పోయిన వస్తువులైనా, వ్యక్తులైనా, ఈ పూజని చేశారంటే
పోయిన వస్తువులైనా , వ్యక్తులైనా సరే, ఈ పూజని చేశారంటే, దొరుకుతారు !
లక్ష్మీ రమణ
విలువైన వస్తువులేవైనా కనిపించలేదంటే ఇక అంతే సంగతులు . మన ఆదుర్దా అంతా ఇంతా కాదు. అప్పుడు మనకి అనిపిస్తుంటుంది దేవుడా ! ఒక వెయ్య చేతులుంటే ఎంతబాగుండేది! త్వరగా వెతికగలిగేవారము అని! ఇంకొన్ని సార్లు, ఆ పౌడర్ డబ్బాకి , పట్టుచీరకీ కూడా మన ఫోన్ లాగా రింగయ్యే సౌకర్యం ఉంటె ఎంతబాగుంటుందీ ! అనుకుంటుంటాం . వస్తువులకే మనం ఇలా అనుకుంటున్నామంటే, ఇక , ఇంట్లోని పెద్దలో , బిడ్డలో తప్పిపోయినప్పుడు ఇక వారి క్షోభని గురించి యేమని చెప్పగలం ! వర్ణించనలవికాని బాధాకదా అది ! అటువంటి పరిస్థితుల్లో మనం చేయదగిన పూజ ఒకటుంది . దీనివల్ల పోయిన వస్తువయినా, వ్యక్తయినా తప్పకుండా దొరుకుతాయని మన ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నాయి . ఆ విశేషాలు ఇక్కడ మీకోసం .
నిజముగానే వేయి చేతులున్నవాడు, అపరిమితమైన పరాక్రమశాలి అయినా వీరుడు కార్తవీర్యార్జనుడు . రామునికన్నా ముందు రావణుని గెలిచినవాడు . ఆయన స్వయంగా విష్ణువు చేతిలోని సుదర్శన చక్రం యొక్క అవతార విశేషం . విషుమూర్తిని చేతిలో చక్రం లేకుండా మనమెవ్వరమూ ఊహించుకోలేము కదా! ఆయన చేతిలో గద, కమలం వంటివి ఉన్నా , విష్ణుమూర్తి ఆయుధాలు అనగానే ముందుగా మనకి గుర్తుకొచ్చేది చక్రాయుధం మాత్రమే !
అలా అనుకొనే , ఆ సుదర్శనచక్రానికి గర్వం వచ్చిందట ! ‘ నెంతటివాడిని గనుక లేకపోతె, ఈ విష్ణుమూర్తి రాక్షససంహారం ఎలా చేయగలిగేవాడో ‘ అనుకున్నాడట ! వెంటనే ఆ స్వామి సుదర్శనాన్ని భూలోకంలో అవతరించామని ఆదేశించారు . అప్పుడు సుదర్శనుడు ఆ స్వామీ చేతుల్లోనే తన మరణం సంభవించాలని మాట తీసుకొని, భూమిపైనా అవతరించాడు. అలాపుట్టిన సుదర్శనమే కార్తవీర్యార్జనుడు. వేయి చేతులున్నాయా అన్నట్టు గిరగిరా తిరుగుతూ రాక్షససంహారం చేసే ఆ చక్రం చేతులు లేకుండా పుట్టిన అవతారం . ఆ తర్వాత ఆయన చేసిన తీవ్రమైన దత్తఉపాసన చేత వేయి చేతులు తనకి కలిగేలా వరాన్ని పొందాడు . అంతేనా, పరుశురాముడిగా అవతరించిన ఆ నారాయాణుని చేతిలో మరణాన్ని పొందారు . కానీ ఈ రూపంలో ఉన్న సుదర్శనుడు ఉపాసన చేయడం వలన పోయిన వస్తువులు దొరుకుతాయి . తప్పిపోయిన మనుషులు, తిరిగి వస్తారు . కుటుంబంలో కలహాలుంటే, సమసిపోతాయి . మనశాంతి లభిస్తుంది . అటువంటి దివ్యమైన కార్తవీర్యార్జున ద్వాదశనామస్తోత్రం తెలుసుకుందాం .
కార్తవీర్యార్జున ద్వాదశనామస్తోత్రం :
ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ |
తస్యస్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే ||
కార్తవీర్యహః ఖలద్వేషీ కృతవీర్యసుతో బలీ|
సహస్రబాహు: శత్రుఘ్నో రక్తవాసా ధనుద్ధరః ||
రక్తగంధో రక్తమాల్యో రాజా స్మర్తురభీష్టదః |
ద్వాదశైతాని నామాని కార్తవీర్యస్య యః పఠేత్ ||
సంపదస్తత్ర జాయంతే జనస్తత్ర వశం గతః
ఆనయత్యాశు దూరస్థం క్షేమలాభయుతం ప్రియమ్ ||
సహస్రబాహుం మాహితం సశరం సచాపం
రక్తాంబరం వివిధ రక్తకిరీటభూషమ్ |
చోరాది దుష్టభయనాశనమిస్టదం తం
ధ్యాయేన్మహాబల విజృంభిత కార్తవీర్యమ్ ||
యస్య స్మరణ మాత్రేణ సర్వదుఃఖ క్షయో భవేత్
యన్నామాని మహావీర్యాశ్చార్జునః కృతవీర్యవాన్ ||
హైహయాధిపతే: స్తోత్రం సహస్రావృత్తికారితమ్ |
వాంచితార్థ ప్రదం నృణాం స్వరాజ్యం సుకృతం యది ||
ఇతి కార్తవీర్యార్జున ద్వాదశనామ స్తోత్రం |
కార్తవీర్యార్జన ద్వాదశనామాలూ ఇలా చదువుకోడం చాలా సులభంగా కూడా ఉంటుంది . చదువుకోవడానైకి అనువుగా విరామాలతో దీనిని మీకోసం ఇక్కడ పొందుపరిచాం . కాబట్టి చక్కగా దీనిని అనుష్టించి, జీవితంలో మనం పోగొట్టుకున్నవాటిని తిరిగి పొందవచ్చు . అంతేకాకుండా , సుఖ, సంతోషాలు పొందవచ్చు . కోరిన కోర్కెలు తీర్చేటటువంటి అద్భుతమైన ఉపాసన ఇది . ఉపాసన ఏదైనా, నమ్మకం, శ్రద్ధ, భక్తి అనేవి ముఖ్యమైన అంశాలనేవి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీలయితే, తప్పకుండా ప్రయత్నించండి . శుభం .