Online Puja Services

శనివారం శనిదేవుని అనుగ్రహం కోసం సులభంగా ఇలా పూజ చేసుకోండి !

18.226.226.164

శనివారం శనిదేవుని అనుగ్రహం కోసం సులభంగా ఇలా పూజ చేసుకోండి ! 
- లక్ష్మి రమణ 

వారం పేరులోనే శని దేవుని పేరు కలిగిన రోజు శనివారం . ప్రతి వ్యక్తీ కూడా తన జీవితకాలంలో ఒక్కసారైనా శనీశ్వరుని ప్రభావానికి లోను కావాల్సిందే నని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతుంటారు . నిజానికి శని మనల్ని ధర్మపథంలో నడిపించే మహానుభావుడు . ధర్మాన్ని అనుష్టించడం కష్టమైన విషయమే . కొన్ని సార్లు శని ప్రభావం వలన జీవితంలో అష్టకష్టాలనీ ఎదుర్కోవాల్సి రావొచ్చు కూడా !! ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు శనివారం చాలా శుభకరమైన సమయం . శనివారంనాడు శనీశ్వరుడిని పూజిస్తే ఏలిననాటి అష్టమ శనిదోషాలు కూడా తొలగిపోతాయి. శనివారం శనిదేవుని అనుగ్రహం కోసం సులభంగా ఎటువంటి పూజని చేసుకోవాలో తెలుసుకుందాం . 

ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక , ఆరోగ్య సంబంధిత సమస్యలు శనిదోష ప్రభావం వలన ఏర్పడవచ్చు . అయితే శనీశ్వరుడు ఎప్పుడూ సమస్యలనే సృష్టించడు. శనిదేవుని  ఆశీర్వాదం, కృప ఉన్న వ్యక్తి జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. శనిదోషం తొలగిపోవాలంటే శనీశ్వరుణ్ణి ఆరాధించవచ్చు . లేదా హనుమంతుణ్ణి, శివుణ్ణి కూడా పూజించవచ్చు. 

శనీశ్వరుని ఆరాధన : 

ఇది ఏదైనా దేవాలయంలో చేసుకోవాలి . నవగ్రహాలున్న ఆలయంలో చేసుకోండి . శనీశ్వరుడికి నువ్వుల నూనె అంటే ఎంతో ప్రీతి . నల్ల నువ్వులు, నువ్వులనూనె, నల్ల రిబ్బన్ తీసుకుని వెళ్ళండి . శనీశ్వరునిపైన నువ్వుల నూనె పోసి, నల్లనువ్వులు వేసి , ఆ రిబ్బన్ కూడా ఆయనమీద వస్త్రంలా వేసి,  నువ్వుల నూనెతో దీపం పెట్టి , అగరువత్తుల దూపం వేయండి. ఆ తర్వాత ఒక కొబ్బరి కాయ కొట్టి, హారతిచ్చి నమస్కారం చేయండి . వీలయితే, శనీశ్వరుని శ్లోకాన్ని చదువుకోండి .

నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరం

నల్లటి కాటుక రూపంలో ఉండేటటువంటి వాడు,  సూర్యభగవానుడి యొక్క పుత్రుడు, యముడికి సోదరుడు, ఛాయా దేవికి సూర్య భగవానుడి వలన  జన్మించినటువంటి వాడైనటువంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని అర్ధం. ఈ చిన్న పూజ చేసుకుంటే, శని బాధలు తొలగి ఆ శని +ఈశ్వరుడైన పరంధాముని అనుగ్రహం కలుగుతుంది . 

రావిచెట్టుని అర్చించడం, పరమేశ్వరుణ్ణి శనివారం అర్చించడం , హనుమానితుని ఆరాధన చేయడం కూడా శనీశ్వరుని ప్రభావాన్ని ఉపశమింపజేస్తాయి. శుభం . 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba