ముక్కోటి ఏకాదశి పూజా విధి
కలియుగంలో, అశ్వమేథయాగం చేసిన ఫలం ఇచ్చే ముక్కోటి ఏకాదశి పూజా విధి .
- లక్ష్మి రమణ
సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి లేదా పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. దీనినే పుత్రద ఏకాదశి అని కూడా అంటారు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఏకాదశులలో ప్రధానమైనది. ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన ప్రార్థించే వారికి మోక్షం లభిస్తుంది. అలాగే ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుంది. ఈ ఏకాదశినాటి పూజ విధానం ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం .
సంవత్సరంలో శుక్ల పక్షం, బహుళ పక్షం కలిపి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశులన్నీ కూడా ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించి, ద్వాదశిలో పారణ చేస్తే, ఆహరి అనుగ్రహం మెండుగా దొరుకుతుంది . సర్వ ఆపదల నుండీ శ్రీహరి స్వయంగా రక్షిస్తారన్నది పురాణ వచనం . ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి నాడు చేసే ఏకాదశీ వ్రతం , ఉత్తర ద్వారంగుండా దేవాలయంలో శ్రీహరిని దర్శించడం చేత మూడుకోట్ల ఏకాదశులు ఉపవశించిన ఫలమూ, అశ్వమేధ యాగం చేసిన ఫలమూ లభిస్తాయని చెబుతారు .
విధి ఇదీ :
ముక్కోటి దేవతలతో కలిసి మహావిష్ణువు ఉత్తర ముఖంగా దర్శనమిచ్చే ఈ రోజు ఉపవాసం ఉండి, శ్రీమహావిష్ణువును షోడశోపచార విధులతో పూజించాలి. నిష్ఠతో రాత్రి జాగరణ చేయాలి. ఈ సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి . ద్వాదశి రోజున మళ్లీ భగవంతుని ఆరాధన ముగించుకుని, పారణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఈ రోజున గోవింద నామ స్మరణం చేస్తూ నిష్ఠతో పూజ చేసిన వారికి పునర్జన్మ ఉండదు.
ఉపవాస నియమాలు :
ఉపవాస దీక్షలో పూర్తిగా ఉపవాసం ఉండలేని వారికీ కొన్ని మినహాయిపులతో అయినా ఉపవాసం చేయమని చెబుతున్నారు పండితులు . గృహస్థులు పండ్లు, పాలు వంటివి వ్రతంలో స్వీకరించవచ్చు. అలా కూడా ఉండలేనివారు కనీసం ఒక్కపూటైనా ఉపవాసం ఉండాలి . స్త్రీలు, అనార్యోగంతో ఉన్నవారు , పసిపిల్లలూ వ్రతాన్ని పాటించాల్సిన అవసరం లేదు . కానీ భార్యాభర్తలు ఇరువురూ కలిసి ఈ వ్రతం ఆచరించడం ఎంతో మంచిది.
ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి నాటి తర్వాత వచ్చే ద్వాదశినాడు అన్న దానం చేస్తారో వారికి ఉత్తమ ఫలితాలు, సద్గతులూ కలుగుతాయని పద్మపురాణం చెబుతోంది. ఇలా ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాస వ్రతం పాటించడంవల్ల అశ్వమేధయాగం చేసిన ఫలితం కంటే అధిక ఫలితం లభిస్తుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
#mukkotiekadasi #vaikuntaekadasi
Tags: mukkoti, vaikunta, vaikuntha, ekadasi,