Online Puja Services

భక్తికి అసలైన నిర్వచనం ఈ కిరాతుని వృత్తాంతం.

3.149.237.231

 భక్తికి అసలైన నిర్వచనం ఈ కిరాతుని వృత్తాంతం. 
- లక్ష్మి రమణ 

దేవతా పూజల్లో శివపూజకు ప్రత్యేకత ఉంది . శివుని పూజించడానికి ప్రత్యేకమైన ద్రవ్యాలు ఏవీ అవసరం లేదు . శివపూజకు కావలసిన ఒకే ఒక ప్రత్యేక ద్రవ్యం భక్తి . కేవలం భక్తి అంతే . ఆయన యెంత భక్త సులభుడంటే , ఏ రకంగా పూజించినా అనుగ్రహిస్తాడు . భక్త కన్నప్ప నోటితో నీళ్లు పుక్కిట పట్టి తనమీద పోసి ఇది నీకు అభిషేకం అంటే అనుగ్రహించాడు . నాగలోకపు నాగము రాళ్ళు (మణులు ) పడేసి పూజంటే, అనుగ్రహించాడు . అలా ఆయన అనుగ్రహం పొందిన వారు ఎందరెందరో !! అటువంటి ఒక కిరాతుని కథ స్కాందపురాణం నుండీ చదవండి . ఆ అయ్యమీద భక్తి ఇటువంటి కథలని చదవడం చేత అలా నిలబడిపోతుంది అంటే ఆశ్చర్యం అవసరం లేదు . 

పూర్వం అవంతిపురంలో నంది అనే వైశ్యుడు ఉండేవాడు.  అతడు గొప్ప శివ భక్తుడు.  ప్రతిరోజు ఆ నగరానికి సమీపంలో ఉన్న ఒక వనానికి వెళ్లి అక్కడ ఉన్న ప్రాచీన శివలింగాన్ని అర్చించేవాడు.  శాస్త్ర విధానంగా శివుడికి నిత్యము పంచామృతాలతో అభిషేకం చేసి, షోడశోపచారాలతో ఆయన్ని దివ్యంగా పూజించేవాడు.  పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు, ఫలాలు, ముత్యాలు, ఇంద్రనీలాలు, గోమేదిక, వైడూర్యాలు, మాణిక్యాలు లింగానికి సమర్పించేవాడు. ఈ విధంగా అడవిలో ఉన్న ఆ శివలింగం నంది చేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాలు పోషింపబడింది. 

 ఒకనాడు అడవి మృగాలని వేటాడే కిరాతకుడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు. అతడికి ప్రాచీన శివలింగం ఉన్న ఆలయం కనిపించింది.  శివుడంటే ఆ కిరాతునికి భక్తి . ఆ లింగాన్ని చూస్తూనే పులకించిపోయాడు  . అక్కడికి సమీపంలోనే ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళాడు . ఒడ్డున తన సామాన్లు అన్నీ పడేసి, సరస్సులోకి దిగి కడుపునిండా నీళ్లు తాగాడు.  కొంత నీటిని పుక్కిటిలో ఉంచుకుని బయటికి వచ్చాడు.  

ఎదురుగా శివలింగం కనిపించింది.  రకరకాల రత్నాలతో పుష్పాలతో అలంకరించి కనిపించింది.  కిరాతుడు సరాసరి శివలింగం దగ్గరకు వచ్చి అక్కడున్న రత్నాలన్నీ పక్కకి తోసేసి, తన పుక్కిట పట్టి తెచ్చిన నీళ్లతో లింగానికి స్నానం చేయించాడు.  పక్కనే బిల్వ వృక్షం ఉంది.  దాని ఆకుల్ని తెచ్చి, స్వామి మీద వేశాడు. అలాగే వేటాడి తెచ్చిన మాంసం మొక్కని సంచి నుంచి తీసి, నైవేద్యం పెట్టాడు. ఇలా తనకు తోచన రీతిలో శివ పూజ చేసిన ఆ కిరాతుడు “స్వామీ శంకరా! నిన్ను చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది.  ప్రతిరోజు నీకు ఇలాగే పూజలు చేస్తాను.  నన్ను కరుణించు స్వామి” అని వేడుకున్నాడు. ఆవిధంగా  ప్రతిరోజూ కిరాతుడు అక్కడికి వచ్చి ఇదే విధంగా పూజలు చేయడం మొదలుపెట్టాడు. 

ఈ విషయాన్ని అక్కడికి వచ్చిన నంది చూశాడు. ఎంతో బాధపడుతూ ‘అయ్యో, నేను ఏదో పాపం చేసి ఉంటాను.  నా పూజలో ఏదో లోపం ఉంది.  నేను చేసే పూజ స్వామికి నచ్చలేదేమో! ఇదంతా నా దురదృష్టం’ అని చింతిస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు. నంది దీనంగా దిగులుగా ఉండటం చూసి ఆయన పురోహితుడు ‘అయ్యా తమరు ఎందుకు ఇలా చింతాక్రాంతులై ఉన్నారు’ అని అడిగాడు. ‘బ్రాహ్మణోత్తమా నేను ఈరోజు శివ పూజ కోసం వనానికి వెళ్లాను.  అక్కడ శివుని ముందు మాంసాన్ని చూశాను. ఇంతకుముందు నేను చేసిన పూజనంతా ఎవరో చిందర వందలు చేసేసారు.  నాకు చాలా బాధగా ఉంది.  నా పూజను చెడగొట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టిన వాడెవడో నాకు కనిపించలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి?’ అని అడిగాడు. 

 పురోహితుడు నందితో ‘అయ్యా తమరు ఏమి బాధపడకండి.  రేపు ఉదయం నేను కూడా మీతో వస్తాను.  ఇద్దరము కలిసి ఆలయానికి  వెళదాం.  రోజూ వచ్చి మన పూజ చెడగొట్టేవాడు ఎవడో తెలుసుకుందాం అని ధైర్యం చెప్పాడు.  అలాగే ఆ మర్నాడు ఇద్దరు కలిసి వనంలో ఉన్న శివలింగం దగ్గరికి వెళ్లారు. పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠీస్తూ ఉండగా, నంది చక్కగా లింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేశాడు.  తర్వాత యధావిధిగా రత్నాలు పుష్పాలు సమర్పించి సోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహించాడు. ఇలా రెండు జాముల కాలం గడిచింది.  

అప్పుడు మహా కాలుడిలా నల్లగా ఎత్తుగా ఉన్న కిరాతుడు చేతిలో ధనస్సు బాణము పట్టుకుని అక్కడికి వచ్చాడు. ఎంతో భయంకరంగా ఉన్న ఆ కిరాతుని చూసి నంది భయపడిపోయాడు. అతడితోపాటు పక్కనున్న పురోహితుడు అతని బృందమూ కూడా వణికిపోయారు.  రోజు చేసినట్టే ఆ కిరాతుడు వాళ్ళు ఎవ్వరిని పట్టించుకోకుండా, అప్పటిదాకా వారు చేసిన పూజా ద్రవ్యాలు అన్నీ పక్కకు తీసేసి, పుక్కిటి జలంతో అభిషేకం చేసి, మాంస ఖండాన్ని నైవేద్యంగా స్వామికి సమర్పించాడు.  బిల్వపు ఆకులు తెంపి లింగం మీద వేశాడు.  ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయాడు. 

 ఈ దృశ్యాన్నంత చూసిన నందికి అతడి పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులు అందరినీ పిలిచి ఈ విషయాన్ని వారికి చెప్పాడు.  విప్రులారా ! ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ పండితులు నందితో ‘అయ్యా నీవు ఎంతో పవిత్రంగా చేసే పూజ ప్రతిరోజూ పాడు చేయబడుతోంది.  ఇక ఆ లింగం అక్కడ ఉండడం మంచిది కాదు.  మీరు వెంటనే దాన్ని తీసుకొచ్చి మీ గృహంలో ప్రతిష్టించండి.  అదే మీకు శ్రేయస్కరం’ అని సెలవిచ్చారు.  నంది వారి మాట ప్రకారం వనంలో ఉన్న లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యధావిధిగా పూజించాడు.  మర్నాడు కిరాతుడు అక్కడికి వచ్చి చూసేసరికి లింగము కనిపించలేదు.  ఒక్కసారిగా అతడికి దుఃఖము ముంచుకొచ్చింది. ‘ప్రభూ ! శివ శంకరా ! నన్ను వదిలి ఎక్కడికి వెళ్లావు? నిన్ను చూడక పోతే నా మనసు ఎంతో బాధపడుతుంది. దయవుంచి నాకు దర్శనమివ్వు ప్రభూ ! నీవు రాకపోతే నా ప్రాణాల్ని వదిలేస్తాను.  ఓ పరమేశ్వరా ! కరుణించు!!’ అని తీవ్రంగా విలపించాడు. 

అయినా సరే శివుడు కనిపించలేదు.  వెంటనే అన్న మాట నిలబెట్టుకోవాలని భావించిన కిరాతుడు, తన గోళ్ళతో గుండెను చీల్చుకుని రోషంగా అరుస్తూ, ‘ప్రభూ ! ఇదిగో నా గుండెను చీల్చాను. ఇప్పటికైనా రా అని పిలిచాడు. ఆ తర్వాత తనలోని జీర్ణావయవాలనే శివునిగా భావన చేసి ,  ప్రేగుల్ని మాంసాన్ని బయటకు తీసి, ఇదివరకున్న  లింగంను  తీసిన గోతిలో వేశాడు. అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్లి  నీళ్లు తెచ్చి ఆ గోతిలో పోసాడు పక్కనే ఉన్న బిల్వపత్రాలని శక్తి లేకపోయినా ఎలాగో తుంచి అక్కడ సమర్పించాడు.  ఇక పూర్తిగా జీవం నశించి రక్తం ధారలుగా కారిపోతుండగా, అలాగే నేల మీద గొప్ప కూలిపోయాడు . 

అంతలో దివ్యకాంతులు వెదజల్లుతూ ప్రమథగణాలతో శివుడు ప్రత్యక్షమయ్యాడు.  కర్పూర కాంతితో ప్రకాశిస్తూ జటాజూటాన్ని, త్రిశూలాన్ని, చంద్ర రేఖని ధరించిన శివుడు కిరాతుడి చెయ్యి పట్టుకుని పైకి లేపి ,అతడి గాయాలన్నీ పోగొట్టాడు.  ఎంతో ప్రేమగా అతనితో ఇలా అన్నాడు. “ ఓ కిరాతా  నువ్వు ఎంతో గొప్ప భక్తుడివి. నాకు సంతృప్తి కలిగేలా పూజలు చేశావు.  నాకోసం ప్రాణాలు సమర్పించడానికి సిద్ధపడ్డావు . నీ భక్తి అనన్య సామాన్యం.  నీకేం వరం కావాలో కోరుకో” అన్నాడు.  

రుద్రుడి మాటలు వినగానే కిరాతుడికి ఎంతో ఆనందం కలిగింది. వెంటనే ఆయన పాదాల మీద పడి “ప్రభూ ! నేను నీ దాసుడిని.  నాకు జన్మ జన్మల్లోను నీ మీద అచంచలమైన భక్తి ఉండేలాగా అనుగ్రహించు. నీవే నాకు తల్లివి, తండ్రివి, గురువు, దైవము, బంధువు, మిత్రుడు కూడా! ఇక నాకు వేరే ఏ కోరికా లేదు.  నిన్ను దర్శిస్తూ ఉంటే చాలు” అని వినయంగా పలికాడు.  నిష్కల్మషమైన కిరాతుడి భక్తికి శివుడు ఎంతో చలించిపోయి అతన్ని తన శివ మందిరానికి ద్వారపాలకుడిగా నియమించాడు.  అదే సమయంలో దేవ దుందుభిలు మ్రోగాయి.  ఆ ధ్వని వనం పక్కనే ఉన్న నంది ఇంటిదాకా వినిపించాయి వనంలోకి దివ్యమైన ధ్వనులు వినపడేసరికి, నంది ఎంతో ఆదుర్దాగా అక్కడికి పరుగు పరుగున వచ్చాడు.  అపారమైన ఈశ్వర కృపకు పాత్రుడైన కిరాతుడు అక్కడ అంజలి ఘటించి పరమేశ్వరుని ఎదుట నిలిచి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు . అక్కడ లింగము ఎలా ఆవిర్భవిందో ఊహించలేకపోయారు . అది కేవలం ఆ కిరాతుని భక్తిగా తెలుసుకొని తన అజ్ఞానానికి చింతించాడు. 

వెంటనే కిరాతుడి చేతులు పట్టుకుని “అయ్యా నీవు గొప్ప శివ భక్తుడివి . నీకు దొరికిన అదృష్టానికి నేను నోచుకోలేదు . ఆ పరమేశ్వర కృప నాకు  కలిగేలా అనుగ్రహించు .  ఆయన  సన్నిధికి నన్నుకూడా తీసుకువెళ్ళు” అని ప్రాధేయపడ్డాడు . కిరాతుడు అతని చెయ్యి పట్టుకుని శివుడి దగ్గరకు తీసుకువచ్చి “ శివా ! ఇతడు నంది అనే వైశ్యుడు. నిత్యము నిన్ను రత్నాలతో పూజించేవాడు .  ఇతడు నా మిత్రుడు” అని పరిచయం చేశాడు. కిరాతుడి మాటలు విన్న శివుడు “ఓ కిరాతా  ఈ నంది ఎవరో నాకు తెలియదు. కల్లాకపటం లేని నీవే నా నిజమైన భక్తుడివి. నా మిత్రుడివి.  ఎలాంటి స్వాభిమానము దురహంకారము లేనివాడే నా నిజమైన భక్తుడు.  అంతే కానీ, స్వార్థంతో కూడిన వాడు కాదు” అని చెప్పాడు.  అప్పుడు కిరాతుడు “ప్రభూ !  నేను నీకు స్నేహితుడిని అన్నావు కదా! ఇతడు నాకు మిత్రుడు అంటే మీకు మిత్రుని మిత్రుడు గనుక అతను  మీకు మిత్రుడేగా ప్రభు! దయచేసి నాతోపాటు ఇతని ఉద్ధరించు” అని ప్రార్థించాడు.  అలా కిరాతుడి మాటను కాదనలేక శివుడు వారిద్దరినీ తన పరిచారకులుగా స్వీకరించాడు. 

 అదే సమయంలో దివ్య విమానం అక్కడికి వచ్చింది ఇద్దరూ కలిసి దానిని అధిరోహించి కైలాసం చేరుకున్నారు . అక్కడ వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, “స్వామీ ! మేమిద్దరము నీ ద్వారానికి కాపలాగా ఉంటాము.  దయచేసి మాకా సేవా భాగ్యాన్ని ప్రసాదించండి” అని కోరారు.  వారి భావాన్ని తెలుసుకున్న శివుడు అలాగే మీరిద్దరూ అక్కడే ఉండి, నన్ను సేవించండి” అని ఆదేశించారు . 

ఆ విధంగా కిరాతుడు మహాకాలుడుగా, నంది నందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ నిత్యం ఆయన్ని సేవిస్తూ ఉన్నారు. నంది ఆ తరువాత శివ ధర్మాన్ని ఈ విధంగా చెప్పారు.  ఇది స్కాంద పురాణంలోని 5దవ అధ్యాయములో ఉంటుంది.  “పాపాలు చేసేవారు, అధర్మాన్ని ఆచరించేవారు, గుడ్డివారు, మూగవారు, కుంటివారు, కులము గుణము లేనివారు, చెడ్డ మనసు కలిగిన వారు, చెండాలురు ఇలా  ఎలాంటి వారైనా సరే శివ భక్తిని కలిగి ఉంటే చాలు. దేవాది దేవుడైన ఆయన సాన్నిధ్యాన్ని తప్పకుండా పొందుతారు.  కేవలం ఇసుకతో చేసిన శివలింగాన్ని భక్తిగా పూజించిన చాలు వారు తప్పకుండా రుద్ర లోకాన్ని చేరుకుంటారు”.  శుభమ్ .

#skandapuranam #shiva #siva #nandi #mahakaludu

Tags: Nandi, Mahakaludu, shiva, siva, skandapuranam, skanda puranam,

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi