మోక్ష నారాయణ బలి పూజ ప్రత్యేకత ఏమిటి ?
మోక్ష నారాయణ బలి పూజ ప్రత్యేకత ఏమిటి ?
- లక్ష్మి రమణ
జీవితంలో కొన్ని నిర్ణయాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఆ నిర్ణయాలకి దారితీసిన పరిస్థితుల గురించి పక్కన పెడితే, వాటి వల్ల మనకి తగిలే పాపాలు, వెంటాడే శాపాలు ఆ తర్వాత మనం భరించలేనంత బాధగా ఉంటాయి. తరతరాల పాటు వెంటాడతాయి. శాస్త్రం వీటిని పంచ మహా పాతకాలుగా పేర్కొంది. వీటి నుండీ బయటపడకపోతే నిజంగానే జీవితంలో అనేకమైన బాధలు ఎదురవుతాయి. అడుగడుగునా అవరోధాలు అడ్డుపడుతూనే ఉంటాయి . అటువంటి వాటి నుండీ ఉపశమనాన్ని కలిగించే ఉపాయంగా ఈ మోక్ష నారాయణ బలి పూజని పేర్కొంటున్నారు జ్యోతిష్యవేత్తలు .
మహా పాతకం అంటే నిష్కృతిలేనిది అని అర్థం. అంటే ఈ జన్మకు ఏం చేసినా ఈ పాపాలను కడుక్కోవడం కుదరదు. వాటి ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. కొన్ని పాపాలకు పరిహారం ఉంటుంది, కానీ పంచమహాపాతకాలు అని చెప్పుకునే వీటికి మాత్రం ఎలాంటి నిష్కృతి ఉండదు. అధర్వణ వేదంలో పంచమహాపాతకాలని గురించి ప్రస్తావిస్తూ , వాటిని ఇలా వివరించారు .
1.తల్లిదండ్రులను దూషించడం:
తల్లిదండ్రులను దూషించేవాడికి నిష్కృతి లేదు. దూషించడమే తప్పు అంటే ఇక హత్య చేస్తే ఆ పాపం జన్మజన్మలకీ కడుక్కోలేరు.
2. గురువుని ఏకవచనంలో పిలవడం:
కలలో కూడా గురువుని ఏకవచనంతో పిలవడకూడదు.
3. తాగే నీటికి కలుషితం చేయడం: నడిచే దారిని మూసేయడం
పది మంది తాగే నీటిని కలుషితం చేయకూడదు. దాహం తీర్చే గంగను తాగేందుకు వీల్లేకుండా చేసిన పాపానికి ఏం చేసినా పరిహారం ఉండదు.
4. గోవుని అకారణంగా కొట్టడం:
గోవుని ఆకతాయిగా,ఎలాంటి అవసరం లేకుండా కొడితే గోవు చర్మంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని జన్మలు ఎత్తినా ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది.
5.ఆత్మహత్య:
ఆత్మహత్య మహాపాపం . మొదటి నాలుగు పాపాలకు ఆ జీవుడు మాత్రమే అనుభవిస్తాడు. కానీ ఆత్మహత్య చేసుకుంటే మాత్రం అటు ఐదు తరాలు, ఇటు ఐదు తరాలు ఇబ్బదులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇటువంటి పంచ మహా పాతకాలను (ఐదు ఘోరమైన పాపాలు), మహా శాపాలు తొలగించడానికి మోక్ష నారాయణ బలి పూజ నిర్వహిస్తారు. ప్రత్యేకించి, కుటుంబంలో అసహజ మరణం సంభవించినప్పుడు మోక్ష నారాయణ పూజ చేయాలని గరుడ పురాణం చెబుతోంది. అసహజ మరణం అంటే నీటిలో మునిగిపోవడం, కాలిపోవడం, అకస్మాత్తుగా అనారోగ్యంతో చనిపోవడం లేదా పాముకాటుకు గురై చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం తదితరాలు .
అదే విధంగా మరణించిన పితరులకెవరికైనా సరైన విధివిధానాల ప్రకారం అపరకర్మలు , శ్రాద్ధ కర్మలు చేయకపోతే, నిర్వహించలేకపోతే మోక్ష నారాయణ పూజ చేయవచ్చు. దీనివల్ల పితృ దేవతలు తృప్తి పొందుతారు. ఈ పవిత్ర కార్యక్రమం వలన పితృ దేవతలు పుణ్యలోకాలని పొందే అవకాశం ఉంటుంది. వారి ఆత్మలకి శాంతి లభిస్తుంది .
ఉద్యోగం, విద్య, వ్యాపారం మరియు ఇతర కార్యకలాపాలలో అద్భుతమైన పురోగతితో పాటు దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వాంతన చేకూరుతుంది. ఆరోగ్య సమస్యల నుండీ ఉపశమనం దొరుకుతుంది. పిల్లలు లేని వారికి ఈ పూజ కుటుంబంలో వివాహ స్థలాన్ని నిర్ధారిస్తుంది. ఎవరైనా లేదా ఆమె జాతకంలో పితృ దోషం ఉన్నట్లయితే, ఈ నారాయణ బలి పూజను వీలైనంత త్వరగా నిర్వహించాలి.
ఈ మోక్ష నారాయణ బలి పూజను పవిత్ర నది ఒడ్డున మాత్రమే నిర్వహించాలి. సాధారణంగా పూజ చేసే విధానం క్రింది క్రమంలో ఉంటుంది. ప్రధాన సంకల్పం, గణపతి పూజ, కలశ స్థాపన, బ్రహ్మ ,విష్ణు, మహేశ్వర, యమ దేవతల ఆవాహన, ఆరాధన, పిండ ప్రదానం తదితర క్రతువు ఉంటుంది . తరువాత హోమ క్రతువు, దానాలు ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తారు. వేదవిదురులైన బ్రాహ్మణుల పవేక్షణలో స్వయంగా స్వహస్తాలతో ఈ పూజని నిర్వహించాలని గుర్తుంచుకోండి.
ఈ మోక్ష నారాయణ బలి పూజని నిర్వహించడానికి అనుకూలమైన ముహూర్తాలు ఆశ్లేష, ఆరుద్ర, పుష్యమి నక్షత్రాలతో కూడి ఉంటే మంచిది. అలాగే పౌర్ణమి, అమావాస్య తిధులు గొప్ప ఫలాన్నిస్తాయి. ఏదేమైనా, జాతకాన్ని అనుసరించి, జ్యోతిష్యవేత్తలని సంప్రదించి సరైన ముహూర్తాన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
ఈ సేవల కోసం, ఇతర వైదిక పూజా కార్యక్రమాల కోసం మీరు హితోక్తి వారి ఆన్లైన్ సేవా సర్వీసులని వినియోగించుకోవచ్చు. శుభం .
Moksha Narayana Bali pooja, Bali Puja,