సోమవారంనాడు ఈ పూలతో శివార్చన చేస్తే,
సోమవారంనాడు ఈ పూలతో శివార్చన చేస్తే, అష్టైశ్వర్యాలూ కలుగుతాయి .
- లక్ష్మి రమణ
సోమవారంనాడు చేసే అభిషేకం శివార్చన శివ దర్శనం సకల శుభప్రదం. ఉమాసహితు డైన చంద్రమౌళీశ్వరుణ్ణి సోమవారం పూజించుకోవడం, శివలింగాన్ని అభిషేకించిన జలాన్ని తీర్థంగా తీసుకోవడం చేత సకలమైన అనారోగ్యాలూ హరిస్తాయి . పైగా మనసుకి శాంతి, ఇంట్లో శాంతి సామరస్యాలు , అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తాయి . ప్రత్యేకించి సోమవారంనాడు ఈ పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే, అష్టైశ్వర్యాలూ కలుగుతాయని అంత్యాన శివలోకం ప్రాప్తిస్తుందని శివపురాణం చెబుతోంది .
శివుడే వృక్షముగా నిలిస్తే, అది శివలింగ వృక్షము . శివలింగ పుష్పాల్ని నాగమల్లి పుష్పాలుగా,మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు.ఇవి అద్భుత సుగంధ పరిమళాలు వెదజల్లుతుంటాయి.వీటి శాస్త్రీయ నామము కౌరౌపిటా గియానెన్సిస్. ఆంగ్ల పరిభాషలో కేనన్ బాల్ ట్రీ అంటారు. ఇది దక్షిణ అమెరికాలోను, దక్షిణ భారతదేశంలోను కనిపిస్తుంది. వీటి ఆకృతిని గమనిస్తే, చెట్లు జటాజూటము విడిచిన శివుని రూపంలా అనిపిస్తాయి . చెట్టు కాండానికే పూలు విచ్చుకుంటాయి . ఆ పూల మధ్యలో శివలింగాకృతి ఉంటుంది . పూల కేసరాలు తన వేల పడగలు విప్పి , శివునికి సేవచేస్తున్న వాసుకిలా ఉంటాయి . అందుకే ఈ పూలని సహస్రఫణి పుష్పాలు అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. సాధారణంగా తెలుగునేలమీద శివాలయాల్లో ఇవి విశేషంగా దర్శనమిస్తుంటాయి .
అద్భుతమైన సుగంధాన్ని వెదజల్లుతూ ఉండే ఈ పూలతో శివుణ్ణి మాత్రమే కాక సర్వదేవతలనీ పూజించవచ్చు . సర్వదేవతలకీ ప్రీతికరమైన ఈ పుష్పాలతో అర్చనచేస్తే, వారి అనుగ్రహం శ్రీఘ్రంగా సిద్ధిస్తుంది. అయితే, వీటితో దేవతార్చన చేసేప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాల్సిన అవసరముంది . పరమేశ్వరునికి తక్క వేరే ఏ దేవునికైనా ఈ పుష్పం సమర్పించినప్పుడు, తప్పనిసరిగా ఆ దేవతల శిరస్సుపై లేదా భుజస్కందాలలో మాత్రమే ఈ పూవుని అలంకరించాలి. అంతేగానీ , సాధారణ పుష్పాలతో పూజించినట్టుగా , పాదాలదగ్గర వేయరాదు. పార్వతిమాతని పూజించడం మరింత విశేషం . అమ్మకి ఈ పూవులని మాంగల్యంలో అలంకరించాలి.
ఈ విధంగా శివుణ్ణి కానీ శక్తిని గానీ శివలింగ పుష్పాలతో ఆరాధించడం వలన అష్టైశ్వర్యాలూ కలుగుతాయని, అంత్యాన శివలోకం ప్రాప్తిస్తుందని శివపురాణం చెబుతోంది .
శుభం !!