Online Puja Services

పూజల్లో ధూపదీప నైవేద్యాలు ఎందుకు ?

18.191.86.218

పూజల్లో ధూపదీప నైవేద్యాలు, గంటల మోతలు, చందన సేవలు ఎందుకు ?

సాధారణంగా పూజల్లో ఈ క్రింది విధులు తప్పకుండా ఉంటాయి .  వాటి పరమార్థాన్ని అర్థం చేసుకొని ఆత్మార్పణ భావనతో వీటిని నిర్వహించడం వలన భగవంతుడు అత్యంత  ప్రీతిని పొందుతాడు . 

1. గంటలు :
దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.

2.దీప హారతి:
దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది.  స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, 
మా బుద్ధిని ప్రభావితం చేయి" అని.

3. ధూపం:
భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ జ్ఞప్తి చేసినట్లవుతుంది.

4. కర్పూర హారతి:
వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. 
ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు.

5. గంధపు సేవ:
ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం. 

6. పూజ:
దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. 
కాని భగవంతునికి వీటితో పనిలేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.

7 పత్రం(శరీరము):
ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.

8 పుష్పం (హృదయము):
ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.

9 ఫలం (మనస్సు):
మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.దాన్నే త్యాగం అంటారు.

10. తోయం(నీరు):
భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి.

11 కొబ్బరికాయలు:
హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారము. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు. మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

12. నమస్కారము:
చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. 
ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.

13. ప్రదక్షిణము:
ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.

- లక్ష్మి రమణ 

Quote of the day

Treat your kid like a darling for the first five years. For the next five years, scold them. By the time they turn sixteen, treat them like a friend. Your grown up children are your best friends.…

__________Chanakya