దాంపత్య అనుకూలత కోసం వివాహ పంచమీ వ్రతం

వివాహం కోసం, దాంపత్య అనుకూలత కోసం వివాహ పంచమీ వ్రతం . (08-12-21)
లక్ష్మీ రమణ
రాములవారి కల్యాణాన్ని శ్రీరామనవమికి జరుపుకోవడం తెలుగువారి సంప్రదాయం. కానీ ఆ రామయ్య సీతమ్మని చేపట్టింది మార్గశిర మాసం శుక్ల పక్షంలోని పంచమి నాడట . నేపాల్ లోని జనక్ పూర్ వాసులు జానకమ్మ తమ ఆడపడుచే అంటారు. అక్కడ అద్భుతమైన వేడుకలుకూడా ఈ రోజున నిర్వహిస్తారు . అంతేకాదు , పెళ్లికాని వారు వివాహాపంచమి పూజని చేసుకుంటే వెంటనే వివాహం అవుతుందని విశ్వసిస్తారు. మరిన్ని విశేషాలతోపాటు , ఆ పూజావిధానం కూడా తెలుసుకుందాం
పదండి .
మార్గశిరమాసంలో వచ్చే ఈ దివ్యమైన ముహూర్తంలోనే, సీతమ్మ చేయందుకొని శ్రీరాముడు పాణిగ్రహణం చేశారట . అంటే, ఇది వారి వివాహ వార్షికోత్సవం అన్నమాట. తరగని ప్రేమకి, అనురాగానికి, తనువులువేరయినా, ఒకటే, మనసుగా బ్రతికిన ఆదర్శదాంపత్యానికీ ప్రతీకలు సీతారాములు . వారి వివాహమహోత్సవం జరిగిన రోజునఆ ఆదర్శ దంపతులని పూజిస్తే, దోషాలు తొలగిపోయి , వివాహం జరుగుతుందని విశ్వసిస్తారు .
మన దక్షిణాదిన తక్కువేగానీ ఉత్తరాదివారు ఈ సంప్రదాయాన్ని ఎక్కువగా పాటిస్తుంటారు . ఈ ఏడాది వివాహ పంచమి డిసెంబర్ 8 బుధవారం వచ్చింది. ఈ రోజున సీతా-రాముల ఆలయంలలో ఘనంగా వేడుకలు, పూజలు, యాగాలు నిర్వహిస్తారు. చాలా ప్రాంతాలలో శ్రీ రామచరితమానస్ పారాయణం చేస్తారు. మిథిలాంచల్ , నేపాల్‌లో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు.
వివాహ పంచమి ప్రాముఖ్యత:
వివాహ పంచమి రోజున, ప్రత్యేకించి పెళ్లికాని వారు , వివాహంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నవారు సీతారాములని అర్చించాలి . రోజంతా ఉపవాసాన్ని ఆచరించాలి. ఇలా చేస్తే వివాహానికి వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని పురాణాల కధనం. వివాహాన్ని కోరుకునేవారికి అనుకూలమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. పెళ్లయిన వారు ఈ వ్రతాన్ని ఆచిరిస్తే, వారి వైవాహిక జీవితంలోఉన్న సమస్యలు తొలగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి . వివాహ పంచమి రోజున ఇంట్లో రామచరితమానస్ పారాయణం చేస్తే, ఇంటిల్లిపాదికీ శాంతి , సౌఖ్యం చేకూరుతుందని విశ్వాసం .
ఇది శుభ సమయం
వివాహ పంచమి తేదీ 07 వ తేదీ డిసెంబర్ 2021 రాత్రి 11 గంటలకు ప్రారంభమయి.. 08 వ తేదీ డిసెంబర్ 2021 రాత్రి 09 గంటల 25 నిమిషాలకు ముగుస్తుంది.
పూజా విధానం
ముందుగా, స్నానమాచరించి, సీతారాములను స్మరణ చేసి ఉపవాస దీక్ష చేపట్టాలి. అనంతరం పూజా ప్రదేశంలో గంగాజలం చిలకరించి, ఎరుపు లేదా పసుపు బట్ట పరచి, సీతరాముల విగ్రహాలను ఉంచాలి . శ్రీరామునికి పసుపు వస్త్రాలు, సీతమాతకి ఎరుపు రంగు దుస్తులు ధరింపజేయాలి. ఆ తర్వాత, షోడశోపచారాలతో వారిని అర్చించాలి . శక్త్యానుసారంగా నైవేద్యాన్ని సమర్పించాలి . వివాహ పంచమి కథను చదువుకోవాలి. పూజానంతరం, సీతారాముల ప్రసాదాన్ని బంధుమిత్రులతో పంచుకోవాలి .
ఓం శ్రీ జానకీవల్లభాయై నమః అనే నామజపాన్ని చేయడం కూడా మంచి ఫలితాలని అందిస్తుంది.
శుభం .