Online Puja Services

పూజ చేసేప్పుడు ఇలా ఉండాలి

3.147.62.5

పూజ చేసేప్పుడు ఇలా ఉండాలి . 

భక్తి శివునిమీద చిత్తం చెప్పుల మీద అన్నట్టు , పూజా విధి నిర్వహించేప్పుడు మనసు కూడా ఆ అధిదైవం మీద లగ్నమవ్వాలి కానీ , వేరే విషయాలమీద కాదు . ఇది మాట చెప్పినంత సులువు కాదు . అందుకే పతంజల మహర్షి ‘చిత్త వృత్తి నిరోధస్య యోగః ‘ అంటాడు . చిత్తవృత్తులను నియంత్రించి ఆ పరమాత్మ వైపు తిప్పగలిగావా, మహర్షులకు సాధ్యమైన యోగము నీకూ సిద్ధించినట్టే అని . అయితే, ఇది ఏమంత అల్లాటప్పా విషయం కాదు . 

కావాలంటే , మీరిలా చేసిచూడండి . దేవుని పూజకి కూర్చోండి . దీపం వెలిగించండి . పూజా విధిని ఆరంభించండి . కానీ ఒకకన్ను మీ మీద వేసి ఉంచండి . అదేనండీ , మిమ్మల్ని మీరు గమనిస్తుండండి. మీ మనసు ప్రతి సెకనుకీ , లెక్కకు అందనన్ని ప్రతిపాదనలు మీముందుకు తెస్తుంటుంది . యేవో జ్ఞాపకాలను నెమరువేస్తుంటుంది . ఆ పదినిమిషాల్లోనే , భూమి బద్దలయ్యే ఇంపార్టెంటు విషయాలు మీ బుర్రని తొలిచేసేలా చేస్తుంది . 

ఇదంతా ఒకెత్తయితే, పూజ ప్రారంభించాక , పుస్తకం లో నామాలు , మంత్రాలు, శ్లోకాలు చదువుతూ కుడి చేత్తో విగ్రహంపై పూలు విసరడం యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటుంది. దృష్టి మనసు కేవలం పుస్తకంలోని నామం చదవడంపై ఉంటుంది. ఈ లోపు హరతి కర్పూరం వెలగడంలేదనో, అగ్గిపెట్టె అందుబాటులో లేదనో, గంధం సరిగా తీయలేదనో, అక్షతలు సిద్దం చేయలేదనో, ఏదో ఒక లోపంపై కుటుంబ సభ్యుల మీద విసుక్కోవడం, చిరాకు పడటం జరిగిపోతాయి .  ఒకవేళ  అన్ని సరైన సమయంలో అమరి ఉన్నా కూడా క్రిందటి రోజు ఆఫీస్ లో జరిగిన సన్నివేశాలు , సమస్యలు మనసులో జ్ఞాపకం వస్తే మళ్ళి పూజ అవగానే ఆఫీసుకి వెళ్లి ఏం చేయాలో మనసు ప్రణాళిక రచిస్తుంటుంది. పూజ  మెకానికల్ గా జరుగుతుంటుంది.  మనసు మాత్రం ఆఫీస్ లో ఉంటుంది.

ఇదంతా గమనిస్తే , పూజకి కూర్చోగానే ఇదేమి ఖర్మరా బాబూ ! అని మీకు  అనిపించక మానదు .ఇలాకాదని ,  ప్రయత్నపూర్వకంగా మనసును పూజ కోసం వినియోగించగానే ఎవరో పోన్ చేస్తున్నారు, అర్జెంటుగా రండి అని సతీమణి గారు చెప్పగానే పోన్లో మాట్లాడి రావడానికి కొంత టైం కర్చు అవుతుంది. అప్పటికింకా కొందరు దేవతల మీద సహస్రనామాలు , స్త్రోత్రం, మిగిలే ఉండడం  వలన చాలా వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నించి, చివరికి మమ అనుకొని పూర్తి చేస్తారు. 

ఈ ఫూజ కూడా గణపతి స్తోత్రం, ఆ తర్వాత శివ అష్టోత్తరం, ఆ తర్వాత లలితా సహస్రనామ స్తోత్రము, శివుడిని మాత్రమే పూజిస్తే విష్ణువు ఏమనుకుంటారో అని విష్ణు సహస్రనామ స్తోత్రము, ఆ తర్వాత నవగ్రహలు, శని అష్టోత్తరం, ఈ విధంగా అనేక దేవతా మూర్తుల పై ఉంటుంది పూజ! 

ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పూజా కార్యక్రమంలో తాను తనని మర్చి! మనస్సు దేవతా విగ్రహం మీద లయం చేసి బాహ్య స్మృతి అంటే శరీర స్పృహ లేకుండా భగవంతుని లో ఎంతకాలం నిలువ గలిగాడు ? కనీసం 5 నిమిషాలు కూడా ఉండలేదు. అంటే భగవంతుని దృష్టిలో లెక్కలోకి వచ్చేది కేవలం 5 నిమిషాలే కాని బాహ్యంగా పూజ జరిగిన నాలుగు గంటలు లెక్కలోకి రావు. 

అందుకనే మరి , గుర్రానికి కళ్ళెం బిగించినట్టు చిత్తాన్ని నిగ్రహించి, దైవం వైపు మల్లెలా చేయాలి. అప్పుడే మీ పూజ నిజంగా సంపూర్ణమయినట్టు . గంగిగోవుపాలు గరిటెడైనను చాలు , కడివెడైననేమి , ఖరము పాలని , పూజ చేసేది నాలుగు నిమిషాలయినా సరే, అది ఆ భగవంతునిపైన నిమగ్నమైన మనస్సుతో ఉండాలి .

- లక్ష్మి రమణ 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore