మాతంగీ నవరాత్రుల్లో చేసుకోదగిన లఘు పూజా విధానం.

చదువుల్లో, ఉద్యోగాల్లో గొప్ప ఉన్నతిని ప్రసాదించే మాతంగీ నవరాత్రుల్లో చేసుకోదగిన లఘు పూజా విధానం.
- లక్ష్మీరమణ
మాఘ గుప్త నవరాత్రిల సమయంలో హయగ్రీవుడు చెప్పిన శ్రీ శ్యామలాదేవి షోడశనామాలనూ పఠించడం అమ్మ అనుగ్రహాన్ని అందిస్తుంది. అన్ని రకాల చెడు ప్రభావాలూ, ప్రతికూల శక్తులు దూరమవుతాయి. దయతో ఆవిడ పారద్రోలుతుంది. భక్తులకి ఎటువంటి భయము, ఒత్తిడి లేకుండా చేస్తుంది. అమ్మ ఆరాధన ప్రత్యేకించి ఈ నవరాత్రుల్లో చేసే ఆరాధన అమితమైన బుద్ధిని, శక్తిని, అపార మేధా సంపత్తులు కలగజేస్తుందని శాస్త్ర వచనం. మాఘ శుద్ధ పాడ్యమి నుండీ ఈ నవరాత్రుల పుణ్య కాలం ఆరంభం కానుంది. మాఘ శుద్ధ నవమి వరకూ ఈ పర్వదినాలు కొనసాగుతాయి .
రాజశ్యామలా దేవి అనే పేరు అమ్మవారికి ఎలా వచ్చింది ?
రాక్షస సంహారం చేసిన లలితాపరాభట్టారికా సముదాయంలో వారాహి, శ్యామల రూపాలు ప్రధానమైనవిగా లలితా సహస్రనామ వివరణలో తెలుసుకుంటాం. ఇంకా అనేక సందర్భాలలో శ్యామలాదేవి గురించి సహస్రనామంలో ప్రస్తావించారు. అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి ఎడమవైపు వారాహి దేవి ఉంటారు. అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును, రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించింది. ఆమెను తన ప్రతినిధిగా రాజ్య భారం అంతా అప్పగించింది. అందుకే శ్యామలా దేవిని రాజశ్యామల అంటారు.
అటువంటి సర్వ సమర్థమైన శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే, మంచి ఉద్యోగాలు, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యం లభిస్తాయి . అంతేకాక భార్యాభర్తల మధ్య అన్యోన్యము పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని మంత్ర శాస్త్రాలు చెబుతున్నాయి . ఈ తల్లిని దశమహా విద్యల్లో మాతంగి అని పిలుస్తారు.
అమ్మవారికి మాతంగి అనే పేరు ఎలా వచ్చింది?
హిమవంతుడి స్నేహితుడైన మాతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మీద మాతంగమునికి కుమార్తెగా జన్మించింది. మాతంగ ముని కుమార్తెగా, మాతంగి దేవి పేరుతొ ప్రసిద్ధి చెందింది. జ్ఞానాంబిక అయినా ఈమెని నీల సరస్వతి, గేయ చక్రవాసిని, లఘు శ్యామల, వాగ్వాదిని శ్యామల, నకుల శ్యామల, హసంతిశ్యామల, సర్వసిద్ధి మాతంగి, వాస్య మాతంగి, సారిక శ్యామల, శుకస్యామల, రాజమాతంగి అని ఎన్నో పేర్లుతో ఆరాధన చేస్తారు .
మాతంగి నవరాత్రి పూజా విధానం.
ఈ దేవికి తొమ్మిది రోజులపాటు పంచోపచారాలతో పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించి, మంత్ర జపం తప్పకుండా చేయాలి. మంత్రం జపం అర్హత లేనివారు , ఉపదేశం లేనివారు మాతంగి దేవి స్తోత్రాలు, హృదయము, కవచము, లలితా సహస్రనామము మొదలైన వాటిని పారాయణ చేసుకోవచ్చు.
వీలైతే చిలకపచ్చ రంగు వస్త్రాలు గాని, ఎర్రని వస్త్రాలను గాని అమ్మకి ధరింపజేయండి. మీరూ ధరించండి. ఎరుపు రంగు, తెలుపు రంగు పూలతో అలంకరణ చేయండి . ప్రసాదంగా తమలపాకు, చిన్న ఎండు ఖర్జూరం, తేనె, యాలకులు, లవంగం, చిన్న ఎండు కొబ్బరి ముక్క సమర్పించండి. చిన్న పటిక బెల్లం ముక్క కూడా పెట్టొచ్చు.
మాతంగీ షోడశ నామావళి :
హయగ్రీవ ఉవాచ |
తాం తుష్టువుః షోడశభిర్నామభిర్నాకవాసినః |
తాని షోడశనామాని శృణు కుంభసముద్భవ || 1
సంగీతయోగినీ శ్యామా శ్యామలా మంత్రనాయికా |
మంత్రిణీ సచివేశీ చ ప్రధానేశీ శుకప్రియా || 2
వీణావతీ వైణికీ చ ముద్రిణీ ప్రియకప్రియా |
నీపప్రియా కదంబేశీ కదంబవనవాసినీ || 3
సదామదా చ నామాని షోడశైతాని కుంభజ |
ఏతైర్యః సచివేశానీం సకృత్ స్తౌతి శరీరవాన్ |
తస్య త్రైలోక్యమఖిలం హస్తే తిష్ఠత్యసంశయమ్ || 4
గుప్త నవరాత్రులలో నిర్దిష్టమైన సంఖ్యల్లో జప పారాయణది అనుష్టానముల చేత మంత్రసిద్ధిని కలిగి సాధకుని కోరికలు తీర్చుకోవచ్చు. నిజమైన భక్తులు తొమ్మిది రోజుల పాటు ఆచారాలను పాటిస్తారు.
#matangi #rajasyamala #pooja
Tags: Matangi, mathangi, raja shyamala, raja syamala, rajasyamala, pooja, puja