శ్రీరాముడు చేసిన ఆంజనేయుని పూజ
శ్రీరాముడు చేసిన ఆంజనేయుని పూజ !
లక్ష్మీరమణ
రాములవారిపూజలో , ఆయన నామ స్మరణలో కాలం , లోకం , చివరికి తనని తానె మరిచిపోతారు హనుమ . అటువంటి రామనామస్మరణలో తరించిపోయే హనుమంతుని వ్రతాన్ని స్వయంగా రాములవారు తన కష్టాలనుండి గట్టెక్కేందుకు , మార్గమేటో తెలియని సుడిగుండంలాంటి దుఃఖసాగరంలో మునిగిఉన్న స్థితిలో, ఒక చుక్కాని కోసం వెతుక్కుంటూ హనుమంతుడే స్వయంగా చెప్పిన ఆయన వ్రతాన్ని ఆచరించారని శ్రుతివచనం.
రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోయాడు . సీతమ్మని తలుచుకొని విలపిస్తూ, ఆమెని అరణ్యంలో వెతుకుతూ శ్రీ రాముడు మనశ్శాంతిని కోల్పోయాడు . లక్ష్మణునితో కలిసి సీతా , సీతా అని పిలుస్తూ, ఆమెను అన్వేషిస్తూ ఋష్యమూకపర్వత ప్రాంతానికి చేరుకున్నారు . అక్కడ హనుమంతుడు , తన రాముని చూసి ఉప్పొంగిపోయాడు . సుగ్రీవునితో రామునికి అగ్ని సాక్షిగా మైత్రి చేశాడు . ఈ సందర్భం చాలా గొప్పది . రామాయణంలో రాములవారి విజయానికి నాంది పలికిన సంఘటన మాత్రమే కాదు. ఇది శ్రీరామునికి మనశ్శాంతినిచ్చిన హనుమంతుని జన్మవృత్తాంతాన్ని , ఆయనని ఆరాధించడంవలన చేకూరే ఫలాన్ని ఆ అంజనీసుతుడే స్వయంగా వివరించిన సన్నివేశం . అదే హనుమద్వ్రతంగా సుప్రసిద్ధిని పొందింది .
సరే, అలా మైత్రిని చేకూర్చాక, హనుమంతులవారు , శ్రీరామునితో ఇలా అన్నారు . "ఓ రామచంద్రా, పురుషోత్తముడవైన నీకు నేను సదా భక్తుడను. సీతమ్మని వెదికే పనిని నీవు నాకు అప్పగించావు . ఈ బాధ్యతని నెరవేర్చేముందర , నేను నేను నా వృత్తాంతాన్ని చెబుతాను ఆలకించు. సూర్యుడిని ఫలమని భ్రమించి, మ్రింగబోయిన నన్ను దేవేంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టాడు. అది నా దవడ మీద తగలడంతో నా దవడ వాచింది. అప్పటినుండి నాకు హనుమంతుడు అని పేరొచ్చింది .
వజ్రాయుధం దెబ్బతో మూర్ఛపోయిన నన్ను చూసి నా తండ్రి వాయుదేవుడు దేవేంద్రునిపై అలకబూనాడు . లోకంలో గాలి వీచాకుండా చేసాడు. గాలిలేకపోవడంతో లోకమంతా స్తంభించిపోయింది. అప్పుడు బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగు దేవతలు ప్రత్యక్షమై ఓ ఆంజనేయా నీకు అంతులేని పరాక్రమములు సంతరించుగాక, చిరంజీవిగా వర్థిల్లుగాక, రామకార్యము నెరవేర్చాల్సిన వాడివి నువ్వే, హనుమద్ర్వతమున నాయకుడవైన నిన్ను గొప్పగా ప్రతిష్టించి ఎవరు పూజిస్తారో వారికి సర్వకార్యాలు నెరవేరుతాయని వరమిచ్చి దీవించారు.
శ్లో || కార్యార్ధినా రాఘవేణ - కృత్య మిత్యబ్రవీచ్చ మాం
స్మృతంత ద్వై రామః వాక్యం - కురు స్వామిన్ మయేరితం ||
న మంతవ్యం వృథా నాథః సత్యం మంతవ్య మీదృశ్యం
రోచతే యది త్వచ్చిత్తే - తత్కురు స్వార్థ సిద్ధయే ||
కార్యార్థివై యున్న ఓ రాఘవా ! బ్రహ్మాదిదేవతలూ ఆ విధంగా నాకు ప్రసాదించిన వరాలు నాకు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి . వ్యర్ధమైన ఆలోచనలు కట్టిపెట్టు . నాకు ఆ దేవతలిచ్చిన వరాన్ని శంకించకు . ఈ వ్రతాన్ని నీ కార్య సిద్ధి కోసం తప్పకుండా ఆచరించు . అని హనుమంతులవారు చెప్పగానే , ఆకాశవాణి, ‘ఆ అంజనీసుతుని మాటలు సత్యము రామచంద్రా ‘ అని పలికింది . దాంతో రామచంద్రులవారు వ్రతవిధానం తెలిపామని ఆంజనేయుని కోరారు . అప్పుగా వాయుపుత్రుడు వ్రతవిధానాన్ని ఇలా చెప్పారు .
"మార్గశిర మాసములో వచ్చే శుక్లపక్షములోని త్రయోదశి నాడు పసుపురంగు తోరముని పదమూడు ముళ్ళు వేసి సిద్ధం చేసుకోవాలి. దానిని కలశమునందు ఉంచి, వాయుసుతుని అంటే, నన్ను ఆవాహన చేసి పూజించాలి. పసుపుపచ్చని గంధము, పసుపు రంగు పుష్పములు, తదితర పసుపు రంగు ద్రవ్యాలనే ఈ పూజలో ఎక్కువగా ఉపయోగించాలి . 'ఓం నమో భగవతే వాయునందనాయ' అను మంత్రమును ఉచ్చరిస్తూ తోరాన్నికి పదమూడు ముళ్ళువేసి, ఆ మంత్రముతోనే షోడశోపచార పూజ చేయాలి. తరువాత శ్రోత్రియుడైన బ్రాహ్మణునికి ఉపచారములు చేసి పదమూడు అప్పములతో వాయనం ఇవ్వాలి. గోధుమ అన్నమును వడ్డించాలి . దక్షిణతో కూడిన తాంబూలము సమర్పిస్తూ సంపన్నులైన వారు అన్నదానము చేయాలి . ఈ వ్రతము ప్రారంభంలోనే కోరికలు నెరవేరుతాయి. దీనిని ప్రయత్న పూర్వకముగా పదమూడు సంవత్సరాలు ఆచరించాలి.
దీని ఉద్యాపన పదమూడు కలశాలు, పదమూడు వస్త్రాలు , పదమూడు హనుమ ప్రతిమలని దానం చేయడంతో పూర్తిచేయాలి అని చెప్పాడు.
అప్పుడు రాముడు, లక్ష్మణునితోనూ, సుగ్రీవునితోనూ ఆ వ్రతాన్ని ఆచరించాడు. అదే విధంగా విభీషణుడు కూడా రాముడు ఆచరించిన విధంగానే ఆ వ్రతాన్ని చేసి మంచి సత్ఫలితాలను పొందారు. అప్పటినుండి లోకములో హనుమద్ర్వతము ప్రసిద్ధిని పొందింది .
జై శ్రీరామ్ .