత్మిక సౌరభాన్ని ఆస్వాదిద్దాం .  ఈ దివ్య సౌరభం స్కాందపురాణాంతర్గతం.  ఈ కథని విన్నా, చదివినా, వినిపించినా అపారమైన పుణ్య సంపదలు కలుగుతాయి. మరింకెందుకాలశ్యం, చదివేయండి !! 

 పూర్వం పుష్కసుడనే క్రూరుడైన రాక్షసుడు ఉండేవాడు.  అతడు అడవిలో మృగాలను వేటాడుతూ వాటిని దారుణంగా వధించేవాడు.  భల్లూకాలనీ ,  పులుల్ని, సింహాలనే కాక బ్రాహ్మణులని ప్రత్యేకంగా వెతికి మరి చంపేవాడు.  అతడు ఎంత దుర్మార్గుడో  అతడి భార్య కూడా అంతటి దుర్మార్గు రాలే.  ఈ విధంగా ఆ కిరాత దంపతులిద్దరూ కాలం గడపసాగారు.  ఒకనాడు పుష్కసుడు రాత్రిపూట పందిని వేటాడాలనే ఉద్దేశ్యంతో దాహం వేస్తే తాగడానికి కొన్ని నీళ్లు తీసుకొని  బిల్వ వృక్షం మీదకి ఎక్కాడు.  చేతిలో విల్లు బాణాలు పట్టుకుని పంది రాక కోసం ఎదురుచూస్తున్నాడు. 

అది మాఘమాసంలోని కృష్ణ పక్షంలోని చతుర్దశి.  పందిని ఎలాగైనా చంపాలని ఆ నాటి రాత్రంతా మేలుకునే ఉన్నాడు పుష్కసుడు.  కానీ పంది ఎంతకీ అటువైపుగా రాకపోవడంతో అసహనం అతని కమ్ముకుంది.  ఆ చెట్టుకున్న బిల్వపత్రాలని ఒక్కటి ఒక్కటిగా తుంచి కింద పడేయడం మొదలుపెట్టాడు.  అలాగే, తాను  దాహం కోసం తెచ్చుకున్న నీళ్ళని కూడా కొద్దిగా తాగి, కొన్ని పుక్కిలించి కిందకి ఉమ్మేసాగాడు. విధివశాత్తూ, ఆ కిరాతుడు ఆ విధంగా విసిరిన బిల్వ దళాలు, ఉమ్మేసిన నీళ్లు ఆ చెట్టు కింద ఒక పక్కగా ఉన్న శివలింగం మీద పడ్డాయి.  అలా అతడు తనకు తెలియకుండానే మాఘ కృష్ణ చతుర్దశి నాడు శివ పూజ చేశాడు. 

ఇంతకీ , అతను వేటాడాలని వచ్చిన పంది మాత్రం ఎంతకీ రానేలేదు. తూరుపు తెల్లవారిపోతోంది.  దాంతో బాగా విసిగొచ్చి, చెట్టు దిగి కిందకొచ్చాడు.  అక్కడికి దగ్గర్లో ఉన్న మడుగు దగ్గరికి వెళ్లి అందులో ఉన్న చేపల్ని పట్టి చంపడం ప్రారంభించాడు. 

మరోవైపు పుష్కసుడి భార్య అయిన  ఘనోదరి భర్త కోసం ఇంటిదగ్గర ఎదురుచూస్తూ ఉంది ఎంతసేపటికి పుష్కసుడు రాలేదు. రాత్రంతా భర్తకోసం ఎదురుచూస్తూ జాగారమే చేసింది . ఉదయం అవుతున్నా ఇంకా పుష్కసుడు రాకపోవడడంతో, ఆమెకి కొద్దిగా ఆందోళన కలిగింది. తనలో తానే “అయ్యో రాత్రి అప్పుడే రెండు జాములు గడిచిపోయింది.  అంతా చీకటిగా ఉంది.  వేట కోసం వెళ్ళిన నా భర్త ఇంకా రాలేదేమిటి? ఒకవేళ వేటాడేటప్పుడు ఏ సింహము పులో అతని చంపేసిందా? లేదా పాముల తలల మీద మణులు హరిస్తూ వాటి కాటుకి గురయ్యాడా? వేటకోసం నిరీక్షించడానికి  చెట్టు ఎక్కి  కాలుజారి కింద పడిపోయి ఉంటాడా? ఏం జరిగుంటుంది ?  అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, బాధపడ సాగింది.  

వినీల గగనంలో ఉదయభానుడు దర్శనమివ్వడంతో ,  కిరాతుడు నిన్న రాత్రి మడుగులో నుంచి బయటకు తీసి చంపిన చేపలు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అప్పుడతడికి ఆహారం సంపాదించుకొని, తనకోసం వెతుకుతూ,  అడవిలోకి వచ్చిన భార్య కనిపించింది.  తన భర్తను చూడగానే ఆమెకు ఎంతో ఆనందం కలిగింది. 

 “రావయ్య రా! నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా! నిన్న రాత్రి అంతా ఎక్కడున్నావు? నీవు రాలేదని నిన్నంతా నేను అన్నం కూడా తినలేదు. ఇదిగో అన్నం తీసుకొచ్చాను. ఇద్దరం స్నానం చేసి తిందాం పద” అన్నది.  కిరాతుడు అతని భార్య ఇద్దరు కలిసి అక్కడున్న చెరువులో స్నానం చేశారు.  ఇద్దరు కలిసి ఒక చెట్టు కింద కూర్చుని, భోజనం చేయబోతున్నారు. 

ఈ విధంగా, వాళ్ళిద్దరూ కాస్త ఆదమరచి ఉండగా ఒక కుక్క అక్కడికి వచ్చి, వాళ్ళు తెచ్చుకున్న అన్నమంతా తినేసింది.  దీంతో కిరాతుడి భార్యకి చాలా కోపం వచ్చింది. పక్కనున్న కర్రతో ఆ కుక్కని కొట్టబోయింది.  ఏమయ్యా ఈ పాపిష్టి కుక్క మన అన్నమంతా తినేసింది.  ఇక నువ్వేం తింటావు? నీకు యోగం లేదు, ఇలా ఆకలితో ఉండాల్సిందే!!” అంది నిష్ఠూరంగా.  

భార్య మాటలు విన్న పుష్కసుడు ఆమెతో “సఖీ! ఆ కుక్క మన అన్నం తిన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.  క్షణభంగురమైన ఈ శరీరాన్ని నిలుపుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? ఒక్క పూట తినకపోతే ఏమి కాదులే! నువ్వు అనవసరంగా ఆవేశపడకు.  కోపం వీడి  శాంతంగా ఉండు” అంటూ హితబోధ  చేశాడు.  

ఆ విధంగా పుష్కసుడు తనకు తెలియకుండానే చతుర్దశి నాడు జాగారం చేసి, శివరాత్రి వ్రతం పాటించడం వల్ల ఎలాంటి పుణ్యఫలం లభిస్తుందో దాన్ని అటువంటి పుణ్యాన్ని పొందగలిగాడు. అమావాస్య రోజు రెండు ఘడియలు దాటాక ఎన్నో శివగణాలు పుష్కసుడి దగ్గరకు వచ్చారు.  అంతమంది శివగణాలను చూసి ఆశ్చర్యపోయి, వారితో “అయ్యా మీరంతా ఎవరు? అందరూ విభూతి రుద్రాక్షలు ధరించి కనిపిస్తున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు” అని ప్రశ్నించాడు. 

అప్పుడు పుష్కసునితో  రుద్ర గణాలు ఇలా చెప్పారు.  “ఓ కిరాతా ! పరమేశ్వరుడు పంపించగా మేమంతా ఇలా వచ్చాము.  నీ భార్యతో సహా నిన్ను కైలాసానికి ఆ పరమేశ్వరుడు తీసుకురమ్మన్నాడు.  రా! వచ్చి మీ ఇద్దరూ ఈ విమానాన్ని ఎక్కండి. మిమ్మల్ని శివ సన్నిధికి తీసుకువెళతాము .  నీవు నిన్న మహాశివరాత్రి నాడు నీకు తెలియకుండానే లింగార్చన చేశావు ఆ పుణ్య కర్మ ఫలితంగా శివలోక ప్రాప్తి కలిగింది. నీ భార్య కూడా నీకోసం ఎదురు చూస్తూ రాత్రంతా నీ లాగానే జాగారం చేసింది.  నీవు రాలేదని బెంగతో ఉపవాసముంది.  మీ ఇద్దరూ చేసిన ఈ ఉపవాస జాగరణల వల్ల పరమేశ్వరుడు ఎంతో సంతోషించాడు.  అందుకే మీకు ఈ దివ్యమైన యోగం కలిగింది” అని చెప్పారు . 

 శివగణాల మాటలు విన్న పుష్కసుడు అతని భార్య ఎంతో ఆనందించారు వెంటనే శివగణాలతో కలిసి విమానాన్నీ అధిరోహించి  కైలాసానికి వెళ్ళిపోయారు. 

పామరుడైన ఒక వేటగాడు తెలియక చేసిన పూజ (ఉమ్మివేయడం పూజా ? అని సందేహం రావొచ్చు.  పరమాత్మ అనుగ్రహిస్తే, అది పూజే ! పరమేశ్వరుడి అనుగ్రహాన్ని ఇక్కడ గమనించాలి.  తెలిసి చేస్తే, అది ఖచ్చితంగా శివ అపరాధము !! ఇది గుర్తుంచుకోవాలి . ) అతనికి కైవల్యాన్నిచ్చింది . పరమేశ్వరున్ని తెలుసుకోగోరి , మనసు నిండా పిలిస్తే, చాలు ఆ పరమాత్మ సన్నిధి మనకి చేరుకోలోని దూరమవుతుందా !! ప్రయత్నించండి !! నిజానికి, ఈ జన్మకి సార్ధకత అదే కదా !! 

శుభం . 

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi