Online Puja Services

వేశ్యా పాతివ్రత్యం

18.188.91.223

వేశ్యా పాతివ్రత్యం - 

బహుకాలం పూర్వం నందిగ్రామమనే ఊళ్ళో ఒకవేశ్య వుండేది. వృత్తికి వేశ్య అయినా వృత్తిరీత్యా మాత్రం ఆమె నిత్య నాట్య ప్రియా- నటరాజుకి భక్తురాలు కావడం విశేషం. ఆమె తన గృహప్రాంగణంలోనే నాట్య మండ పాన్ని కట్టించింది. ఆ మండపంయొక్క స్తంభానికి విభూతి పులమబడి రుద్రాక్షమాలతో అలంకరింపబడిన ఒక కోడినీ మరొక స్తంభానికి అదేవిదంగా అలంకరింపబడిన కోతినీ కట్టి వుంచింది. నిత్యం ఆ మండపంలో సాగింది తన నాస్తుభ్యాసంతో బాటు - ఆ కోడికి కోతికీ కూడా నాట్యం నేర్పిసూండేది.అయితే ఇది ఆమె వృత్తికి తోడుపడే పన్నాగమనీ మార్గస్తులని మారమార్గణాల పాలు చేసే పద్ధతి అనీ, ఆ కోతీ కోడి రెండూ కూడా ఒకటి విటుల మనో చపలతకి మరొకటి మగసిరి కులుకులకి సంజ్ఞలనీ - ఆ రెంటినీ పంచలో కట్టి పడేయగల తన నైపుణ్యాన్నామే అలా సూచించేదనీ కూడా అభిజ్ఞులు చెపుతుండేవారు. ఎవరు ఏమన్నప్పటికీ ఆమె ప్రాచుర్యం ఆమెదిగానే వుండేది.అంతేగాక నిత్యం ఆమె సాగించే సాధు సత్పురుష సమారాధనలూ ధారాపాతమైన దానధర్మాలూ సముచితమైన శాస్త్రాచర్చలూ మొదలైనవిఆమెకు అఖండమైన పేరును తెచ్చిపెట్టాయి. “ఈ సానిదానికో సవర యెక్కువ పెట్టినా అది సద్వ్యయమవుతుందేగాని సన్నాసిపని కాబో”దన్న అభిప్రాయం ఆనాటి ధనిక విటులందరిలోనూ ప్రబలంగా పాతుకుపోయింది.

ఆమె కూడా విటుల దగ్గర పెద్ద మొతాన్నే పుచ్చుకున్నప్పటికి ' రోజుకి ఒక్క విటుడితోనే మసులుకుంటూ వుండేది. ఇది కూడా ఆమెకు ఖ్యాతిని తెచ్చి పెట్టింది. ఇలా ఉండగా ఒకానొకరోజున ఆమె యింటికొక శైవ వైశ్యుడొచ్చాడు . నవరత్న మణిమయ భూషణాలంకృతుడు విభూతి-రుద్రాక్ష ధరుడు. మె లుజాతి పట్టుబట్టలు ధరించినవాడూ చూడగానే 'కుబేరుడేమో' ననిపించేలా వుండేవాడు. అయినా ఆ శైవుడు చేతిలో ఒక రత్న ఖచిత శివలింగాన్ని దరించి మరీ వున్నాడు. చూసీ చూడగానే ఆ సానిదాని మనసా రత్నలింగం మీద మోజు పడింది. దానిని తనకు విక్రయించమనీ, యెంత వెలనయినా యిస్తాననీ యన్న, ఆ వెలయాలిని తేరిపార చూసి - "మూడు రోజులపాటు తనతో గడిపేటట్లయితే ఆ రత్నలింగాన్నామె కిచ్చివేస్తానన్నాడా వైశ్యుడు.రత్నలింగం మిది రక్తితో సరేనందీమె.

ఆ వైశ్యుడితో గడిపే మూడురోజులూ కూడా - పరపురుషుడు తన వద్దకు రాకుండా వుండడమే కాదు. కనీసం తనకంట కూడా పడకుండా వుండేలా కట్టుదిట్టం చేసింది. త్రికరణాలనీ ఆ వైశ్యుడి మీదే లగ్నం చేసింది. అతని కాళ్ళు కడిగింది. ఆ నీళ్ళు నెత్తిన చల్లుకుంది. ఒకానొక మహా పతివ్రత తనభర్త యందెలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించసాగింది. ఆ వైశ్యుడు కూడా -సాని కొంపలో వున్నట్లు కాకుండా స్వకుల సతితో సంతుష్టుడైనట్లుగానేభావించుకోసాగాడు అతగాడు తన చేతి రత్న కంకణాలను ఆ రమణికి తొడిగాడు తనతో వున్న రత్నలింగాన్ని పిల్ల చేతిలో పెడుతూ - "ఇది నా ప్రాణం సుమా! నేను నీయిల్లు వదలి వెళ్ళేలోగా దీనికి కీడు జరిగినా నాకు మూడిపోయి నట్లే” అని చెప్పాడు. ఆ రత్నలింగాన్నా రమణీమణి పూజా మందిరంలో వుంచింది. ఆ “వేశ్యా వైశ్యులిద్దరూ విరిబాణుడి మర్మ భోగాలలో మునిగి పోయారు. ఒక రోజు గడిచింది” మరునాడా మదవతి యీ మగరాయడూ మరింత ఉత్సాహభరితమైన మన్మథ విలాసాలతో సమరతులు సాగించారు. కాని ఆరోజు అర్థరాత్రివేళ - ఆకస్మికంగా జరిగిన ప్రమాదంవల్ల ఆమె యిల్లు దగ్గమైపోసాగింది. నాట్యమండపం, అందులోని కోతీ కోడితోసహా బూడిదైపోయింది. పూజగది అగ్నికి పూర్ణాహుతై పోవడమేగాక అందులోని రత్నలింగం ఫెటిల్లున పగిలి తునాతునకలైపోయింది. అంతటితో - ఆ వైశ్యుడు గుండెపగిలి మరణించాడు. ఈ అనూహ్య సంఘటనకా వారవనిత కన్నీరుమున్నరుగా విలపించింది. మూడు రోజులతనితో గడిపేందుకు ఒప్పుకున్న కారణంగా - ఆ గడువు తీరేదాకా తనకతడే భర్త అని - ఈ లోపలే అతను కన్నుమూయడం వల్ల - భార్యగా తన ధర్మం రీత్యా - అతని సహగమం నిశ్చయించుకుంది. తక్షణమే సహగమనానికుద్యమించింది అలా ఆమె అగ్నిలో అడుగు పెట్టబోయింది. వెంటనే ఠక్కున ప్రత్యక్షమయాయ్యాడు శివుడు “ధర్మబద్దమైన నీ భోగజీవితాన్ని పరీక్షించేందుకు వైశ్యరూపంలో వచ్చింది నేనే. నీయందు ప్రసన్నుడినయ్యాను శేషాయువు ముగించుకుని కైలాసవాసినిని కమ్మని అనుగ్రహించాడాయన.

భద్రసేన భూపాలా ! ఆ అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన - ఆ వేశ్య యొక్క పెంపుడు కోడి పెంపుడుకోతియే ఈ జన్మలో నీకూ - మంత్రికి తారక సద్గుణులనే పేర జన్మించారు.పూర్వజన్మలో నిత్యం విభూతినీ - రుద్రాక్షలనూ మాత్రమే ధరించి ఆ అలంకారాలలోనే అంతరించిపోయిన కారణంగా యీజన్మలో కూడా అవే ఆభరణాలుగా వహిస్తున్నారు. ఇది యీ పిల్లల వెనుకటి కథ - ఇక భవిష్యత్తునువిను.

ఈ కుర్రాళ్ళలో నీ కొడుకైన తారకుడు అల్పాయుష్మంతుడు, ఇతను పన్నెండు సంవత్సరాలకు మించి జీవించడు - అని చెప్పి ఆపాడు పరాశరుడు.
వెంటనే భద్రసేనుడాయన పాదాలపై పడ్డాడు “ఒక్కగానొక్క కొడుకు నాకు దయచేసి వీడికి పూర్ణాయువు కలిగే తెరువు చెప్పండని ప్రార్థించాడు. అందుకు పరాశరుడు "వందమంది బ్రాహ్మణులతో -పదివేల రుద్రపారాయ ణులు చేయించు నీబిడ్డ పూర్ణాయువు పొందుతాడని ఉపదేశించాడు.

రాజలాగే చేశాడు. వందమంది వేదవేత్తలచేత వారం రోజులుపాటు రుద్ర పారాయణలు చేయిస్తూ అహెరాత్రాలూ కూడా అవిచ్ఛిన్నంగా శివాభి షేకం చేయించారు. ఆ అభిషేకం తీర్థంతో తారకుడికి స్నానం చేయించ సాగాడు, సరిగ్గా ఆఖరి రోజున - రాజకుమారుడికి ఆఖరిఘడియ వచ్చేసింది. 

మంత్రాక్షతలూ - మంత్రాభిషేక జల సేచనలూ మంత్ర పారాయణలూ సాగుతూనే వున్నాయి. కాని, కర్తవ్యమే తప్ప మరో లోకమెరుగని యమ కింకరులప్పటికే - ఆ రాకుమారునిలోని జీవికోసం వచ్చేసారు. కాని చివరి క్షణంలో శివదూతలు రంగప్రవేశం చేసి, యమగణాలని నిరోధించారు. యమసేనల దళాధిపతి - తత్కారణాన్ని తరచి అడగగా - శైవ గణాధిపతీ వీరగణాధిపతియైన వీరభద్రుడు యమధర్మరాజా ! ఈ జీవికి ఆయువు ఆదిలో పన్నెండు సంవత్సరాలే యైనప్పటికీ - సకాలంలో నిర్వర్తించిన శివయజ్ఞం వలన ఆ పన్నెండు పన్నెండువేల సంవత్సరాలుగా పరిణమించింది” అని చెప్పాడు. 

అదివిన్న యముడు - చిత్ర గుప్తుణ్ణి ప్రశ్నించగా “నిజమే !సమయానికి వీళ్ళిలా శివారాధనలు చేస్తారనుకోలేదు” అన్నాడు చిత్రగుపుడు అంతటితో యముడు - వీరభద్రుడి బోధ నవగాహన చేసుకుని వెనుదిరిగి వెళ్ళిపోయాడు. తదనంతరం తారకుడనే ఆ రాకుమారుడు పదివేల సంవత్సరాలు జీవించి అంత్యాన కైలాసం చేరుకున్నాడు. ఆస్తికులారా ! ఇదంతా రుద్రాధ్యాయ మాహాత్మ్యమన్న సంగతి మర్చిపోకండి ఆచరించడానికి ఆశక్తులయినవాళ్ళు - కనీసం దీనిని శ్రద్ధగా వినినా చదివినా కూడా అనేక విపత్తుల నుంచి విడిపోతారు” అంటూ తమ ఉపదేశాన్నాపారు శ్రీగురువులు.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore