ఉండ్రాళ్ళతద్ది చేసుకోలేదంటే , ముసలి మొగుడొస్తాడు జాగ్రత్త
ఉండ్రాళ్ళతద్ది చేసుకోలేదంటే , ముసలి మొగుడొస్తాడు జాగ్రత్త!!
ఉండ్రాళ్ళతద్ది రోజున గోంగూర అన్నం తిని , ఉయ్యాల ఊగాక పోయావంటే , ముసలి మొగుడొస్తాడు జాగ్రత్త ! అని ఇంట్లో కన్నెపిల్లల్ని వేళాకోళం చేస్తుంటారు పెద్దవాళ్ళు .. దీనికి ముందరి రోజైన భాద్రపద బహుళ విదియను భోగిగా పిలుస్తారు . ఈ నోముకు ‘‘మోదక తృతీయ’’ అని కూడా పేరుంది.ఇది స్త్రీల పండుగ . ప్రత్యేకించి కన్నెలు, పెళ్ళికాని పడుచుల పండుగ . చిన్నపిల్లలు , బాలురు కూడా ఈ పండుగలో పాలుపంచుకుంటూ ఉంటారు .
భోగి :
భోగినాడు ఇంట్లోని ఆడపిల్లలందరూ చక్కగా తలంటి స్నానం చేస్తారు . దీంతో భోగి పీడా వదిలిపోతుంది అని చెబుతారు . ఆ తర్వాత చక్కగా గోరింటాకు రుబ్బి , కాళ్ళకీ, చేతులకి పెట్టుకుంటారు . ముత్తయిదువులు అరికాలిలో చక్కగా గోరింటాకుతో చందమామని దిద్దుకుంటారు . ఆ చందమామ యెంత ఎర్రగా పండితే, అంతగా తరగని ఐదవతనం ఆ స్త్రీ సొంతమని అర్థమట .
ఉండ్రాళ్ళ తద్ది :
ఇక తదియరోజున ఉదయాన్నే లేచి, స్నానం చేసి , గొంగూరపచ్చడి , నువ్వు పొడి , ఉల్లిపాయ పులుసు , పెరుగు చేసి , తాంబూలం వేసుకుంటారు . ఆ తర్వాత పిల్లంతా ఉయ్యాల ఊగుతారు . ఉయ్యాలల సందడి ఊర్లల్లో అయితే భలే సరదాగా ఉంటుంది . యేటి గట్టున చెట్టుకి కట్టిన ఉయ్యాల, దానిపై ఊగేందుకు పోటీపడే కన్నెపిల్లలు కేరింతలు . చిన్నారి చేతుల్లో ఒదిగిపోయిన యెర్రని సూరీడు , నెలవంకలు . సందడి సందడిగా సరికొత్త పండుగవాతావరణం నెలకొని ఉంటుంది .
శ్రుతివచనం :
శివుణ్ణి పతిగా పొందదలచిన పార్వతీ మాట , ఆయన కోసం ఘోరమైన తపస్సు నాచరించింది . ఆ తపస్సుకి మెచ్చి గౌరమ్మని తన సతిగా అనుగ్రహించిన రోజు ఇదేనని చెబుతుంది ధర్మసింధువు . అప్పుడు గౌరమ్మని పరీక్షించదలచిన శివుడి ముసలివాడుగా వచ్చి , అదేరూపంలో మనువాడబోయినందుకు నిదర్శనంగానే ఇప్పటికీ ఈ తదియనాడు, ఆడపిల్లల్ని ముసలోడు మనువాడొస్తాడు జాగ్రత్త ! అని బెదిరించి పూజాది కార్యక్రమాలు చేయిస్తుంటారు ఇంట్లోని పెద్దవాళ్ళు .
పూజా విధి :
ఉండ్రాళ్ళ తద్ది కి గౌరీ పూజ చేస్తారు . గౌరమ్మకి ఉండ్రాళ్ళే ప్రధాన నైవేద్యం . కొందరు పూర్ణాలు కూడా చేస్తారు .సంప్రదాయానుసారం వివాహానంతరం ఐదేళ్లపాటు పట్టుకునే నోముగా ఉండ్రాళ్ళతద్ది ని చెబుతారు .
విధానం :
వివాహము అయిన సంవత్సరము వచ్చే ఉండ్రాళ్ళతద్ది రోజున ఈ నోము ఆరంభించాలి. ముందు రోజు గోరింటాకు పెట్టుకోవాలి . ఉదయమే 4 గంటలకు, లేచి గోంగూర పచ్చడితో భోజనము చేయాలి . తెల్లవారినాక స్నానము చేసి 3 ఇళ్ళలో ఉయ్యాల ఊగాలి.
గౌరిపూజ చేసి ఉండ్రాళ్ళతద్దె కథ చదవాలి. అక్షింతలు చేతితో పట్టుకుని, కథ పూర్తి అయినాక పూజాక్షతలు తలపై ధరించాలి . నోము పట్టినట్లు టెంకాయకొట్టి, పొంగలి నైవేద్యము పెట్టాలి .
ఒక పళ్ళెములో 5 పూర్ణములు లేక 5 పచ్చి ఉండ్రాళ్ళు, పండు, తాంబూలము, 5 పోగులతో ఐదు ముళ్ళతో పూజించిన తోరము, దక్షిణ ఇలా 2 ప్లేట్లులో సర్దాలి. ఒకటి గౌరమ్మకు నైవేద్యము. తోరము చేతికి చుట్టుకుని ఎవరైన ముత్తైదువకు , రెండవ పళ్ళాన్ని వాయనముగా ఇవ్వాలి . వాయనము ఇచ్చినాక తోరము చేతికి చుట్టి నమస్కారము చేసి అక్షింతలు వేయించుకోవాలి. ఇక వాయినానంతరం భోజనం చేయకూడదు .
కథ : పూర్వము ఒక రాజు ఏడుగురు భార్యలు ఉండేవారు . అయినా ఆయనికి వేశ్యయైన ‘చిత్రాంగి’పై మక్కువ ఎక్కువగా ఉండేది. భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి భార్యలందరూ ‘ఉండ్రాళ్ళ తద్ది’ అనే నోమును నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా చిత్రాంగి తెలుసుకుంటుంది . రాజుగారితో ‘‘నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ‘ఉండ్రాళ్ళ తద్ది’ నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నేనూ నీ భార్యలతో సమానం కాదా ? నీ భార్యలమీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ళ తద్దెనోము జరుపుకోవటానికి అవసరమైన సరకులను సమకూర్చమని’’ కోరుతుంది . రాజు అట్లేయని సరుకులను పంపిస్తాడు.
దాంతో , చిత్రాంగి భాద్రపద తృతీయనాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానమాచరించి, సూర్యాస్తమయము వరకు ఏమీ భుజించక ఉపవాస దీక్ష ఉండి, చీకటి పడగానే గౌరిదేవికి బియ్యం పిండితో ఉండ్రాళ్ళను చేసి, ఐదు ఉండ్రాళ్ళను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి, మరో అయిదు ఉండ్రాళ్ళను ఒక పుణ్యస్ర్తికి వాయనమిచ్చి, నోము ఆచరించి గౌరిదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా ఐదేళ్ళు నిర్విఘ్నంగా నోమునోచుకుని, ఉద్యాపన తీర్చుకుంటుంది. ఆ నోము ఫలంగా ఆమె తన పాపముల నుండీ ముక్తిని పొందినదై సద్గతిని పొందింది.
ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును ముఖ్యంగా పెళ్ళికాని కన్యలు ఆచరించడంవలన విశేషమైన ఫలితాలను పొందుతారని, మంచి భర్త లభిస్తాడని పురాణోక్తి. మరి ఈ సారి ఉండ్రాళ్ళ తద్దిని జరుపుకోవడం మర్చిపోకండేం !
- లక్ష్మి రమణ