ధనుర్మాస విశిష్ఠత - పూజా విధానం
ధనుర్మాస విశిష్ఠత - పూజా విధానం
లక్ష్మీ రమణ
ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు, దరిద్రం దూరమవుతుంది. ఈ నెలలో ప్రతి రోజు బ్రహ్మీ ముహూర్తంలో తిరుప్పావై పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి. ఆ భూదేవి, అవతారమైన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో తిరు అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతం అని అర్థం. ఈ పవిత్రమైన వ్రతం ఆచరించే విధానాన్ని మనం కూడా తెలుసుకుందాం .
ధనుర్మాసంలో పెళ్లికాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు పెట్టి , గొబ్బిళ్లతో వాటిని అలంకరించి , పూజలు చేయటం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా తులసీమాలలతో పూజించింది. కనుక , శ్రీకృష్ణునికి ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ఈ ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతం గురించిన వివరణలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. కానీ , ధనుర్మాసంలో మాత్రం వీధి వీధినా ఆ తిరుప్పావై గానమే, గోదాదేవి, రంగనాధుల ప్రేమ తత్వమే వినిపిస్తుంది. ప్రకృతి పరమాత్మల కలయికల రమణీయత శోభిస్తుంది .
గోదాదేవి పాశురాల్లో రంగనాధునితో ఇలా అంటుంది .
శ్రీకృష్ణా! నాకు తల్లి, తండ్రి, స్నేహితులు, బంధువులు ఇలా ఒకటేమిటి? అన్నీ నువ్వే.
బంధుత్వాలన్నీ నీతోనే. ఈ ఒక్క జన్మలోనే కాదు, అన్ని జన్మల్లోనూ నీ చెలిమే కావాలి.
తనువు, మాట, మనసు... అన్నిట్లోనూ నువ్వే నిండిపోవాలి. నన్ను నేను మర్చిపోవాలి. చివరకు నీలో ఐక్యం చెందాలి. ఇంతకన్నా నాకు మరే కోరికా లేదు స్వామీ... అంటూ పరిపూర్ణమైన భక్తిని ప్రకటిస్తుంది గోదాదేవి తన తిరుప్పావై పాశురాల్లో.
దేవుడు ఎక్కడో పైలోకాల్లో ఉండడు. మన ఇంట్లోనే, మన చుట్టూనే, మనకు దగ్గరగానే ఉంటాడు. మనం పిలిస్తే పలుకుతాడు. మనకు ఆత్మబంధువుగా ఉంటాడు. మనం ఆత్మీయతతో పిలిస్తే తక్షణమే పలుకుతాడు. మనం చేయవలసిందల్లా మనసునీ, మాటనీ ఒకటిగా చేసి కన్నయ్యను పిలవటమే అంటూ పరమాత్మను చేరుకునేందుకు పారమార్థిక చింతనను అందిస్తాయి పాశురాలు. వీటిని పారాయణం చేయడము అంటే, ఆధ్యాత్మిక గంగలో తనివితీరా మునకేయడమే .
ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్లు తమ స్థోమతను బట్టి విష్ణు ప్రతిమని చేయించి పూజించాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తిచేయాలి. పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించి.. తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. నెలరోజులూ చేయలేని వాళ్లు 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా చేయవచ్చు.