ఆర్ధిక సమస్యలకి పౌర్ణమి పూజ పరిష్కారం.
ఆర్ధిక సమస్యలకి ఈ పౌర్ణమి పూజ చక్కటి పరిష్కారం.
-లక్ష్మీ రమణ
నెలంతా కస్టపడి , రెండుచేతులా సంపాదిస్తున్న , ఆర్థిక ఇబ్బందులు తప్పని జీవితాలు మనలో చాలా మందివి . ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే వారు పౌర్ణమి రోజు కేశవుడిని ఆరాధిస్తే, ఆ సమస్యల నుండీ బయటపడొచ్చు అంటున్నారు పండితులు . శివలింగాన్ని మారేడుదళాలతో పూజించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు .
కేశవ పూజావిధి :
పౌర్ణమి రోజు ఉదయం లేదా సాయంత్రం మన ఇంట్లో ఉన్న వెంకటేశ్వర లేదా లక్ష్మీ నరసింహ స్వామి ఫోటోకు తులసి మాలలను సమర్పించి, ఆవునేతితో దీపం వెలిగించాలి. దీపం వెలిగించే ముందు, దీపానికి గంధంతో అలంకరణ చేయాలి. ఆ తర్వాత దీపంలో చిటికెడు పసుపు, పచ్చ కర్పూరం, యాలకులు వేసి దీపారాధన చేసి స్వామివారి కి సమర్పణ చేసి భక్తిగా నమస్కరించాలి . మన మనోవాంఛని శ్రీవారికి నివేదించాలి . అష్టోత్తర పూజ చేసుకోవచ్చు . స్వామివారి వజ్రకవచ స్తోత్ర పారాయణం విశేషఫలదాయకం . ఇలా స్వామివారికి పూజ చేసిన తరువాత, పటిక బెల్లం లేదా పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి.ఈ విధమైనటువంటి పరిహారాన్ని చేయటం వల్ల నిత్యం మన దగ్గర డబ్బు నిల్వ ఉంటుందని పండితులు చెబుతున్నారు.
శివారాధన :
ఇంట్లో శివలింగం ఉంటే సాయంత్రం పూట స్వామివారికి గంధం అలంకరించి, దీపారాధన చేసి , మారేడు దళాలతో అష్టోత్తర పూజ చేయాలి. ఆపై కామ్యాలను స్వామికి నివేదించి , అక్షింతలు తలపై ధరించాలి .
ఇక ఆలయానికి వెళ్ళిన వారు స్వామివారిని పూజించిన తర్వాత నంది చెవిలో మన కోరికలను తెలియజేయాలి. అలాగే మంగళవారం శివుడికి సమర్పించిన బిల్వ దళాలను తీసుకొని మనం డబ్బు నిల్వ చేసే చోట నిల్వ చేయడం వల్ల ఎంతో శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఈ విధమైనటువంటి పరిహారం మార్గాలను ప్రతి పౌర్ణమికి చేయవచ్చు.