Online Puja Services

తులసిని కోసేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

3.12.34.150

పూజకు తులసిని కోసేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
- లక్ష్మి రమణ  

శ్రీ మహావిష్ణువుని ( Lord Vishnu) పూజించేందుకు తులసీ దళాలు (Tulasi Dalam) అత్యంత శ్రేష్టమైనవి. తులసీ దళాలతో పూజించడం తులసీ మంజరులతో పూజించడం వలన విష్ణు (maha Vishnu) భగవానుడు ప్రీతిని పొందుతారు. అహంకారంతో , ధనగర్వంతో నిలువెత్తు ధనం పోసినా సత్యభామ ఆ కృష్ణ (Krishna) స్వామిని పొందలేకపోయింది. కానీ, భక్తి, ప్రేమ కలిసిన  ఒక తులసీ దళంతో ఆ స్వామిని పొందగలిగింది. అంతటి మహిమాన్వితమైనది , విష్ణు  (Vishnu)కృపని, సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని అందించేది  తులసీ పూజ. తులసితో విష్ణుపూజ. పూజకు తులసిని కోసేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. 

దళమే కోసుకోవాలి : 

‘తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః’ 

 అంటుంది స్కాంద పురాణం. పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని అర్థం. అయితే , ఇలా తులసిని పూజకు కోసేప్పుడు ఎలాబడితే అలా కోయకూడదు. తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు. రెండేసి ఆకులు కలిగిన దళముతో కూడిన కొసలను మాత్రమే కోసుకోవాలి.

దళమైనా ఈ రోజుల్లో కోయకూడదు:

నిర్ణయసింధు, విష్ణుధర్మోత్తర పురాణమూ ఏ రోజుల్లో తులసిని కోయకూడనే విషయాన్ని తెలియజేశాయి.  వీటి ప్రకారము తులసి చెట్టునుండి దళాలను మంగళ, శుక్ర, ఆది వారములలో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, సంక్రాంతి రోజుల్లో, జనన- మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో తుంచ కూడదు.

 తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం కాదు:

నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసిని కోయ కూడదు కదా ! మరి అప్పుడు భగవంతుని పూజ ఎలా సంపూర్ణం అవుతుంది ? అని సందేహం వస్తే దానికి సమాధానం  వరాహ పురాణం చెబుతుంది. అటువంటి రోజులలో చెట్టు కింద వాటి అంతట అవే (స్వయంగా) రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములు కోసి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించుకోవచ్చు.

సాలగ్రామము స్వయంగా విష్ణువే !:

స్వయంగా విష్ణువు వేంచేసి ఉన్నప్పుడు ఏ కాలనీయమమూ వర్తించదు.  అంటే ఇంతకూ ముందర చెప్పుకున్న వారాలూ , వర్జాలూ ఏవీ వర్తించవన్నమాట.  ఆ విష్ణువు స్వయంగా వేంచేయడానికి , ఇంట్లో సాలగ్రామ శిలని  వేంచేపు చేసి పూజించుకోవడానికి పెద్దగా తేడాఏమీ లేదు. సాలగ్రామమున్నవారు అన్ని తిథివారములలోనూ  తులసి దళములను కోయవచ్చు .  అప్పుడు ఏ దోషాలూ వర్తించవు. ఇది ఆహ్నిక సూత్రావళిలో చెప్పబడింది. 

ఈ నియమాలు తప్పనిసరి : 

స్నానము చేయకుండా,  పాద రక్షలు ధరించి తులసి చెట్టను తాకకూడదు.  దళములను తుంపకూడదు అని  పద్మపురాణం చెబుతోంది. 

మంజరులు సర్వశ్రేష్టమైన పుష్పాలు : 

అన్ని పుష్పాల కన్నా తులసీ మంజరులు ( తులసికి వచ్చే పుష్పాలు) అత్యంత శ్రేష్ఠమైనవి. వీటితో పూజిస్తే, సర్వ పుష్పాలతోటి పూజించిన ఫలం దక్కుతుంది.  కానీ  ఈ మంజరులను కోసేటప్పుడు వాటితోపాటు ఆకులు (దళం- రెండు ఆకులు కలిసినవి) తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం నిర్దేశించింది.

తులసిమొక్కకు ఎదురుగా నిలబడి, రెండు చేతులు జోడించి, పూజా భావంతో మొక్కను కదిలించకుండా తులసి దళాలను భక్తిగా కోసుకోవాలి . దీనివలన ఆ దళాలతో చేసినటువంటి పూజాఫలం లక్షరెట్లు అధికంగా లభిస్తుంది అని పద్మపురాణం తెలియజేస్తోంది.

తులసీ స్తుతి : 

మాతస్తులసి గోవింద హృదయానందకారిణి
నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే

తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియా
చినోమి కేశ్వస్యార్థే వరదా భవ శోభనే

త్వదంగసంభవైః పత్రై పూజయమి యథా హరిం
తథా కురు కురు పవిత్రాంగి! కలౌ మలవినాశిని!

ఆహ్నిక సూత్రావళిలో పేర్కొన్న ఈ తులసీ స్తుతి అర్థం ఇదీ.  “శ్రీహరికి  ఆనందాన్ని కలిగించే ఓ తులసీ మాతా! నారాయణుని పూజ కోసం నీ దళములను కోస్తున్నాను. నీకు నా నమస్కారములు. అమృతము నుండి జన్మించిన దేవదేవీ,  శ్రీహరికి ప్రియమైన ఓ తులసీమాతా! ఆ కేశవుని పూజ కొరకు నీ దళాలను కోస్తున్నాను. నాకు అభయమునివ్వు. ఓ  శుభకరీ! నీ శరీరమునుండి జన్మించిన పత్రములతో ఆ శ్రీహరిని పూజిస్తాను. కలియుగంలో సమస్త దోషములు తొలగించే పవిత్రమైన శరీరము కల తల్లీ! నేను తలపెట్టిన హరి పూజను సాఫల్యము చేయి.

పూజ తర్వాత :

శ్రీహరిని తులసీ దళాలతో పూజించిన  తరువాత ఒక తులసీదళాన్ని "అచ్యుతానంత గోవింద" అని స్మరిస్తూ నోట్లో వేసుకొని తినాలి. ఇలా ప్రతి రోజు భక్తి భావంతో ఒక తులసిదళాన్నిసేవించటం వలన సకల రోగాలు నశిస్తాయి. భవిష్యత్తులో రాబోయే రోగాలు నిరోధించబడతాయి.

శుభం . 

Precautions while plucking Tulasi Dalam for Pooja

#Tulasi #tulasidalam #vishnu #mahavishnu #salagramam #krishna #srikrishna #satyabhama #rukmini

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi