ఋణహర గణేశ స్తోత్రం
అప్పుల బాధలతో విసిగిపోయారా ? ఇలా చేశారంటే సరి !
అప్పుల బాధలు ఆ ఏడుకొండలవాడికి కూడా తప్పలేదు . పద్మావతమ్మని పెళ్లిచేసున్నందుకు కలియుగాంతంవరకూ కుబేరుడికి వడ్డీ కట్టాల్సి వచ్చింది . కారణాలేవైనా, అప్పులబాధ తనదాకా వస్తే కానీ అర్థంకాని తలనొప్పిలాంటిదే . బిడ్డలు బాధతో అల్లాడిపోతుంటే , చూసి తట్టుకోలేని హృదయం తల్లికి కాక మరింకెవరికి ఉంటుంది చెప్పండి . అందుకే ఆ అమ్మలగన్న అమ్మే ఈ సమస్యకి పరిష్కారం చూపమని పరమేశ్వరుణ్ణి వేడుకుంది .
నీలకాంతితో విలసిల్లే ఆ కైలాసవాసుడు లోకకళ్యాణార్థం ఆ పరిష్కారాన్ని వివరించారు . మన గణనాయకుడైన గణేశుడు విఘ్నాల నుండే కాదు, ఋణాలనుండీ కూడా విముక్తిని ప్రసాదించగల సమర్ధుడు . కాబట్టి ఎవరైతే ఋణవిమోచనార్ధం విఘ్నేశ్వరుని పూజిస్తారో వారికి తప్పక ఆయా బాధల నుండీ విముక్తి కలుగుతుంది అని మార్గోపదేశం చేశారు.
ఋణవిమోచనకోసం ప్రార్ధించవలసిన స్వామీ యొక్క రూపాన్ని ఇలా వర్ణించారు .
సింధూర వర్ణముతో, రెండు భుజములతో, పెద్ద పొట్టతో, కమలంలో కూర్చుని ఉంటారట ఈ గణపతి . ఇలా దర్శనమిచ్చే స్వామిని బ్రహ్మాది దేవతలు, సిద్ధులు పరిపరివిధముల సేవిస్తూంటారని,శ్రీకృష్ణయామళ తంత్రంలోని ఉమా- మహేశ్వరుల సంభాషణ ద్వారా తెలుస్తుంది . ఇందులో చెప్పబడిన ఋణహర గణేశ స్తోత్రం మీసౌలభ్యం కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాం .
అస్య శ్రీ ఋణహర్తృ గణపతి స్తోత్ర మంత్రస్య | సదాశివ ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీ ఋణహర్తృ గణపతి దేవతా | గౌం బీజం | గం శక్తిః | గోం కీలకం | సకల ఋణనాశనే వినియోగః |
శ్రీ గణేశ | ఋణం ఛింది | వరేణ్యం | హుం | నమః | ఫట్ |
ఇతి కర హృదయాది న్యాసః |
ధ్యానం
సిందూరవర్ణం ద్విభుజం గణేశం
లంబోదరం పద్మదళే నివిష్టం
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం
సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం ||
అర్థం: ఎరుపు వర్ణముతో, రెండు భుజములతో, పెద్ద పొట్టతో, కమలములో కూర్చుని, బ్రహ్మాది దేవతలచేత, సిద్ధుల చేత పరిపరివిధముల సేవింపబడుతున్నగణేశుని నేను ధ్యానిస్తున్నాను .
స్తోత్రం –
సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౧ ||
అర్థం: సృష్టి చేయడానికి ముందుగా బ్రహ్మచే పూజించబడిన ఓ పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.
త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౨ ||
అర్థం: త్రిపురాసురుని వధించేముందు శంభుదేవునిచే పూజించబడిన ఓయి పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.
హిరణ్యకశ్యపాదీనాం వధార్థే విష్ణునార్చితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౩ ||
అర్థం: హిరణ్యకశ్యపులను వధించుట కోసం విష్ణువుచే పూజింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.
మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౪ ||
అర్థం: మహిషాసురుని వధికోసం దుర్గామాత చేత గణనాథ రూపమున పూజలందుకున్న పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.
తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౫ ||
అర్థం: తారకాసురుని వధించే ముందు కుమారస్వామిచేత గౌరవింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.
భాస్కరేణ గణేశోహి పూజితశ్చ విశుద్ధయే |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౬ ||
అర్థం: గణేశుడిగా సూర్యునిచేత పూజింపబడి, భాస్కరుని శుద్ధిచేసిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.
శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౭ ||
అర్థం: కాంతివృద్ధి కోసం చంద్రునిచే గణనాయకరూపములో పూజింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.
పాలనాయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౮ ||
అర్థం: తన తపస్సుని రక్షించుకోవడం కోసం విశ్వామిత్రునిచే పూజింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.
ఇదం ఋణహరం స్తోత్రం తీవ్రదారిద్ర్యనాశనం |
ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || ౯ ||
అర్థం: ఈ ఋణహర స్తోత్రము ఒక సంవత్సరము పాటు రోజూ ఒకసారి చదివితే తీవ్రమైన దరిద్రము కూడా నశించిపోతుంది.
దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్ |
పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః || ౧౦ ||
అర్థం: ఎంతటి దారుణమైన దరిద్రములైన తొలగిపోయి కుబేరునితో సమానమైన సంపదని కలుగ చేయగలదు. దీని తరువాత పదిహేను అక్షరములుగల మహామంత్రమును పఠించాలి.
శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్ |
ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః || ౧౧ ||
అర్థం: “శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్” అనే మంత్రమును మనస్ఫూర్తిగా పఠించాలి.
ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణమీరితం |
సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ || ౧౨ ||
అర్థం: ఇరవైయొక్క సార్లు ఈ మంత్రమును పఠించాలి . వేయి సార్లు ఆరు నెలలు పఠించినచో ఇష్టమైనవి లభిస్తాయి .
బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్ |
అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః || ౧౩ ||
అర్థం: పదివేల సార్లు పఠించినట్లయితే జ్ఞానములో బృహస్పతిగా , ధనములో కుబేరునిగా అనుగ్రహాన్ని పొందగలరు .
లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్ |
భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః || ౧౪ ||
అర్థం: లక్ష సార్లు పఠించినచో సరైన కోరికలకు ఫలితములు వచ్చును. భూతములు, ప్రేతములు, పిశాచములు మంత్ర స్మరణము చేసిన మాత్రాన నశించును.
ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రం సమాప్తం |
క్షీరారామ క్షేత్రంలో ఋణవిమోచన గణపతి సందర్శనం చేయవచ్చు .
--లక్ష్మీ రమణ