చిత్రగుప్తుని నోము ఇలా చేసుకోవాలి .
చిత్రగుప్తుని నోము ఇలా చేసుకోవాలి .
- లక్ష్మి రమణ
మనుషులు తెల్లవారి లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు పాపాలు చేస్తుంటాడు. ఈ పాపాలు ఎవరూ చూడరు అనుకుంటారు, కానీ ఇదంతా భ్రమ. మనలోనే ఓ ప్రాణి దాగి ఉంది. ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ. మనం చేసే ప్రతి పాపపు పనికీ లెక్క కట్టి, చిట్టా తయారు చేస్తుంది. ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణం చెబుతుంది.దీపావళి రెండో రోజు యమద్వితీయ ఉంటుంది. ఆరోజు చిత్రగుప్తుడి పుట్టిన రోజు నిర్వహించే ఆచారం ఉంది. దీన్నే ‘భాయ్ దూజ్’ అంటారు ఉత్తరాదివారు . చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం. రాముడు సైతం చిత్రగుప్తుడిని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే రాముడు రాజ్యమేలిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది.స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్టు ప్రతీతి. దీన్ని ధర్మ హరి చిత్రగుప్త దేవాలయం అంటారు. ఆయనకీ ఉద్దేశించిన చిత్రగుప్తుని నోము ఖచ్చితంగా ప్రతిఒక్కరూ చేసి తీరాలని చెబుతారు. ఆ నోముకి సంబంధించిన విధి విధానాలు, కథ చదువుకుందాం రండి .
చిత్రగుప్తుని నోము కధ:
పూర్వము ఒకానొక రాజ్యంలో రాజు భార్య, మంత్రి భార్య ఎంతో అన్యోన్యంగా వుండేవారు. ఇద్దరూ కలిసి నోములు నోచుకుంటూ వుండేవారు. రాజు భార్య మాత్రం చిత్రగుప్తుని నోము మరచి పోయింది. మంత్రి భార్య నోము నోచుకున్నది. కాల క్రమంలో వారిద్దరూ చనిపోయారు. చిత్ర గుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని, రాజు భార్యకు నరకాన్ని కలుగ చేశాడు. రాజు భార్య’ నేను కూడా మంత్రి భార్య లాగానే అనేక నోములు నోచాను. కానీ ఆమెకి స్వర్గం నాకు నరకం ఎందుకు కలిగాయి ‘ అని చిత్రగుప్తుణ్ణి ప్రశ్నించింది . అందుకు చిత్ర గుప్తుడు సమాధాన మిస్తూ. ‘ ఓ తరుణీ మణీ ! నువ్వు చిత్ర గుప్తుని నోమును మరచిపోయావు. అన్ని నోములూ నోచినా స్థిరమైన చిత్తాన్ని అనుగ్రహించే ఆ నోమును మరచిన ఫలితమే నీకీ నరకము’ అని చెప్పారు .
అప్పుడా రాజు భార్య ‘స్వామీ! నన్ను అనుగ్రహించి భూలోకమునకు పంపించు . నేనూ చిత్ర గుప్తుని నోమును నోచుకోని వస్తాను’ . అని ప్రార్ధించింది అప్పుడు చిత్ర గుప్తుడు సరేనని, ఆమెను భూలోకమునకు పంపించారు . భూలోకమునకు వచ్చిన మహారాణి భక్తి శ్రద్దలతో ఆ నోమును నోచుకుని, తిరిగి చిత్ర గుప్తుని వద్దకు చేరుకుంది . అప్పుడు చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గ లోక ప్రాప్తిని అనుగ్రహించారు. .
చిత్రగుప్త నోము ఎవరు చేసుకోవచ్చు :
ఈ వ్రతము స్త్రీలు, పురుషులు లేక ఇద్దరూ చేసుకోవచ్చు. కానీ నోములు స్త్రీల కోసం విశేషముగా చెప్పబడ్డాయి . ఈవ్రతము చేసుకోవడం వలన సమస్త పాపములు తొలగి, సమస్త సంపదలు లభింస్థాయి.
ఏమేంకావాలి ?
వేదాలలో కూడా చిత్రగుప్తుడి గూర్చి ఉంది. ఉత్తర భారతీయులు చేసే చిత్రగుప్తుడి పూజలో పెన్ను, పేపరు, ఇంక్, తేనె, వక్క పొడి, అగ్గిపెట్టె, చెక్కెర, గంధం చెక్క, ఆవాలు, నువ్వులు, తమలపాకులు ఉంటాయి. దక్షిణ భారతీయులు చేసే చిత్రగుప్తుడి పూజలో ఎద్దు తొక్కని వడ్లు, ఎర్ర గుమ్మడి పండు, కట్లు లేని గంప మొదలైన విశేష ద్రవ్యాలు ఉంటాయి. న్యాయం, శాంతి, అక్షరరాస్యత, విజ్ఞానం ఈ నాలుగు గుణాలు పొందడానికి చిత్ర గుప్తుని ఆరాధన విశేషంగా చెప్పబడింది. వాటిని ప్రతిబింబించే ద్రవ్యాలే ఆయన పూజా సామాగ్రిలోనూ ఉంటాయి.
నోముని ఇలా మొదలుపెట్టాలి :
మెదటి సారి మాఘ సప్తమినాడు లేదా మహా శివరాత్రి నాడు నోము పట్టుకోవాలి.
ప్రతి సంక్రమణమనాడు నోముని చేసుకోవాలి .
చివరికి మకరసంక్రమణము నాడు ఉద్యాపన చేసుకోవాలి.
మొదటి నెలలో కానీ, మధ్యలో కానీ చివరన కానీ ఎవరి వీలును బట్టి వారు ఉద్యాపన చేసుకొనవచ్చు.
బంగారు ప్రతిమలు, సువర్ణాలంకృతమైన గోదానం, వస్త్రదానాదులు, దశదానాలు, షోడశ మహాదానాలు, 30 మంది బ్రాహ్మణులకు భొజనం పెట్టుకోగలవారు ఆవిధంగా చేసుకోవచ్చు .
ఆర్థిక స్థోమత లేనివారు పరమేశ్వరునికి తమ స్థితి తెలుపుకుని పురోహితుల సూచన మేరకు నడుచుకొనవలెను.
గృహస్థుడైన బ్రాహ్మణునకు వీటిని దానంగా ఇవ్వాలి .
ఈ నోములోని ఆంతర్యం ఇదీ :
గుప్తంగా మనలోనే ఉంటూ చిత్రంగా మన పాపపుణ్యాలను లిఖించేది అంటే , అది మన మనస్సు. మన మనసే చిత్రగుప్తుడు. ఎన్ని వ్రతములు చేసినా చిత్రగుప్త వ్రతమును తప్పక చేయాలి అని చెబుతారు. అలా చేయకపోతే పుణ్యఫలం లభించదని అంటారు . దీని అర్థం ఏంటంటే, ఎన్ని పుణ్యకర్మలను చేసినప్పటికీ మనోనియమము లోపించడం . మనోనియమము లేకపోవడం చేత అవి అవన్నీ కూడా వృధా అయినట్టే కదా . కనుక చిత్రగుప్తుని వ్రతమును చేయడం వలన మనోనిశ్చలత చేకూరి సర్వకర్మలను పరిపూర్ణము చేసే శక్తి కలుగుతుందని పెద్దల మాట. చిత్రగుప్తుని ఆరాధనలో మరో విశేషం ఉంది . ఆయన్ని ఆరాధించిన వారికి కర్మానుసారంగా వచ్చేటటువంటి ఈతి బాధల నుండీ ఉపశమనం లభిస్తుంది .
నిత్యం స్మరించుకోవలసిన దైవం చిత్రగుప్తుడు :
ప్రతిరోజూ అన్నం తినే ముందర “చిత్రాయనమః, చిత్రగుప్తాయనమః, యమాయ నమః” అంటూ మూడు బలులను సమర్పించాలి . కొద్దిగా అన్నాన్ని అలా చెబుతూ ఒక పక్కన ఉంచాలి . దీని వలన చిత్రగుప్తుడు,యముడు ప్రీతి చెందుతారు. ఉపనయనమైన వారు ఔపోసనము చేసినప్పుడు, ఈవిధముగా విస్తరాకు ప్రక్కన మూడుసార్లు అన్నమును వదులుతూ ఉంటారు . ఎల్లరకూ చిత్రగుప్తుని అ శ్శీస్సులు లభించాలని వేడుకుంటూ శలవు .
#chitragupta #nomu #vratam #yama
Tags: chitragupta, nomu, Vratam, vratham, yama,