Online Puja Services

నిత్యపూజలో ఏం చేయాలి ?

3.15.218.169

నిత్యపూజలో ఏం చేయాలి ? 
- లక్ష్మీరమణ 

అందరికీ స్మార్తం చదివే అవకాశం లేదు . అందరి ఇళ్లలోనూ పూజావిధులు ఒకే రకంగా ఉండవు . అర్చించే సంప్రదాయాన్ని బట్టి , సంస్కృతిని బట్టి , ప్రాంతాన్ని బట్టి, దైవాన్ని బట్టి  ఈ పూజా విధానాలు విభిన్నంగా ఉంటాయి.  ఇవన్నీ కాకుండా సింపుల్ గా పూజ చేసుకోవాలి అనుకుంటే, ఒకేఒక్క వస్తువు మన  దగ్గరుండాలి . అది  మన మనసు . ఆ మనసు నిర్మలమై అందులో ప్రతిఫలించే  పరమాత్మ జ్యోతి ప్రకాశాన్ని చూడగల్గడమే పూజ పరమార్థం .  సరే, అసలు నిత్యపూజ, ఇష్టదేవతా పూజ  ఎలా చేసుకోవచ్చు ? తెలుసుకుందాం రండి .

సాకార రూపంగా భగవంతుడిని పూజించే సమయంలో భగవంతుడికి సమర్పించే 16 రకాలైన సేవలనే  షోడశోపచార పూజ అంటారు.  సాకార పూజ లో మనము  సమర్పించే ధ్యాన, ఆవాహన, అర్ఘ్యం, పాద్యమ్, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, పసుపు కుంకుమ, పుష్పార్చనం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, ఇంకా మంత్రపుష్పం, ఆత్మ ప్రదక్షణ నమస్కారం తదితరాలన్నీ కలిపి షోడశోపచారములని అంటాం.  భగవంతుడు మన ఎదురుగా ఉన్నాడని భావన చేసి ఈ పూజలు సమర్పిస్తాము. ఈ విధంగా చేసే పూజను షోడశోపచార పూజ అంటాం.  

పురుషదేవతలకు, పురుషసూక్తం తోను, స్త్రీ దేవతలకు శ్రీ  సూక్తం తోను ఈ పూజను చేస్తాము. ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క శ్లోకం ను చదువుతూ ఉంటారు .  మంత్రసాధకులైతే  ఉపదేశం పొందిన మంత్రంతో వారి దేవతను ఆరాధించవచ్చు.
  

దీపారాధన :
 
నిత్య పూజ లో ముందుగా  దీపారాధన చెయ్యడం విధి . త్రివిధములైన సత్వరజస్తమోగుణాలను తొలగించి మనలో జ్ఞానమనే జ్యోతి వెలగడానికి ప్రతీకగా  దీపారాధన చేస్తారు. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వివిధ సుగంధ ద్రవ్యాలు కలిపి చేసిన  విప్పపువ్వు నూనె, లేదా ఆవు నెయ్యి ఉపయోగించి  చేసుకోవాలి .  

ధూపం :

అగరుబత్తి లతో ధూపం వేసేటట్టయితే , రెండు అంతకంటే ఎక్కువ మన ఇష్టాన్ని అనుసరించి వెలిగించుకోవచ్చు . లేదా ధూపం స్టిక్ లు లభిస్తున్నాయి . అవయితే ఒక్కటే చాలు . 

ఆచమనం :

నైమిక్తిక పూజలో ఉపచారానికి ఒక పంచపాత్ర, మనం  ఆచమనానికి చేసేందుకు మరో  పాత్ర ఉపయోగించాలి.  అపచారానికి వినియోగించే నీటిలో  వీలైతే ఒక చిన్న పచ్చకర్పూరం పలుకు లేదంటే కొన్ని తులసి ఆకులు వేయండి.

గణపతి పూజ : 

ముందుగా విఘ్నేశ్వరారాధన చేయాలి . చిన్నప్పటి నుండీ నేర్చుకున్న ‘శుక్లాంబర ధరమ్’ చెప్పుకున్నా సరిపోతుంది .  ఆ తర్వాత ఎవరి ఆరాధ్యదైవంను వారు ఆరాధన చేయవచ్చు .  

శివార్చన :

 గణపతి ఆరాధన చేసిన తరువాత శివ లింగాభిషేకానికి, అర్చనకి పూనుకోవాలి. అభిషేకానికి ఆవు పాలు, నీళ్లు  ఉపయోగించుకోవచ్చు.  వీలైతే, పంచగ వ్యాలు వాడాచ్చు. అభిషేకం తర్వాత, లింగానికి  విబూది ధారణ చేసి,  ఆ విబూదిని మనం ధారణ చేయాలి . విభూది ధరించినవాడు స్వయంగా శివునితో సమానం. ఇక శివుడు కానివాడు శివార్చనకు పనికిరాదు . ఈ రెండూ మనకి తెలియజేసేది ఏమంటే, మనలోనే ఉన్న పరమాత్మని దర్శించమని . ఈ అంతరార్థాన్ని అంతరంలో నింపుకొని మరీ  అర్చన చేయడం మరింత శ్రేయోదాయకం .  వీలుంటే ఒక మారేడు దళం ఆయన మీద ఉంచి నమస్కరించుకోవడం మరీ మంచిది . 

ఇవేవీ ఆందుబాటులో ఉండకపోతే, ఇన్ని నీళ్లు నెత్తిన పోసి నమస్కరించినా, అనంత కరుణని చూపిస్తాడు ఆ గంగాధరుడు .  

వైష్ణవారాధన :

వైష్ణవారాధనలో ముందుగా తీరు నామం ధరించడం ఒక పధ్ధతి .  ఆ విధానం ఇప్పటి కాలంలో ఇబ్బందికరం అనుకుంటే,  కేవలం నీటితో అభిషేకం చేసుకోవచ్చు .  ఆ తర్వాత అష్టోత్తరం , శతనామం ఏదైనా చదువుకుంటూ పుష్పాఅర్చన చేసుకోవచ్చు . అక్షింతలతోటీ పూజించుకోవచ్చు . ఆ తర్వాత  నమస్కరించి,  ధూపం, దీపం అర్పించి నైవేద్యం సమర్పించాక  కర్పూర హారతి చూపించాలి.

గణపతి పంచాయతన పూజ :

అలాగే గణపతి పంచాయతనంలో గణపతికి యధాశక్తి అర్చన చేయాలి . ఆయనకు గరిక , గరిక పూలు అర్పించాలి .  అవి లేకుంటే గంధాక్షలతో అర్చన చేయవచ్చు . ఆ తర్వాత  నైవేద్యాన్ని సమర్పించి,  హారతి నివ్వాలి.

అమ్మవారు లేదా శక్తి పూజ :

అమ్మవారికి శుచి శుభ్రత ముఖ్యం .  అమ్మ దీపారాధనకు ఆరాధనకు ఆవునేయి శ్రేష్టం. శాక్తేయ పంచాయతనంలో ఆ జగజ్జననిని శుభ్రమైన వస్త్రాలు ధరించి శుచిగా  లలిత సహస్రనామార్చన చేసుకోవచ్చు. లేదా అమ్మవారి స్తోత్రాలు , లక్షీ అష్టోత్తరం వంటి వాటితో అమ్మని పూజించుకోవచ్చు . పూజకి పుష్పాలు, పసుపు కుంకుమలు వాడవచ్చు .  క్షీరాన్నం అమ్మకి ఇష్టమైన నివేదన.  వీలున్నంతవరకూ క్షీరాన్నం రోజూ లేదా ప్రతి శుక్రవారం నివేదన చేసుకోవచ్చు.  నైవేద్యము  తర్వాత హారతి సమర్పణ చేయాలి . 

ఇక స్కంధారాధనలో కనీసం ఋగ్వేదం కొంచెమైనా చదవగలిగితే చాలా బాగుంటుంది .  ఎందుకంటే ఆ స్వామి వేదగర్భుడు. వేదరూపుడు . జ్ఞానస్వరూపుడు.  

ఇవేవి చేయలేకున్నా రోజూ కనీసం ఒక్కసారి మనసారా మీ ఇష్టదైవానికి  నమస్కరించి, ధూపం, దీపం ఉంచి ఒక్క నమస్కారం చేసుకునైనా బయటికి వెళ్ళండి.  ఇతరత్రా  మీరు ఎంత పూజ చేసినా, మీ  మనసు దైవం మీద  నిలవడం ముఖ్యం అంతే.  మన మనసులో చిత్తం శుద్ధిగా లేకుండా ఏ పూజ చేసినా అది యాంత్రికమే అవుతుంది.

#nityapooja

Tags: sivarchana, ganapati pooja, nitya pooja, puja, pooja

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba