Online Puja Services

మారేడు దళాల నోము

18.119.162.226

సంతోష సౌభాగ్యాలని ప్రసాదించే ‘మారేడు దళాల నోము’ 
-లక్ష్మీ రమణ 

నోములు , వ్రతాలు రెండింటినీ మన సౌభాగ్యవతులు చేస్తూ ఉంటారు . వీటిల్లో పురాణాలలో ఉపదేశించిన వాటిని వ్రతాలని వ్యవహరిస్తారు . సంప్రదాయానుసారంగా వచ్చేవి నోములు . అంటే, మూలం పురాణంలో దొరకకపోయినా సంప్రదాయాను సారంగా వీటిని ఆచరిస్తారు . వీటిల్లో ఎక్కువ భాగం నోములకు మంత్రాలు కూడా ఉండవు . అటువంటిదే, సంతోష సౌభాగ్యాల కోసం మహిళలు నోచుకునే మారేడు దళాల నోము . 

కథ :

సతీ సహగమనం ఆచారంగా ఉన్న రోజులవి . రాజులు రాజ్యాలు ఉన్న కాలమది . ఒక రాజుగారు కొడుకు చనిపోయాడు . తన కొడుకుకి దహనసంస్కారాలు చేసేముందు ఆ రాజుగారు, ఆ శవానికి తోడుగా ఎవరినైనా తీసుకురమ్మని భటులని ఆజ్ఞాపించాడు .  శవానికి తోడుగా ఎవరు వెళతారు ? కానీ, ఒక బ్రాహ్మణ స్త్రీ తన సవతి కూతుర్ని డబ్బుకి ఆశపడి , ఆ రాజభటులకి అమ్మేసింది . రాజకుమారుడి శవానికి ఆమెనుకూడా కలిపి కట్టారు .  స్మశానానికి తీసుకెళ్లారు .  ఆ యువతి శోకం ఆకాశం విన్నదేమో మరి, కారు మబ్బులు కమ్మి , ఏ క్షణంలోనైనా కుంభవృష్టి కురిసే సూచనలు వాతావరణంలో కనిపిస్తున్నాయి . 

ఒకవైపు చితి పేరుస్తుండగానే, సన్నగా మొదలైన వాన , పెద్దదైపోయింది . దహన సంస్కారానికి వీలుకాని పరిస్థితి ఏర్పడింది . ఇక రాజభటులు చేయగలిగిందేమీ లేక , శవాన్ని, శవంతోపాటు , ఆ యువతిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు . ఆ గాఢాంధకారంలో ఆమెకి ఆ స్మశానంలో కాళీమాత దేవాలయం ఆశా దీపంలా కనిపించింది .  మెల్లగా ఆ దేవాలయానికి చేరుకుంది ఆ అమ్మాయి . అమ్మకి ప్రదక్షిణాలు చేసి , తన కష్టాన్ని చెప్పుకొని , రక్షించమని వేడుకుంది .  దయ గల తల్లి కదా కాళిక, వెంటనే ప్రత్యక్షమయ్యి, ఆమెకి కొన్ని మంత్రాక్షితలు ప్రసాదించింది. ‘వీటిని ఆ యువరాజు శవం మీద జల్లు ఆతను బ్రతుకుతాడు. నీకు మరణం తప్పుతుంది .  నీ సమస్య తీరిపోతుంది’ అని  అభయమిచ్చింది . క్షేమంగా ఇంటికి చేరాక , మారేడుదళాల నోము నోచుకోమని వ్రతవిధానాన్ని ఉపదేశించింది . 

ఆ యువతి సంతోషంతో ఆ అక్షింతలని యువరాజు విగత శరీరంపైన జల్లింది .   దాంతో అతను నిద్రనుండి మేల్కొన్నట్టుగా లేచి కూర్చున్నాడు. జరిగినదంతా తెలుసుకుని ,కాళీ మాతకి నమస్కరించాడు .  ఆ యువతిని పెళ్లాడాడు .   

కాళీ మాత చెప్పినట్టు ఆ తర్వాత ఆ యువతి చక్కగా మారేడు దళాల నోము శ్రద్ధాభక్తులతో  నోచుకోని , సంతోష సౌభాగ్యాలతో వర్ధిల్లింది . ఆ నోము విధానం ఇక్కడ మీకోసం . 

విధానం :
ప్రతిరోజూ మూడు మారేడుదళాలు , దోసెడు బియ్యం తీసుకొని శివుణ్ణి పూజించాలి . ఇలా ఒక సంవత్సరం పాటు చేశాక ఉద్యాపన తీర్చుకోవాలి . 

ఉద్యాపన : 
ఒక బంగారు మారేడుదళాన్ని ఒక వెండి మారేడు దళాన్ని చేయించాలి . ఈ రెండింటితోపాటు, ఒక సాధారణ మారేడుదళాన్ని కూడా తీసుకొని మూడు దోసిళ్ళ బియ్యంతో శివుణ్ణి ఆరాధించాలి . ఆ తర్వాత పేదలకి అన్నదానం చేయాలి .

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi