వాగ్దేవి కి వందనం

వాగ్దేవి కి వందనం
సర్వజీవులలో చైతన్య స్వరూపిణిగా ప్రవహించే శక్తి స్వరూపిణే సరస్వతీ.
వాక్, బుద్ధి, జ్ఞానాది ధీశక్తులకు అధిష్ఠాత్రి.
సృష్టిలోని సమస్త జీవులకు ఆ తల్లి వల్లనే ఉలుకూ, పలుకూ ఎరుక ఏర్పడుతున్నాయి.
మన బుద్ధి శక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి సరస్వతీదేవి.
అందుకే సూర్యుడు
సర్వ చైతన్య రూపాం తాం ఆద్యం విద్యాంచ
ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్
అని ప్రార్థించాడు.
ఏ విద్యను గ్రహించాలన్నా అమ్మ అనుగ్రహం తప్పదు.
వాక్యం యొక్క స్వరూపం నాలుగు విధాలుగా ఉంటుంది.
1. పరా
2. పశ్యంతీ
3. మధ్యమా
4. వైఖరీ
మనలో మాట పలకాలన్నా భావం స్ఫురింపచేసేదే “పరా”.
మాట పలికే ముందు ‘పర’ ద్వారా ప్రేరితమై భావాత్మకంగా గోచరించేదే ‘పశ్యంతీ’.
ఆ భావం మాటలుగా కూర్చుకున్న స్థితి ‘మాధ్యమా.’
ఆ మాటలు శబ్దరూపంలో పైకి వినబడేదే ‘వైఖరీ.
యోగశాస్త్ర పరంగా వీటి యొక్క ప్రయాణం గురించి చెప్పాలంటే, మూలాధారం నుండి నాభి, హృత్, కంఠ, నాలుకలు.
వీటన్నింటికీ మూలమైన నాదం కూడ సరస్వతీరూపమే
చత్వారి వాక్పరిమితా పదాని తానీ
విదుర్భ్రాహ్మాణా యే మనీషిణీః
గుహాత్రీణి నిహితా నేజ్గ్యంతి
తురీయం వాచో మనుష్యా వదంతి
భావప్రకటన కోసం చెట్లు ‘పరా’ వాక్కుని,
పక్షులు ‘పశ్యంతీ’ వాక్కును,
జంతువులు ‘మధ్యమా’ వాక్కును,
మనుషులు ‘వైఖరీ’ వాక్కును ఉపయోగిస్తున్నారు.
ఆ తల్లి శ్వేత పద్మవాసిని కనుక "శారదా"అని అన్నారు.
పోతనామాత్యుడు –
శారదనీరడెందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార పేనరజతాచలకాశ ఫణీశకుంద మం
దార సుధాపయోధిసిత తామర సామరవాహిని శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ
అని ప్రార్థించాడు
శ్రీ సరస్వతి స్తోత్రం
యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా,
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైః సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా||
ఓం వీణాపాణినే నమః
- రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి