మార్గశిరం , ధనుర్మాస కాలంలో ఈ ఆరాధనలు శ్రేష్టం .
మార్గశిరం , ధనుర్మాస కాలంలో ఈ ఆరాధనలు శ్రేష్టం .
- లక్ష్మీరమణ
సంవత్సరంలోని పన్నెండు మాసాలకీ సంబంధించిన ప్రత్యేకతలని తెలియజేస్తూ 12 పురాణాలు రచించారు వ్యాస భగవానులు . వాటిల్లో ఒక్కొక్క మాసానిదీ ఒక్కొక్క ప్రత్యేకత . కార్తీకమాసంలో శివకేశవ ఆరాధనలో, దీపారాధనలతో, ధాత్రీదేవీ ఆరాధనతో గడిపాము. ఆ తర్వాత వచ్చే మార్గ శిరమాసం కేశవునికి అత్యంత ప్రియమైనది . ఈ మాసములో విష్ణు నామస్మరణం, విష్ణవాలయ సందర్శనం, సూర్యారాధనం విశిష్టంగా చెప్పబడ్డాయి . మనకున్న చాంద్రమానం ప్రకారం మార్గశీర్షమాసంలో ఉన్నాము . అదే సూర్యమానం ప్రకారం చూసినప్పుడు సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది .అది ఈ మార్గశీర్షంలోనే ఆరంభం కావడం ఒక ప్రత్యేకత. ఈ ధనుర్మాసమంతా కూడా విష్ణువని ఆరాధించినవారికి కోరికలన్నీ తీరి మోక్షము ప్రాప్తిస్తుంది .
అటు చాంద్రమానము, ఇటు సూర్యమానమూ కూడా విశ్వారాధనని ప్రభోదిస్తున్న పుణ్యకాలం ఇది . ఈ పుణ్యకాలంలో ఎన్నో విశేషాలున్నాయి . వాటిని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం . మార్గశీర్షము ప్రత్యేకముగా అసురసంహార శక్తులకు లేదా దేవతలకి బలాన్ని చేకూర్చే మాసం . అందువల్ల సృష్టి రక్షకుడైన విష్ణువు శ్రీకృష్ణుడిగా ఉపదేశించిన భగవద్గీతలో ‘ మాసానాం మార్గశీర్షోహం’ అని అంటారు. మాసాలలో మార్గశీర్షాన్ని నేనే అని చెప్పుకున్నారు . ఈ మాసమంతా కూడా భగవద్గీతా పారాయణ చేయడం, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం ఉత్తమమైన ఫలితాలనిస్తాయి .
మార్గశీర్ష శుద్ధ షష్ఠి నాడు కార్తికేయుడు పూరిగా రూపాన్ని పొందారని స్కాంద పురాణం, చెబుతోంది. మార్గశీర్ష పాడ్యమి నాడు శరణవంలో ప్రవేశించిన స్వామి , దినదిన ప్రవర్థమానమవుతూ కేవలం ఆరురోజుల్లో పూర్ణమైన రూపు తీసుకున్నారని మహాభారతం చెబుతోంది . కాబట్టి ఈ మాసమంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధనకు ప్రాధాన్యమివ్వాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి .
ఇక మార్గశీర్షమాసంలో సూర్యారాధకి విశేషమైన ప్రాధాన్యత ఉన్నది . సూర్యుడే ప్రత్యక్ష నారాయణుడు . ఈ మాసంలోని ఆదివారాలలో సూర్యుణ్ణి ఆరాధించడం వలన ఆరోగ్యం కలుగుతుంది . సూర్యునికి బెల్లంతో చేసిన పొంగలిని నివేదించడం వలన సూర్యానుగ్రహం కలుగుతుంది . కేవలం మూడు తులసీ దళాలతో మార్గశీర్షమాసంలో సూర్యారాధన చేయడం మరింత విశేషమైన ఫలాన్నిస్తుంది .
అదే విధంగా ధనూరాశిలో సూర్యుడు ప్రవేశించడంతో ఆరంభమయిన ధనుర్మాసంలో కూడా సూర్యుణ్ణి తులసీ దళాలతో పూజించి , క్షీరాన్నం నివేదించడం , ఆతర్వాత ఆ ప్రసాదాన్ని గ్రహించడం వలన ఆరోగ్యం చక్కబడుతుంది . విశేషించి ధనుర్మాసం, మార్గశిరమాసం దేవతలకి బ్రహ్మముహూర్త కాలం వంటివి గనుక , ఈ కాలంలో మనం మన కాలమానం ప్రకారం , సూర్యోదయానికి పూర్వమే లేచి దైవారాధన చేయడం వలన గొప్ప ఫలితాలు, శుభాలు కలుగుతాయి. అమ్మవారు గోదాదావి తన పాశురాలలో ఈ విధంగా ఉదయాన్నే లేచి, ఆ పరమాత్ముణ్ణి ఆరాధించమని బోధించారు . అదే పరంధాముని చేరుకునే మార్గమని చెప్పారు . కాబట్టి ఈ మార్గశిరంలో ఆ మర్గంలో నడిచి పురుషోత్తముని పొందుదాం .
శుభం . సర్వేజనా సుఖినోభవంతు .
#margasiram #dhanurmasam
Tags: margasira masam, dhanurmasam, vishnu, aradhana, pooja