Online Puja Services

నవరాత్రుల్లో అమ్మవారిని పూజ ఎలా చేయాలి ?

18.226.226.164

నవరాత్రుల్లో అమ్మవారిని పూజ ఎలా చేయాలి ?
- లక్ష్మి రమణ 

నవరాత్రుల్లో అమ్మవ్వారికి ప్రీతికరమైన అర్చనలు చేయడం విశేషమైనది . గొప్ప ఫలితాన్ని అనుగ్రహించేది. వాంఛితాలనన్నింటినీ తీర్చగలిగినటువంటిది. అటువంటి అమ్మవారి అనుగ్రహంకోసం చేసే అర్చన విధానాలు అనేక రకాలు . మన వీలుని బట్టీ వాటిని అనుష్టించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రం కావొచ్చు . అయితే ఆ విశేషమైన అర్చనలు ఏమిటి అనేది తెలుసుకుందాం రండి. 

అమ్మవారు అనే పిలుపులోనే అమ్మ అనే శబ్దం దాగి ఉంది. అమ్మ తన బిడ్డ ఎలా  పిలిచినా  ఎంతటి ఆప్యాయతతో పలుకుతుందో, అమ్మవారు కూడా అదే ఆప్యాయతతో ప్రతి జీవికీ ఖచ్చితంగా పలుకుతుంది . ఆ పలుకు తేనియల తల్లి ఆప్యాయతని అనుభవించడానికి ప్రత్యేకించి పూజలు అవసరంలేదు .  అమ్మ ని ఈ భావనతో అర్చిస్తే చాలు . అలా అర్చించేప్పుడు లలితా సహస్రం, దుర్గా సప్తశతి, రాజశ్యామలా స్తోత్రం ఇలా మీ ఇష్టమైన రూపంములో ఆ అమ్మని భావం చేస్తూ, వాటిని పఠిస్తూ ఆరాధించవచ్చు. 

అమ్మకి ఎన్ని చీరలున్నా, నాన్నగారు తీసుకొచ్చిన చీరని యెంతో  అపురూపంగా అమ్మ కట్టుకుంటుంది. తన ఇష్టాన్ని నాన్నగారు గుర్తించినప్పుడు అమ్మ కళ్ళల్లో ఉండే ఆనందమే వేరు . అలాగే జగజ్జనని కూడా! అమ్మవారిని విష్ణు వక్షస్థల వాసినీ అంటే లక్ష్మీ దేవిగా అమితమైన సంతోషాన్ని పొందుతుంది.  పరమేశ్వర ప్రియా అంటే పార్వతీ దేవిగా , సర్వమంగళా దేవిగా సౌభాగ్యాన్ని అనుగ్రహిస్తుంది . ఆ విధంగా అమ్మ అనుగ్రహాన్ని పొందేందుకు ఆమెకి ఇష్టమైన పనులు చేస్తే మరింతగా తృప్తిని పొంది అపారమైన అనుగ్రహాన్ని వర్షిస్తుంది .   అందుకు ఏమేం చేయాలో చూద్దాం. 

విశేషమైన కుమారీ అర్చన : 

అమ్మవారికి ప్రియమైన అర్చనలలో కుమారీ అర్చన విశేషమైనది. శ్రీదేవీ నవరాత్రులలో మొదటిరోజు ఒక సంవత్సరం కలిగిన కన్యను బాలగా,

రెండవ రోజు రెండు సంవత్సరాలు కలిగిన కన్యను కుమారిగా
మూడవరోజు మూడు సంవత్సరాలు కలిగిన కన్యను త్రిమూర్తిగా,
నాల్గవరోజు నాలుగు సంవత్సరాలు కలిగిన కన్యను కళ్యాణిగా,
ఐదవరోజు ఐదు సంవత్సరాలు కలిగిన కన్యను రోహిణిగా,
ఆరవరోజు ఆరు సంవత్సరాలు కలిగిన కన్యను కాళికగా,
ఏడవరోజు ఏడు సంవత్సరాలు కలిగిన కన్యకను చండికగా,
ఎనిమిదవరోజు ఎనిమిది సంవత్సరాలు కలిగిన కన్యకను శాంభవిగా.
తొమ్మిదవరోజు తొమ్మిది సంవత్సరాలు కలిగిన కన్యకను దుర్గగా,
పదవరోజు పది సంవత్సరాలు కలిగిన కన్యకను సుభద్రగా
భావించి షోడశఉపచారాలతో శ్రీసూక్త విధానంగా సహస్ర, త్రిశతీనామ, అష్ణోత్తర శతనామ, దేవీఖడ్గమాలా నామాదులతో, హరిద్ర, కుంకుమ పుష్పాదులతో అర్చించి, మంగళహారతులిచ్చి, ఆభరణ, పుష్ప, చందనాదులతో సత్కరించి వారియొక్క ఆశీర్వచనము తీసుకున్నట్లయితే  సకలశుభములు కలుగుతాయి.

కుంకుమార్చన : 

అలాగే కుంకుమార్చన చేస్తే, అమ్మవారు చాలా సంతోషపడతారు . పసుపుకొమ్మలను తీసుకొచ్చి, నిమ్మరసంలో మూడు రోజులు నానబెట్టి, ఎండలో ఆరబెట్టాలి. ఎండిపోయాక ఆ పసుపుకొమ్ములని కుంకుమరాళ్లతో కలిపి దంచి, జల్లించి, తయారుచేసుకున్న కుంకుమ ఉత్తమమైనది. మార్కెట్లో దొరికే రంగులు కలిపిన కుంకుమ కాదు. ఇటువంటి కుంకుమతో అమ్మను ఆరాధించినట్లయితే, అఖండ సౌభాగ్యం కలుగుతుంది . కోరిన కోర్కెలు తీరిపోతాయి . 

సువాసినీ పూజ : 

అదే విధంగా సువాసినీ పూజ చేసినా కూడా దేవీ అనుగ్రహం సిద్ధిస్తుంది . సలక్షణాలతో ఏవిధమైన అవయవలోపంలేని సౌమ్యమైన, ముతైదువను ఎంచుకొని, అమ్మవారిగా భావించి, షోడశ ఉపచారములతో శ్రీసూక్త విధానంగా సహస్ర, త్రిశతీ, అష్ణోత్తర, ఖడ్గమాల నామములతో అర్చించి, మంగళహారతి ఇచ్చి, ఆభరణ, పుప్ప, హరిద్ర, కుంకుమ చందనాదులతో సత్కరించి, ఆ సువాసినితో ఆశీర్వచనము తీసుకొనిన సువాసినీపూజ పూర్తియగును . ఈ సువాసినీపూజ శ్రీచక్రనవావరణార్చన అనంతరం దేవీనవరాత్రులలో నిర్వహించాలి. శక్తి అనుసారం ఒక ముతైదువకుగానీ, ముగురికిగానీ, ఐదుగురికిగానీ, ఏడుగురికిగానీ, తొమ్మిదిమందికిగానీ, పద్దెనిమిదిమందికి గానీ, ఇరవై ఏడుమందికి గానీ, యాభై నాలుగుమందికి గానీ, నూట ఎనిమిది మందికిగానీ, ఐదువందల యాభై ఎనిమిదిమందికి గానీ, వెయ్యిన్నూట పదహారు మందికిగానీ సువాసినీపూజ చేయవచ్చును.

ఈ విధంగా వీలైన వారు విశేషమైన పూజా కార్యక్రమాలని నిర్వహించండి . అటువంటి వీలు లేనివారు ముందరే చెప్పుకున్నట్టు దివ్యమైన మాతృ భావనతో అమ్మని మీ మనసునిండా నిలుపుకొని వీలైన పూజ చేసుకోండి . ఆ దేవదేవి అనుగ్రహం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. శుభం . 

సర్వేజనా సుఖినోభవంతు !! శుభం !! 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba