కష్టాలని కడతేర్చే మార్గం హనుమాన్ చాలీసా పారాయణం .
కష్టాలని కడతేర్చే మార్గం హనుమాన్ చాలీసా పారాయణం .
- లక్ష్మీరమణ
ఆంజనేయ స్వామి చాలీసా పారాయణ చాలామంది చేస్తూనే ఉంటారు. సంకటాలన్నీ తొలగించే హనుమాన్ చాలీసా ని మనకి వరంగా ప్రసాదించినవారు సంత్ తులసీదాస్ . ఆయన భక్తికి పరీక్ష పెట్టిన అక్బర్ పాదుషాకి , రామ నామంతో సమాధానము చెప్పారు తులసీ దాసు. తనను శరణు వేడని దాసుగారిని చెరసాలలో వేశారు పాదుషావారు . అప్పుడా రామదండే ఆయనకీ తోడుగా వచ్చింది. రామదాసులకి దాసుడనని చెప్పుకోవడమే కాదు, కదిలివచ్చి అండదండలతో నిలబడే స్వామి ఆ హనుమ. ఆయన వచ్చి తులసీ దాసుకి దర్శనమిచ్చి చెరసాల నుండీ రక్షించారు . అలా హనుమని దర్శించి తులసీదాసు ఆశువుగా చెప్పిన రక్షాస్తోత్రం హనుమాన్ చాలీసా. ఈ చాలీసాని ఎవరయితే చదువుతారో వారికి అండగా నిలిచి వారి కష్టాలని తొలగిస్తానని ఆంజనేయస్వామి తులసీ దాసుకి మాటిచ్చారు. అయితే ఈ పారాయణ సంఖ్య , నియమాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .
*పెద్దలు చెప్పిన విధానం ప్రకారం చాలీసా పారాయణకి భక్తి ప్రధానం. చేసే పూజ ఏదైనా ముందుగా అవసరమైన ప్రధానమైన వస్తువు భక్తి మాత్రమే .
*పారాయణం అనేది ఎన్ని రోజులు చేయదలచుకున్నారు అనేది ముందుగా నిర్ణయం చేసుకోవాలి. మండలం రోజులా, తక్కువా, ఇంకా ఎక్కువా అనేది చూసుకోవాలి ..
*ఈ రోజులలో మీకు శౌచం అత్యంత అవసరం. కాబట్టి, మీ ఇంటిలోని ఆడవారికి ఇబ్బందులు లేని సమయం ఎంచుకోండి.
*వీలయినంతవరకు, సూర్యోదయాత్పూర్వమే పూజ ముగిసేట్లు చూడండి.
*ఇది విశేష పూజ కాబట్టి, మీకున్న నిత్య ఆరాధన ముందు చేయండి. సంధ్యా వందనం చేసేవారయితే, ఖచ్చితంగా అది మొట్ట మొదట చేయాలి. ఆ తర్వాతే పారాయణ చేసుకోవాలి .
*మడి వస్త్రాలు వాడాలి. ఎప్పుడూ రెండు వస్త్రాలతోనే పూజ చేయాలి. (పంచ,కండువా. ).
*వీలయితే ప్రతిపూటా దేవుని గది అలికి, ముగ్గు వేసుకోండి. సాత్వికమైన ఆహారం తీసుకోండి.
*వీలయితే, రాత్రిపూట ఆహారంలో వండిన పదార్థాలు తీసుకోకండి. అయితే, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహారం విషయంలో మార్పు అవసరం కావచ్చు.
*షోడశ ఉపచారాలు చేయగలిగితే మంచిది. లేదా కనీసం పంచ ఉపచారాలు.
*చల్లనీటి తో తల స్నానం, రాత్రి వేళలో భూశయనం. ఇవి కూడా మీ ఆరోగ్య పరిస్తితిని బట్టి పాటించండి.
*మీరు ఎందుకు ఈ విశేష పూజ చేస్తున్నారో, అది 'సంకల్పం' గా తప్పక పూజకు మునుపు స్వామివారికి విన్నవించుకోండి. రోజుక్కొక్కసారి చొప్పున, మీరు ఎన్ని రోజులు దీక్ష అనుకున్నారో, అన్నీ రోజులు చేయండి. ఒక రోజుకి 5 లేదా 9 సార్లు కూడా చాలీసా చేస్తుంటారు. అయితే కొంతమంది ఒకే రోజులో 108 సార్లు పారాయణం చేస్తుంటారు. మీరు ' నిత్య పూజ' గా చేయదలచుకుంటే, రోజుక్కొసారి సరిపోతుంది .
*స్వామివారికి చిట్టి గారెలు , అప్పాలు, చాలా ఇష్టం. వీటిని నివేదనగా సమర్పించడం మంచిది . కానీ ప్రతిరోజూ చేసే వీలు ఉండకపోవచ్చు . కాబట్టి మంగళవారం లేదా శనివారం వీటిని 9,11,13 ఇలా బేసి సంఖ్యలో సమర్పించవచ్చు. రోజూ నివేదనగా పాలు, పండ్లు విశేషించి అరటిపండ్లు , కొబ్బరి కాయ సమర్పించవచ్చు. ఒక్కరోజు , మండలం రోజులపాటు పారాయణ అనుకుంటే పూజ పరిసమాప్తి రోజు చిట్టి గారెలు/ అప్పాలు పెట్టుకోవచ్చు.
* అవకాశం ఉంటే పూజాపరిసమాప్తి రోజున ఆంజనేయ స్వామి కోవెల అర్చక స్వామికి గానీ ఒక బ్రాహ్మణుడికి గానీ భోజనం ఇవ్వండి .
శుభం .
#hanumanchalisa #parayana
Tags: hanuman chalisa, hanuman, parayana, pooja