భీష్మ అష్టమి పూజ పుత్రులని ప్రసాదిస్తుంది
భీష్మ అష్టమి పూజ పుత్రులని ప్రసాదిస్తుంది .
లక్ష్మీ రమణ
శంతన మహారాజు గంగమ్మని భార్యగా చేసుకొని , అష్టవసువులనూ బిడ్డలుగా పొందాడు . మొదట జన్మించిన ఏడుగురూ గంగపాలై పోయారు . ఎనిమిదవవాడు దేవవ్రతుడు (భీష్ముడు) . గంగమ్మ తీర్చి దిద్దిన యోధుడు . కురువంశాన్ని నిలబెట్టాల్సిన యోధుడు . కానీ దాశరాజు పుత్రిక అయినా యోజనగంధి ‘సత్యవతి’ ఆయన మనసు దోచుకుంది . ఆమెమీద మొహాన్ని తాళలేక, తన కూతురికి జన్మించిన వాడికే రాజ్యాభిషేకం చేయాలన్న దాశరాజు నిబంధన పాటించి దేవవ్రతునికి అన్యాయం చేయలేక మధనపడసాగాడు శంతనుడు .
అప్పుడు చేశాడు దేవవ్రతుడు ఒక భీషణమైన ప్రతిజ్ఞ . తండ్రి కోసం తానూ వివాహమే చేసుకోనని, ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటానని , సత్యవతికి జన్మించిన బిడ్డడికే రాజ్యాధికారం అప్ప్పగిస్తానని. ఆయన మాటమీద నిలబడ్డాడు . సత్యవతినిచ్చి శంతనుడికి వివాహం చేశాడు . అలాంటి భీషణమైన ప్రతిజ్ఞ చేసినందుకే ఆయన భీష్ముడు అని పేరొందాడు . ఆయన పితృభక్తిని మెచ్చిన శంతనుడు భీష్మునికి ఒక వరాన్ని అనుగ్రహించాడు . శంతనుడు అన్నారు “ నాయనా చిరంజీవి ! ధర్మ విరుద్ధమైన నా కోరికని తీర్చడం కోసం నీ జీవితాన్నే శాపాగనుల్లో వేల్చుకున్నావు తండ్రీ ! నీ వంటి కొడుకుని పుత్రునిగా పొందినందుకు నా జీవితం ధన్యమైనది . నీకు నా సర్వ శక్తులనూ , నీ తల్లి అయినా గంగమ్మని పత్నిగా పొందిన పుణ్యఫలాన్నీ ప్రేమతో ధారపోస్తున్నాను . దీనివల్ల నీవు ప్రపంచంలో అజేయుడవై , అతిలోక భయంకరుడవై విలసిల్లగలవు . అంతేగాక , నువ్వు కోరుకున్నప్పుడే తప్ప , మృత్యువు కూడా నిన్ను దరిచేరలేదు. ‘ స్వచ్ఛందమరణం ‘ నీకు వరంగా అనుగ్రహిస్తున్నాను . సింహాసనాన్ని నువ్వు విడిచినా , హస్తినాపురం రాజ్యలక్ష్మి నిన్ను విడువడు . నీ కనుసన్నలలో నిలిచి నిన్ను సేవిస్తూ ఉంటుంది . సంతాన రహితుడవైనా , పున్నామ నరకం నిన్ను చెందదు.” అని దివ్యమైన వరాలని శంతనుడు అనుగ్రహిస్తారు .
తండ్రి ప్రేమకి , పుత్రునికి తండ్రి పట్ల ఉండాల్సిన కృతజ్ఞత , బాధ్యత , అనురాగానికి అద్దం పట్టె దృశ్యం ఇది. ఆ విధంగా స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన భీష్ముడు, కురుక్షేత్ర సంగ్రామంలో శిఖండిని ఎదురుగా పెట్టుకొని అర్జనుడు చేసిన యుద్హానికి నెలకొరుగుతాడు . అంపశయ్యని భీష్ముని కోసం నిర్మిస్తాడు అర్జనుడు . అది మాఘమాసం . మాఘ శుక్ల సప్తమి మొదలు ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకాలుగా భావిస్తారు.
అలా భారత యుద్ధం సమయంలో క్షతగాత్రుడై, దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకూ, అంపశయ్యపై పరుండి ఉండి, మాఘ శుక్ల సప్తమి నుండి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడనాడారని చెపుతారు. కాల నిర్ణయ చంద్రిక, నిర్ణయసింధు, ధర్మసింధు, కాల మాధవీయం మున్నగు గ్రంథాలు మాఘ శుద్ధాష్టమిని భీష్మ నిర్యాణ దినంగా చెపుతున్నాయి. కార్తీక బహుళ అమావాస్యనాడు భారత యుద్ధ ప్రారంభ దినంగా భావించ బడుతుంది.
భీష్మాష్టమి "మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ !ప్రాజాపత్యేచ నక్షత్రే మద్యఃప్రాప్తే దివాకరే !" శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట.
పుత్రులు లేనందువల్ల ఆ భీష్మునికి తర్పణాలు విడవాలి . పద్మ పురాణంలో, హేమాద్రి వ్రత ఖండంలో భీష్మాష్టమి గురించి చెప్పబడింది. భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఈనాడు భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్త్భుం తెలుపుతున్నది. కృత్యసార సముచ్చయాధారంగా భీష్మాష్టమి శ్రాద్ధదినం. భీష్మ ద్వాదశి వ్రతం ఈ దినాననే ప్రారంభిస్తారని నిర్ణయ సింధువు స్పష్టపరుస్తున్నది.
భీష్మాష్టమి భారత దేశమంతటా జరుపుకోవాల్సిన పర్వమని వ్రతోత్సవ చంద్రిక సూచిస్తున్నది. కొందరు పంచాంగకర్తలు ఈనాటి వివరణలో నందినీ పూజ, భీష్మాష్టమిగా పేర్కొంటారు. ‘‘వైయాఘ్య్రసద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ, అపుత్రాయ తదామ్యే తజ్జలం భీష్మాయవర్మణే, వసూ రామావతారాయ శంతనోరాత్మజాయచ, అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రాహ్మచారిణే’’. అంటూ ఈదినం నాడు భీష్ములకు తర్పణం విడవాలని అమాదేర్ జ్యోతిషి పేర్కొంటున్నది.
తర్పణం విడిచేప్పుడు ఇలా చెప్పుకోవాలి .
భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!!
వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే!!
వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!!
అనేన భీశం అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!
ఇలా ఈనాడు తర్పణం, శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని భావన.
శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందారు భీష్మ పితామహుడు . కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ.