దృఢ విశ్వాసం
దృఢ విశ్వాసం
భక్తపరాధీనుడు, భక్త సులభుడు అయిన పరమేశ్వరుడు నమ్మినవారి పట్ల కల్పతరువు, కోరికలను తీర్చే కామధేనువు. తనను నమ్మి శరణు జొచ్చిన భక్తులను కాపాడి తగిన సమయంలో వారి కష్టాలను తీర్చే దయానిధి. అలా విశ్వాసంతో ఆరాధించిన భక్తులు ఎందరో ఉన్నారు. వారిని పరీక్షించి, వారి విశ్వాసం అచంచలమైనదని తెలుసుకొని భక్తవత్సలుడైన ఈశ్వరుడు వరప్రసాదాన్ని అనుగ్రహించేవాడు. ఇందుకు ఉదాహరణగా లింగ పురాణంలో ఒక చక్కని కథ ఉన్నది. ...
ఉపమన్యుడు ఒక బాలుడు. నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తినడానికి తిండే లేనివారికి పాలు, పళ్ళు, భక్ష్యాలు ఎక్కడ నుంచి వస్తాయి? అలా ఉండగా ఆ బాలుడు ఒక రోజు తన మేనమామ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ మేనమామ పిల్లలు పాలు త్రాగుతూ ఇతడికి కూడ కొంచెం పాలు ఇచ్చారు. ఉపమన్యుడు అప్పుడే మొదటి సారిగా పాల రుచిని చవిచూశాడు. ఇంటికి వెళ్ళాక ఉపమన్యుడు తల్లితో “అమ్మా! నాకు మామయ్య ఇంట్లో పాలు ఇచ్చారు; నాకూ అలాంటి పాలు కావాలి; ఇప్పుడే కావాలి” అంటూ ఏడవసాగాడు. బాలుడు ఏడవడం తల్లిని బాధించింది. “వేళకు తిండే దొరకని మనబోటి పేదలకు నువ్వు అడిగిన మధురమైన పాలు ఎలా లభిస్తాయి తండ్రీ! నా చిట్టితండ్రీ! ఈ నీ చిన్ని కోర్కెను తీర్చలేని నా జన్మ ఎందుకు? ఇలాంటి దరిద్రుల కడుపున పుట్టావే! నీ కోరిక తీర్చలేని అభాగ్యురాలిని! ఏం చేస్తాను? నువ్వు ఇంత మారాం చెయ్యకూడదు తండ్రీ! ఇచ్చినది తినాలి, సరేనా!” తల్లి కుమారుణ్ణి అక్కున చేర్చుకొని సముదాయించసాగింది.
అయినా ఆ పసివాడు యథార్థం తెలుసుకోలేక “నాకు పాలే కావాలి” అంటూ మొండిపట్టు పట్టాడు; గట్టిగా ఏడవసాగాడు.
పిల్లవాడి ఏడ్పుకు తల్లి తల్లడిల్లిపోయింది. వెంటనే యోచించి, వార్చిన అన్నపు గంజిలో నీళ్ళు, చక్కెర కలిపి, తెల్లగా ఉన్న ఆ ద్రవాన్ని తీసుకొనివచ్చి, “నాయనా ఇదిగో పాలు, త్రాగు” అన్నది. దాన్ని రుచి చూడగానే బాలుడు నిజం తెలుసుకొని “ఇవి పాలు కానే కాదు. నన్ను ఏమార్చడానికి ఇచ్చిన నీళ్ళు. నాకు రుచికరమైన నిజమైన పాలే కావాలి” అంటూ బిగ్గరగా ఏడవసాగాడు.
తల్లి గత్యంతరం లేక మనసు కృంగిపోయి బాధపడసాగింది. కుమారుణ్ణి దగ్గరకు చేరదీసి ఇలా చెప్పసాగింది: “నా చిట్టితండ్రీ! మన దురదృష్టం వలన పేదవారిగా పుట్టాం. బంగారు భాగ్యం దక్కకపోయినా పాలైనా త్రాగలేని నిర్భాగ్యులం. అయితే ఒక మాట చెబుతాను విను. ఉన్నవి లేనివిగాను, లేనివి ఉన్నవిగాను కల్పించేశక్తి ఆ పరమేశ్వరుడి కొక్కడికే ఉన్నది. ఆ శివుడి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు. కాబట్టి పరమేశ్వరుణ్ణి స్మరించు. ఆ దివ్యస్మరణలో నీకు ఒక గ్లాసు పాలే కాదు, ఆ క్షీరసాగరమే తరలివస్తుందనడంలో అబ్బురం లేదు. భక్త సంకటం, భక్త మనోరథం తీర్చడంలో ఆ ఈశ్వరుణ్ణి మించిన వారెవరు? నాయనా! నువ్వు శివుణ్ణి ఆరాధించి, ఆయన్ను సంతృప్తి పరచు. ఆ తపోఫలం నీకు తప్పక దక్కుతుంది. నీ కోరికలన్నీ ఫలిస్తాయి.
తల్లి పలుకులు శ్రద్ధగా ఆలకించిన ఉపమన్యుడు కంటి నీరు ఇంకిపోగా, లేతమనస్సు రాయిలా దృఢంకాగా, మోమున విశ్వాసబలం కొట్టవచ్చినట్లు కనపడ దివ్యకాంతితో ప్రకాశించసాగాడు. ఉత్సాహంగా తల్లితో, “అమ్మా! నేను తపస్సు చేస్తాను. నా తపస్సుతో ఆ మహా శివుడి
కైలాసాన్నే గడగడలాడిస్తాను. నా కోరికతీర ఆ పాల సముద్రమే నా వద్దకు వస్తుందిగాక!” అంటూ తల్లికి మ్రొక్కి, తపస్సు చేయడానికి హిమవత్పర్వత ప్రాంతాలకు వెళ్ళాడు.
ఆహా! ఆ పిల్లవాడి విశ్వాసబలం ఎంతటిది? అంతేకాదు ఆ తల్లే గురువై ఆ బాలకుడికి చెప్పిన నీతిబోధ ఎలాంటిది? వర్ణించనలవిగానిది.
అలా తపస్సు చేస్తున్న ఆ పసివాడి తపోశక్తి, నిద్రాహారాలు మానుకొని చేసే ఆ తపోబలమే లోకాలను వణికించి అల్లకల్లోలం చేయసాగింది. దేవతా సమూహం తరలివచ్చి శివుణ్ణి ఆశ్రయించింది. లోకాలను తల్లడిల్లచేస్తూ ఉన్న ఆ పసివాడి తపస్సును విరమింపచేయమని వారు కోరారు. అప్పుడు పరమ దయామయుడైన ఆ పరమేశ్వరుడు వారి కోరికను మన్నింపదలచాడు.
ఉపమన్యుడి కళ్ళెదుట హఠాత్తుగా దేవేంద్రుడు ఐరావతంపై ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుణ్ణి ఉద్దేశించి దేవేంద్రుడు, "కుమారా! నేను దేవేంద్రుణ్ణి. నీ తపస్సుకు మెచ్చాను. ఇంత చిన్న పిల్లవాడికి ఇంత ఘోర తపస్సు ఎందుకు?” అని అడిగాడు.
ఆ పసిబాలుడు దేవేంద్రుణ్ణి చూసి సంతోషించి తన శక్తి కొద్దీ ఉపచరించి, "ఓ దేవేంద్రా! మిమ్మల్ని దర్శించి ధన్యుడనైనాను. నా హృదయంలో శివుని పాదారవిందాల ఎడల పరిపూర్ణమైన భక్తిని పొంద వరం కోరుతూ తపస్సు చేస్తున్నాను. ఆ వరం ఒక్కటీ నాకు చాలు” అన్నాడు నమస్కరిస్తూ.
తపోబలం ఆ చిన్నవాడికి అంత జ్ఞానం కలిగించింది.
ఆ బాలుడి మాటలకు ఇంద్రుడు, “బాలకా! నీ ప్రయత్నం ఎంతో కష్టతరమైనది. అది ఫలించడం దుర్లభం. శివుడు అలా ప్రసన్నుడయ్యేవాడు కాడు. కాబట్టి ఈ కఠోరతపస్సును విరమించు. నీకు కావలసిన భోగభాగ్యాలను నేను ప్రసాదిస్తాను” అన్నాడు ఆశను రేకెత్తిస్తూ..
ఆ మాటలు విన్న బాలుడు ఉగ్రుడై, “నువ్వు ఇంద్రుడివేనా! ఇంద్రుడవే అయివుంటే ఇలా చెప్పబోవు. ఇంద్రుడి వేషంలో వచ్చిన అసురుడివే నువ్వు! ఇలా శివనింద చేస్తున్న నిన్ను చంపినా దోషంలేదు! నేను సహించలేను” అంటూ గర్జించాడు.
అప్పుడు చూస్తుండగానే ఆ పిల్లవాడి ఎదుట దేదీప్యమానమైన కాంతితో ప్రత్యక్షమైనవాడు ఎవరో కాదు - సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఉమాదేవీ సహితంగా వృషభారూఢుడై ఉన్నాడు. “వత్సా ఉపమన్యూ! నీ తపస్సుకు మెచ్చాను. నిన్ను శోధించడానికై ఇలా చేశాను. నీ
కోరిక ప్రకారం పాలసముద్రమే నీవు ఉన్నచోటుకు తరలి వస్తుంది” అని అనుగ్రహించడమేగాక, జగన్మాత ఒడిలో ఉపమన్యుణ్ణి కూర్చోబెట్టి సకల సౌభాగ్యాలను ఒసగుతూ వరాలు ఇచ్చాడు.
ఆ ఉపమన్యుడు, పరమశివుని అనుగ్రహానికి పులకాంకితుడై, తన్మయుడై జగన్మాతాపితరుల సాన్నిధ్యాన్ని సజీవంగానే పొందడమేగాక, ఈ భువిన సకలసంపదలతో తులతూగాడు.
వయస్సులో చిన్నవాడైనా, దృఢవిశ్వాసం, అచంచల తపోబలంతో ఉపమన్యుడు సార్థక జన్ముడయ్యాడు.