పుత్ర గణపతి వ్రతం.
పుత్ర సంతానం కోసం ఆచరించాల్సిన వ్రతం పుత్ర గణపతి వ్రతం.
- లక్ష్మి రమణ
ఫాల్గుణమాసంలో వచ్చే శుక్ల పక్షములో చవితి తిథి నాడు పుత్రగణపతి వ్రతాన్ని ఆచరిస్తే, పుత్ర సంతానం కలుగుతుందని వరాహపురాణం చెబుతోంది . వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి నుండీ ఆరునెలల కాలంలో తిరిగి ఈ ఫాల్గుణ శుద్ధ చవితి నాడు వినాయక నక్షత్ర సమూహం సూర్యాస్తమయం కాగానే ఉదయిస్తాయి . ఆ రోజు గణపతిని పూజించే వారికి పుత్ర సంతానం తప్పక కలుగుతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి . వినాయక చవితిలాగానే ఆచరించుకొనే ఈ పుత్రగణపతీ వ్రతాన్ని పూర్వకాలంలో సద్గుణసంపన్నుడు , వీరుడు అయిన పుత్ర సంతానం కోసం రాజులు ఆచరించేవారని శ్రుతులు తెలియజేస్తున్నాయి .
వినాయకునికి శిరస్సుని ఖండించి , ఆ తర్వాత పరమ వాత్సల్యంతో గజముఖాన్ని ఆ గణపయ్యకు అతికించిన శివయ్య , జగదాంబతో కూడి చిన్నారి గణపయ్యని ఒడిలో కూర్చోబెట్టుకొని దేవతలకి దర్శనం ఇచ్చారట . అలా దర్శనం ఇచ్చిన గణపయ్యని దేవతలందరూ స్తుతించారట . అప్పుడు గౌరమ్మ వారికి ఎవరైతే, ఫాల్గుణ శుద్ధ చవితి నాడు దేవతలు చేసిన ఆ పుత్రగణపతి స్తోత్రం చేస్తారో వారి వంశము వృద్ధినిపొందగలదని వరాన్ని అనుగ్రహించారట ! ఇది వరాహ పురాణంలోని వృత్తాంతము.
“ఫాల్గుణ శుద్ధ చవితి నాడు ఎవరైతే, పుత్రగణపతి స్తోత్రం చదువుకొని నువ్వులు, బెల్లము స్వామికి నివేదన చేసి, దానిని ప్రసాదముగా స్వీకరిస్తారో అటువంటి భక్తులకి నాకే విధముగా అయితే పుత్రశోకము తొలగి పుత్రవృద్ధి కలిగినదో అదేవిధముగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగునని జగదంబ పార్వతి వరాన్ని అనుగ్రహించారట” .
ఈ పుత్రగణపతి స్తోత్రంని పరమేశ్వరాదిగాగల దేవతలందరూ స్వయంగా స్తుతి చేశారు. అటువంటి ఆ దివ్య స్తోత్రాన్ని పారాయణము చేయడం వలన వంశ దోషములు తొలగి, శక్తి యుక్తలు కలిగిన పుత్రులు జన్మిస్తారని వరాహపురాణ వచనము. ఆ విధంగా మొదట ఈస్తోత్రముతో డుంఢి రాజు అనే కాశీరాజు పుత్రగణపతిని ఆరాధించి సత్ఫలితములను పొందారట . అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం దక్కుతుంది .
పుత్రగణపతి స్తోత్రం ఉంది. మీరు దాన్ని చక్కగా చదువుకోవచ్చు .
మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకితభావంతో ఉపవాస దీక్షా బద్ధులై ఈ స్తోత్రాన్ని చదువుకొని, గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతికాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని శృతి వచనం . ఈ ఫాల్గుణ చవితి నాడే కాకుండా, సంతానాన్ని కోరే వారు , పుత్రసంతానాన్ని కోరుకునే వారూ ప్రతి చతుర్ధికీ ఈ స్తోత్రాన్ని చదువుకొని గణపతిని ఆరాధించండి. భక్తితో ఈ వ్రతాన్ని ఆచరిస్తే, ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి . శుభం !!