వివాహాపంచమి కథ
సీతారాముల వివాహం కథే వివాహాపంచమి కథ!
లక్ష్మీ రమణ
మార్గశిరమాసంలో వచ్చే వివాహ పంచమి ముహూర్తంలోనే, సీతమ్మ చేయందుకొని శ్రీరాముడు పాణిగ్రహణం చేశారట . అంటే, ఇది వారి వివాహ వార్షికోత్సవం అన్నమాట. సీతారాముల కళ్యాణమా చూతము రారండీ , శ్రీసీతారాముల కళ్యాణమా చూతమురాండీ అని తన్మయంతో దేశమంతా ఒక్కటే, రాములోరి కళ్యాణానికి వైభవంగా తరలే రోజు శ్రీరామ నవమి. కానీ, నేపాల్ ప్రజలుగానీ, అటు ఉత్తర భారతదేశం ప్రజలుగానీ వివాహా పంచమికి రామ కళ్యాణం జరుపుకుంటారు. ఆరోజు వివాహ పంచమీ వ్రతాన్ని ఆచరిస్తారు . ఆ వ్రతకథ ఇది .
రామాయణములో ‘ సీతాయాశ్చరితం మహత్’ అని చెప్పబడింది. సీతమ్మ చరిత్రని మించిన మహత్తరమైన చరిత్ర మరొకటి లేనేలేదు. ఆ తల్లి మిధిలాపుర నాయకుడైన జనక మహారాజు కూతురు. కానీ ఆమె జన్మించింది, భూదేవి గర్భాన . అదెలాగంటే, జనకమహారాజు యాగము చేస్తూ, భూమిని నాగలితో దున్నుతున్నారు. ఆ సమయంలో నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించిన చిన్నారి పాపకి 'సీత' అని నామకరణము చేసి జనకమహారాజు, ఆయన భార్య అల్లారు ముద్దుగా పెంచుకొన్నారు.
సీత గర్భమున జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు. ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉన్న జనక్ పూర్ , అప్పటి మిధిలా నగరమని చెబుతారు. ఒకనాడు సీతమ్మ ఆడుకుంటూ ఆడుకుంటూ, అక్కడున్న శివధనస్సును అలాలీలగా ఎత్తి అవతల పెట్టి, ఆ ధనస్సుకిందికి వెళ్ళిపోయినా తన బంతిని తీసుకున్నదట. అటువంటి సీతమ్మకి , ఆ శివధనుసుని ఎక్కుపెట్టగల మొనగాడే తగిన వరుడిని జనకమహారాజు అనుకున్నారు. ఆమె స్వయంవరాన్ని ప్రకటించి, హాజరుకావాలనుకున్న రాకుమారులకి శివధనుస్సుని ఎక్కుపెట్టడం అనే పరీక్షలో విజయం పొందితేనే , ఆ సీతామణిని చేపట్టే భాగ్యం అని తెలియజేశారు .
ఇక మరో వైపు, రామ లక్ష్మణులు విశ్వామిత్రుని యాగ రక్షణా కార్యాన్ని జయప్రదంగా ముగించారు. తన శిష్యులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు మిధిలా నగరం వచ్చాడు. స్వయంవరంలో వేరెవ్వరూ ఎక్కుపెట్టలేకపోయిన ఆ ధనుస్సును శ్రీరాముడు అవలీలగా ఎక్కుపెట్టి, విరిచేశాడు.
రాముడు నారాయణుడైతే , సీతమ్మ ఆ లక్ష్మీమాత . చూపులు కలిశాయి. సిగ్గుల మొగ్గయిన సీతమ్మ, కళ్యాణ రాముని మెడలో వరమాల వేసింది . సీతారాముల వివాహం నిశ్చయమైనది. వారితోబాటే లక్ష్మణునకు ఊర్మిళతోను, భరతునకు మాండవితోను, శత్రుఘ్నునకు శృతకీర్తితోను వివాహం నిశ్చయమైనది. జనకుడు సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకొని వచ్చి "కౌసల్యానంద వర్ధనా! రామా! ఇదిగో నా కూతురు సీత. ఈమె నీకు సహధర్మచారిణి. ఈమెనంగీకరించి పాణి గ్రహణం చెయ్యి. పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడూ నీడలాగ అనుసరిస్తుంది" అని చెప్పాడు. సీతారాముల, వారి సహజన్ముల కళ్యాణం వైభవంగా, లోక కళ్యాణంగా జరిగింది.
సీత తన భర్తవెంట అయోధ్యకు వచ్చింది. వారి దాంపత్యం అన్యోన్యంగా సాగింది.
ఇదీ కథ. ఇలా ఒక్క వివాహం అనుకున్న వారు , రామయ్యతో పాటు తాన్ ముగ్గురు తమ్ముళ్లకీ , సీతమ్మ చెల్లెళ్ళతో చక్కగా వివాహాలు జరిగాయి. ఈ కథని చదువుకొని సీతారాములని వివాహ పంచమి నాడు అర్చిస్తే, పెళ్లికాని వారి సమస్యలు త్వరగా ఒక కొలిక్కి వచ్చి, త్వరగా వివాహం జరుగుతుందని నమ్మకం .
వివాహ పంచమి తేదీ 07 వ తేదీ డిసెంబర్ 2021 రాత్రి 11 గంటలకు ప్రారంభమయి.. 08 వ తేదీ డిసెంబర్ 2021 రాత్రి 09 గంటల 25 నిమిషాలకు ముగుస్తుంది.