కుజదోషాన్ని , కష్టాలనీ తొలగించే అంగారక సంకష్టహర చతుర్థి !

కుజదోషాన్ని , కష్టాలనీ తొలగించే అంగారక సంకష్టహర చతుర్థి !
- లక్ష్మీరమణ
సంకష్టహర చతుర్థికి గణపతిని పూజిస్తే, కష్టాలన్నీ తొలగిపోతాయి . ఆ సంకష్టహర చతుర్థి మంగళవారం నాడు వస్తే అది మరింత విశేషమైనది . ఆరోజుని అంగారక చతుర్థి అంటారు . ఆ నాడు గణపతిని సేవించుకోవడం , సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమానుసారంగా చేసుకోవడం వలన అనంత శుభ ఫలితాలు కలుగుతాయి . అంగారక చతుర్థి ప్రాధాన్యత ఎటువంటిది? ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఆ విశేషాలు తెలుసుకుందాం .
సంకష్టహర చతుర్థి సాధారణంగా మన పంచాంగాలలో సమయ నిర్ధారణ చేసి ఉంటాయి . ప్రతిమాసంలోనూ కృష్ణపక్షంలో అంటే, పౌర్ణమి తర్వాత 3, 4 రోజుల్లో చవితి వస్తుంది. సూర్యాస్తమయ సమయాన్ని ప్రదోషకాలం అంటారు . ఈ సమయంలో ఎప్పుడు చవితి తిధి ఉంటుందో ఆ రోజుని సంకష్టహర చతుర్థిగా పరిగణించి , ఆ రోజు ఈ వ్రతాన్ని పాటించాలి . రెండురోజుల పాటు వరుసగా ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు . ఒకవేళ అలా జరిగితే, తదియ ఉన్న చవితిని, సంకటహర చతుర్థిగా లెక్కించవలసి ఉంటుంది .
ఈ సంకష్టహర చతుర్థి గనుక మంగళవారం వస్తే, అది మరింత విశేషం . ఈ రోజుని అంగారక చతుర్థి అంటారు . ఈ రోజు గనుక, గణపతిని పూజిస్తే, జీవితంలో ఉన్న సంకటాలు తొలగిపోవడమే కాదు , జాతకంలో ఉన్న కుజదోషాలు కూడా పరిహారం అవుతాయని శాస్త్రం . కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థిని గణాధిప సంకష్టహర చవితి అని పిలుస్తారు .
మంగళవారం వచ్చిన సంకటహర చతుర్థి వెయ్యి సూర్య గ్రహణాల పుణ్య కాలానికి సమానం . ఈ అంగారక చతుర్థి కృష్ణపక్షంలో వస్తే, మరింత విశేషం. ఆ ప్రభావాన్ని వర్ణించడం వెయ్యి తలలున్న ఆదిశేషుడికి కూడా తరం కాదని శృతి వాక్యం . మాఘమాసం ,భాద్రపద మాసం , కార్తీకమాసాల్లో వచ్చే ఈ రకమైన అంగారక చతుర్థి విశేషమైన ఫలితాన్ని అందిస్తుంది . అంగారక చతుర్థి నాడు ఉపవాసం ఉండి, గణపతిని పూజిస్తే, కుజుడు ప్రసన్నుడవుతాడు . కుజుడు గణపతి కోసం చేసిన వెయ్యి సంవత్సరాల తపః ఫలితం ఈ రోజు గణపతిని పూజించినవారికి కుజుడు అనుగ్రహిస్తారట. అంత విశేషమైనది ఈ అంగారక చతుర్థి.
సాధారణంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించదలచినవారు, 3, 5, 11, లేదా 21 నెలలు ఆచరించవలసి ఉంటుంది . ఈ సంఖ్యలల్లో మీ ఓపికని బట్టి, అనుకూల్యతనిబట్టి ఎంచుకొని చక్కగా సంకటహర చతుర్థి వ్రతాన్ని నియమంగా ఆచరిస్తే, ఖచ్చితమైన ఫలితాలని ఆ గణపతి అనుగ్రహంతో పొందే అవకాశం ఉంటుంది. ఈ వ్రతాన్ని ఏదేని సంకట చతుర్థినాడు మొదలు పెట్టాలి . విధివిధానాలు ఎలా ఉంటాయో చూద్దాం .
చక్కగా తలంటి స్నానం చేయాలి . ఎరుపు/ తెలుపు రంగులో ఉన్న జాకెట్ బట్టని గానీ ఒక తుండును గానీ తీసుకొని పసుపు పెట్టి, చిటికెడు కుంకుమ వేసి , దాంట్లో మూడు దోసిళ్ళ బియ్యాన్ని లేదా ఒకటింపావు కిలోల బియ్యాన్ని పోయాలి . ఆ తర్వాత , రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు , తమలపాకులూ ఉంచి ఆ తాంబూలాన్ని దక్షిణ సహితంగా ఆ బట్టలో ఉంచి మూటగా కట్టి, గణపతి ముందర ఉంచి, మీ మనసులో ఏ కార్య సిద్ధికోసం ఈ పూజని సంకల్పించారో ఆ కార్యాన్ని గణపతికి విన్నవించండి . ఇప్పుడు యథాశక్తి గణపతిని పూజించండి. టెంకాయ , పళ్ళు స్వామికి నివేదించండి.
పూజ ముగించాక, గణపతి ఆలయానికి వెళ్లి ఆలయం చుట్టూ, 3, 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయండి . ఏ పూజకైనా మనసే కదా ప్రధానం ! టెంకాయలు , పూలూ, పళ్ళు ఇత్యాదుల లెక్కల కన్నా, మన చిత్తం స్థిరంగా ఆ గణపతిమీద నిలవడం ముఖ్యం. ఆ విధంగా పూజని ముగించి రోజంతా ఉపవాసం ఉండాలి .
ఉడికించిన పదార్థాలని గానీ, ఉప్పు తగిలించిన పదార్థాలని సూర్యాస్తమయం వరకూ తినకూడదు . పాలూ, పళ్ళు, పచ్చి కూరగాయలూ ఆహారంగా స్వీకరించవచ్చు. ఇదొక్కటే నియమం . సూర్యాస్తమయం తర్వాత, తిరిగి స్నానం చేసి , గణపతికి దీపారాధన చేసి, యధోశక్తి పూజించి, ఆ తర్వాత చంద్ర దర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని మామూలుగా భోజనం చేయవచ్చు . ఈ విధంగానే ముందుగా మీరు మీ కార్యసిద్ధి కోసం ఎన్ని వారలైతే వ్రతాన్ని ఆచరిస్తామని అనుకున్నారో , అన్ని వారాలూ వ్రతాన్ని చేయాలి .
ఇలా పూర్తిగా అన్నివారాల దీక్షా పూర్తయ్యాక, ముందుగా ముడుపుకట్టి గణపతి దగ్గర ఉంచిన బియ్యంతో పొంగలి చేసి , స్వామికి నివేదన చేసి , సాయంత్రం భుజించాలి . ఈ మొత్తం వ్రతాన్ని విధివిధాయకంగా ఆచరించడం మంచిది .
అలా చేయలేము అనుకునే వారు , ఉపవాసదీక్షని పాటించి , సంకటనాశన గణేశా స్తోత్రాన్ని చదివి , దగ్గరలోని గణేశ ఆలయాన్ని దర్శించినా సరిపోతుంది . ఉపవాసం కూడా ఉండలేని వారు పిల్లలు , వృద్ధులు, అనారోగ్యవంతులు అయితే చక్కగా నాలుగు సార్లు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం .
ఈ వ్రతాన్ని అంగారక చతుర్థినాడు తప్పక పాటించాలి . దీనివల్ల కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది . వివాహాలలో ఆటంకాలు, ఆలస్యం అయ్యేవారు, ప్రతి కార్యంలో విఘాలతో ఇబ్బందులు పడేవారు , జీవితంలో కష్టాలకి ఇక అంతేలేదా అని బాధపడేవారు ఈ రోజు నమ్మకంతో గణపతిని ఆరాధించండి .
ఓం గణాధిపాయ నమః ! శుభం భవతు !!