శ్రీ సాయి నవ గురువార వ్రతం
శ్రీ సాయి నవ గురువార వ్రతం .
సేకరణ
శ్రీ సద్గురు సచ్చిదానంద షిరిడీ సాయి మహారాజ్ కీ జై అని నిత్యమూ సమరించే భక్తులకి తెలుగు నేలమీద కొదువలేదు. ప్రతి గురువారం క్రమం తప్పకుండా సాయిబాబాని సద్గురువుగా ఆరాధించుకుంటాం. ‘ నా సమాధి నుండే నేను మాట్లాడతాను’ అని ఆ సాయి చెప్పిన మాటని నేటికీ అక్షరాలా పాటిస్తున్నారు . నమ్మినవారికి కొంగు బంగారమై సన్మార్గంలో వారిని, వారి జీవితాలనీ నడిపిస్తున్నారు . ఆపదన్నది దరిచేరకుండా తానో రక్షణ కవచమై కాపాడుతున్నారు . ఇది నమ్మకం కాదు, ఎందరెందరో భక్తుల స్వీయ అనుభవం . ఆ సాయికి తొమ్మిది గురువారాలు వ్రతం ఆచరిస్తే, శుభం కలుగుతుందని విశ్వాసం . ఆ విధానాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
బాబా చరిత్ర అనన్య సామాన్యం . గొప్ప గురువుకి మాత్రమే సాధ్యమయ్యే అనుగ్రహం ఆయన చరిత్ర . నేటికీ బాబాను దర్శించాటానికి లక్షలాదిగా భక్తులు షిర్డీకి వెళ్తుంటారు. వారి కోరికలూ తీరుతుంటాయి. ప్రత్యక్షంగా బాబా సన్నిధికి వెళ్ళి తమ కోరికలు తెలుపుకోవడానికి ఆశక్తులైనవారు - శ్రీసాయిని శ్రద్ధాభక్తులతో స్మరించి నవగురువార వ్రతం ఆచరించి, తమ దుఃఖాలు పోగొట్టమని కోరికలు తీర్చమని ప్రార్థించి సఫలీకృతులవుతారు. బాబా తన భక్తులబాధలను దూరం చేసి, మనశ్శాంతి ప్రసాదిస్తారు. మీ కష్టాల విముక్తికీ షిర్డీసాయిబాబా నవగురువార వ్రతం ఆచరించి సుఖశాంతులు పొందవచ్చును.
శ్రీసాయి నవగురువార వ్రత కథ:
పూణా పట్టణంలో రుక్మిణి, విఠల్ అనే దంపతులు నివశించేవారు. విఠల్ కోపిష్టి, అందువలన అతనితో పరిచయమున్నవారు ఇబ్బంది పడేవారు, రుక్మిణి చాలా నెమ్మదస్తురాలు. శ్రీసాయిబాబాను నమ్ముకొని ఉన్నది. కొంత కాలానికి విఠల్ వస్త్రవ్యాపారంలో నష్టం వచ్చి, వ్యాపారం మూతపడే స్థితి వచ్చింది. దీనితో విఠల్ కు కోపం ఇంకా పెరిగి, ప్రతిదానికి రుక్మిణిని విసుక్కోవడం చేసేవాడు. ఇళ్ళు నరకంలా మారింది. ఒక గురువారం మధ్యాహ్నం హారతి సమయంలో రుక్మిణి ఇంటికి ఒక ఫకీరు వచ్చి, భిక్ష కోసం యాచించాడు. రుక్మిణి అతనికి భిక్ష అందజేస్తూ ఫకీరు ముఖంలో ప్రసన్నతను చూసింది. ఆ ఫకీరు శ్రీసాయి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడు ఉంటాయి. చింతించవలదు అని ఆశీర్వదించాడు. ఈ మాటాలు వినగానే రుక్మిణి కన్నీరు పెట్టుకుంది. ఆమె బాధను గ్రహించిన ఫకీరు అమ్మా నీవు తొమ్మిది గురువారాలు శ్రీసాయిని పూజించు. పూజా మహత్యం వల్ల నీ ఇంటి పరిస్థితులన్నీ చక్కబడతాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి గురువారం నుండి రుక్మిణి తొమ్మిది గురువారాల సాయివ్రతం ప్రారంభించింది.
అత్యంత భక్తిశ్రద్ధలతో తొమ్మిది గురువారాలు పూజ చేసి, చివరివారం ఉద్యాపన చేసి, తోమ్మిదిమందికి భోజనం పెట్టి, తొమ్మిది సాయివ్రత పుస్తకాలను బంధువులకు, స్నేహితులకు పంచి పెట్టింది. క్రమంగా విఠల్ స్నేహితుడి ధనసహాయం వల్ల అతనికి వ్యాపారం అభివృద్ధి చెందింది. వారి ఇంట సుఖసంతోషాలు తిరిగి వచ్చాయి.
వ్రతం ఆచరిస్తున్న సమయంలో రుక్మిణి ఇంటికి బొంబాయి నుండి తోడికోడలు, బావగారు వచ్చారు. తోటికోడలు రుక్మిణితో మాట్లాడుతూ తన పిల్లలు ఈ మధ్య చదువులో వెనుకబడ్డారని బాధపడింది. రుక్మిణి శ్రీసాయి నవగురువార వ్రతం ఆచరించమని చెప్పి వ్రతవిధానం మరియు ఉద్యాపన చెప్పింది.
కొన్నాళ్ళ తరువాత రుక్మిణితో తన తోడికోడలి నుండి శ్రీసాయి నవగురువారవ్రతం ఆచరించడం వలన పిల్లలు బాగా శ్రద్ధగా చదువుతున్నారని, ఈ విధానము తన స్నేహితురాలు కూడా ఆచరించడం వలన ఇష్టమైన వ్యక్తితో వివాహం జరిగిందని, తన ఎదురింట్లో ఒక నగ కనిపించకుండా పోయినందుకు ఈ వ్రతం ఆచరించగానే నగ మళ్ళీ తిరిగి దొరకినది అని, వ్రతమహత్యం చాలా గొప్పదనీ సమాచారం అందజేసింది.
ఈ విధంగా ఈ వ్రతం ఆచరించడం ఎప్పుడు ప్రారంభం అయ్యింది ? పుట్టుపూర్వోత్తరాలేమిటి అని ఆలోచించకుండా , నమ్మినవారిని అనుగ్రహిస్తున్నారు శ్రీ షిరిడీ సాయి . శుభం .
#shirdisaibaba
Tags: Shirdi Sai baba, Nava guruvara vratam