తులసిని ఇలా పూజిస్తే,
తులసిని ఇలా పూజిస్తే, ఐశ్వర్యమూ, సర్వసౌభాగ్యాలూ కలుగుతాయి .
- లక్ష్మి రమణ
తులసి మొక్క లేని ఇల్లు హిందూధర్మంలో కనిపించదు. అపార్ట్మెంట్లలో కూడా కుండీలేవీ పెట్టుకోలేకపోయినా, ఖచ్చితంగా ఒక్క తులసి మొక్కని గుమ్మం దగ్గర ఉంచుకుంటారు . తులసి మాత ఆ విధంగా ఇంట్లో ఒక సభ్యురాలిగా మారిపోయారు. పెద్దవాళ్ళు ఇంట్లో దగ్గర ఉన్నా లేకపోయినా , నిత్యమూ మన వెంట ఉండే పెద్ద ముత్తయిదువ తులసమ్మ . ఈ అమ్మని నిత్యమూ పూజిస్తే, లక్ష్మీ కటాక్షం కల్గుతుందని శాస్త్రం చెబుతోంది.
‘యాన్ములే సర్వతీర్దాని!
యన్మధ్యే సర్వదేవతాః
యదాగ్రే సర్వవేదాశ్చ!
తులసిం త్వాం నమమ్యహమ్’’
తులసీ వృక్షం మూలంలోనే సర్వతీర్థాలూ ఉంటాయి . తులసీ మాధ్యమంలో సర్వదేవతలూ కొలువై ఉంటారు. తులసి చెట్టు పైభాగంలో సర్వ వేదాలూ ఆశ్రయించి ఉంటాయి . అటువంటి తులసి మాతకి నమస్కారము అని కదా పైన పేర్కొన్న శ్లోకానికి అర్థము. అందువల్ల ఒక్క తులసిని నిత్యమూ పూజిస్తే, ఇన్నింటినీ పూజించిన ఫలితం దక్కుతుంది . సాధారణంగా మహిళలు ప్రతిరోజూ తులసీ పూజ చేసుకుంటూ ఉంటారు . చూడండి , వారిది ఎంతటి భాగ్యమో !!
ఐశ్వర్య ప్రదాయిని అయిన తులసిని పై శ్లోకం చదువుతూ స్మరించి, చుట్టూ ప్రదక్షిణం చేసినట్లయితే , సర్వదేవతా ప్రదిక్షణం చేసిన ఫలితం దక్కుతుంది. అదే విధంగా తులసిదళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం కాదు. ఎందుకంటె ఆవిడ స్వయంగా శ్రీవారి వక్షస్థలం నివాసిని అయిన శ్రీమహాలక్ష్మీ దేవే ! అందుకే ఆవిడని
తులసి శ్రీ మహాలక్ష్మిః విద్యా విద్యా యశస్విని!
ధర్మా ధర్మనా దేవీ దేవ దేవ మనః ప్రియా!
లక్ష్మి! ప్రియ సఖీ దేవీ ద్యౌర్బమి రచలాచలా!
అని కీర్తించారు . ఈ విధంగా ప్రదక్షిణల తవాత శ్లోకాన్ని చెప్పుకొని , సాక్షాత్తూ లక్ష్మీ నారాయణ స్వరూపిణి యైన తులసిని నమస్కరిస్తూ, పైన 16నామాలను పఠించిన వారికి గృహంలో లక్ష్మి సుస్థిరంగా నిలిచి ఉంటుంది. ఇంట్లో శాంతి , సౌఖ్యాలు వృద్ధి పొందుతాయి.
తులసిదళంతో పూజలు చేయడం అంటే విష్ణువుకు పరమ ప్రీతికరమైనది. ఈ దళాలతో పూజలు చేసిన వ్యక్తికి సకల హోమాలు, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం దక్కుతుంది. తులసి పత్రం అగ్రభాగంలో బ్రహ్మ, మధ్యలో విష్ణుమూర్తి, కాండమందు శివుడు, శాఖల్లో అష్టదిక్పాలకులు విడిది చేసి ఉంటారని పండితులు చెబుతారు. ప్రాతఃకాలంలోను, సంధ్యాసమయంలోనూ తులసి కోట ముందు దీపాన్ని వెలిగించి, ప్రదక్షిణలు చేస్తే శుభప్రదం.
తులసి స్తోత్రం చేయడం కూడా గొప్ప ఫలితాన్ని అందించేదే ! భూత ప్రేత, పిశాచ, భూతాలవంటివి దూరమవుతాయి. ప్రతిరోజు ఇంటిముందు లేదా తులసికోట వద్ద దీపం పెట్టడం వల్ల దారిద్య్రం తొలగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. దీపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఆలయాల్లో, ఇళ్లల్లో, తులసి, మారేడు వంటి దేవతా వృక్షాల వద్ద దీపాలను వెలిగించడం శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. వారమంతా ఇలా చేయలేని వారు కనీసం ప్రతి శుక్రవారం ఆచరించడం వలన చక్కని ఫలితాలని పొందవచ్చు .
శుభం .