Online Puja Services

కుబేర గర్వభంగం

18.118.207.114
ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత....
ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తాడు.
శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు, నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసంకు చేరుకుంటాడు.
శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమంకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్దం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు.
కుబేరుడు వచ్చి.. మహాదేవా.. మీరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు.
శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీ దేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు.
వస్తూనే... 'అమ్మా! ఆకాలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు' అన్నాడు గణపతి.
పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి..
'కుబేరా!
మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు' అనగా, శివుడు 'ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళూ' అన్నాడు పరమశివుడు.
హా! ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకోచ్చేది.
ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని బయలుదేరాడు. తన భవనంలోకి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించసాగాడు.
ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.
వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధలు, పానీయాలు, కూరలు, పండ్లు.. గణపతికి వడ్డించారు.
కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు.
సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు.
ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.వంటవారికి ఆహారం వండటం గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం చూస్తూండగానే ఖాళీ అయిపోయింది.
విషయం కుబేరుని తెలిసింది. తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు.
కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.
శివా.. శంకరా.. నేవే దిక్కు.. ధనంకి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించిన వారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు.
అప్పుడు శివుడు "కుబేరా!
నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే.
నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మత్రామే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పేడు బియ్యం తీసుకుని అహకారం విడిచి, చేసిన తప్పుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి సమర్పించు" అన్నాడు.
కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు.
ఆ గుప్పేడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు.
మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం.
కుబేరుడి అహంకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహంకారాన్ని కుడా పటాపంచలు చేయుగాకా.
నీతీ: పెట్టేది కొంచెమైనా అహంతో కాకుండా ప్రేమతో భక్తితో పెట్టడం వల్ల అంతా మంచి జరుగుతుంది.

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya