Online Puja Services

నిత్య పూజా విధానం

3.23.103.216

నిత్య పూజా విధానం 


ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకుని, నమస్కరించుకుని, ఈ విధంగా ప్రార్ధించుకోవాలి.

ప్రార్థన:
 
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే || 
అయం ముహూర్తస్సుముహూర్తోస్తు || 

నమస్కరించుకుని ఆచమనం చేయాలి. 

ఎడమచేతితో ఉద్దరిణ పట్టుకుని, ముందుగా నీటి పాత్ర నుంచి నీటిని కుడి చేతిలో పోసుకొని, హస్తం ప్రక్షాళ్య అంటూ  ప్లేటులో వదిలి పెట్టాలి. మల్లి నీటి పాత్ర నుంచి మూడుసార్లు విడివిడిగా నీటిని కుడి చేతిలో వేసుకుంటూ కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా అంటూ నీటిని తాగాలి. తరువాత గోవిందాయ నమః అంటూ నీటిని ప్లేట్ లో వదిలి పెట్టాలి. 

తరువాత ఈ నామాలు చెప్పుకోవాలి 

గోవిందాయనమః, విష్ణవేనమః, మధు సూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయనమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయనమః, పద్మనాభాయనమః, దామోదరాయనమః, సంకర్షణాయనమః, వాసుదేవాయనమః, ప్రద్యుమ్నాయనమః, అనిరుద్దాయనమః, పురుషోత్త మాయనమః, అధోక్షజాయనమః, నారసింహాయనమః, అచ్యుతాయనమః, జనార్దనాయనమః, ఉపేంద్రాయనమః, హరయేనమః, శ్రీకృష్ణాయనమః.

తరువాత అక్షింతలు తీసుకొని ఈ క్రింది మంత్రం చెపుతూ వాసన చూసి ఎడమ వైపుగా వెనక్కి వేసుకోవాలి. 

ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూర్భువస్సువః దైవీ గాయత్రీ ఛందః. ప్రాణాయామే వినియోగః |

తరువాత బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు మూడు కలిపి ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేస్తూ ఈ క్రింది  మంత్రం చెప్పాలి 

ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః ఓం తపః ఓగ్ మ్  సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్. ఓ మాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్.

(తరువాత ముక్కు వదిలి వేయాలి )

అక్షింతలు చేతిలోకి తీసుకొని కింది సంకల్పం చెప్పుకోవాలి 

సంకల్పం:

ఓం || మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభేశోభనే ముహూర్తె అద్యబ్రహ్మణః ద్వితీయపరార్దే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే, అష్టావింశతి తమే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరత వర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య .... ప్రదేశే (శ్రీశైలానికి ఏ దిక్కులో వుంటే ఆ దిక్కు పేరు చెప్పు కోవాలి),

అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన  శ్రీ  ---- నామ సంవత్సరే, ---ఆయనే, --- ఋతౌ, ---- మాసే, --- పక్షే, ----  తిధౌ, --- వాసరే  , శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం , శుభతిధౌ, శ్రీమాన్  శ్రీమతః ... గోత్ర: ... నామధేయః, ... (పూజ చేసే వారు గోత్రం, కుటుంబ సభ్యుల పేర్లు  చెప్పాలి)  అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థయిర్య విజయ అభయ, ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ద్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనో వాంఛా ఫలసిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళా వాప్త్యర్థం, మహా గణాధిపతి (ఇంకా మీరు అనుకున్న దేవుళ్ళ పేర్లు ) పూజాం కరిష్యే. 

ఆ మంత్రం చెప్పిన తరువాత చేతిలో అక్షింతలు నీళ్లు పోసుకొని ప్లేటులో వదిలి పెట్టాలి )

తరువాత దీపారాధన ఈ క్రింది మంత్రం చెపుతూ చేయాలి 

ఓం ఉద్దీప్య స్వజాతవేదో పఘ్నం నిరృతిం మమ 
పశూగ్ శ్చ, మహ్యమావహ జీవనం చ దిశోదిశ || 

వెలిగించిన దీపానికి గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి, ఒక పుష్పం పెట్టి అక్షింతలు వేసి, దీపానికి నమస్కారం చేసుకోవాలి. 

తరువాత ఆచమనం చేసిన పాత్ర కాకుండా విడిగా ఇంకొక పాత్రలో నీళ్లు పెట్టుకోవాలి.  ఆ పాత్రకి గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి, ఆ కలశంలో పుష్పం, అక్షింతలు వేసి, ఆ కలశం మీద చేయి ఉంచి ఈ క్రింది మంత్రం చెప్పాలి. 

కలశస్యముఖేవిష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః 
మూలే తత్రస్థితో బ్రహ్మా, మధ్యే మాతృగణాస్మృతాః,
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా 
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః 
అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః || 
ఆయాంతు దేవపూజార్ధం దురితక్షయకారకాః 

ఈ శ్లోకం చదువుతూ పుష్పాన్ని  నీటిలో సవ్య పద్దతిలో తిప్పాలి) 
 
శ్లో || గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ 
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు || 

కలశోదకేన పూజాద్రవ్యాణి దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య 

కలశంలోని నీటిని పూజాద్రవ్యముల మీదా, దైవము మీదా, తమమీదా కొద్దిగా చిలకరించుకోవాలి. 

తరువాత పుష్పం, అక్షింతలు చేతితో పట్టుకొని, ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి 

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ 
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా || 

చేతిలో పట్టుకొన్న పుష్పాలు, అక్షింతలు స్వామి వారి వద్ద వేసుకొని నమస్కారం చేసుకోవాలి. 

తరువాత అక్షింతలు తీసుకొని విడివిడిగా మూడు సార్లు ఈ క్రింది మంత్రాన్ని చెపుతూ స్వామి వారి మీద వేయాలి 

శ్రీ మహా గణాధిపతయే నమః ( మిగిలిన దేవుళ్ళని కూడా చెప్పుకోవాలి)
ధ్యాయామి ధ్యానం సమర్పయామి || 

శ్రీ మహా గణాధిపతయే నమః ( మిగిలిన దేవుళ్ళని కూడా చెప్పుకోవాలి)
ఆవాహయామి ఆసనం సమర్పయామి ||

శ్రీ మహా గణాధిపతయే నమః ( మిగిలిన దేవుళ్ళని కూడా చెప్పుకోవాలి)
నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి || 

ఈ క్రింది మంత్రం చెపుతూ కలశంలో నీటిని ఉద్ధరిణతో  గణపతికి, మిగిలిన దేవుళ్ళకి  చూపించి ఆ నీటిని  పళ్ళెం లో వేయాలి. 

శ్రీ మహా గణాధిపతయే నమః ( మిగిలిన దేవుళ్ళని కూడా చెప్పుకోవాలి)
పాదయోః పాద్యం సమర్పయామి || 

శ్రీ మహా గణాధిపతయే నమః ( మిగిలిన దేవుళ్ళని కూడా చెప్పుకోవాలి)
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి || 

శ్రీ మహా గణాధిపతయే నమః ( మిగిలిన దేవుళ్ళని కూడా చెప్పుకోవాలి)
ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి|| 

కలశం లో వున్న పుష్పం తో నీటిని తీసుకొని ఈ క్రింది శ్లోకం చెప్పుకుంటూ చిన్నగా దేవుళ్ళ మీద చల్లాలి 

నదీనాం చైవ సర్వాసా మానీతం నిర్మలోదకం 
స్నానం స్వీకురు దేవేశ మయాదత్తం సురేశ్వర || 

శ్రీ మహా గణాధిపతయే నమః ( మిగిలిన దేవుళ్ళని కూడా చెప్పుకోవాలి)
శుద్ధోదక స్నానం సమర్పయామి 
స్నానానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి 

అని అంటూ కలశం లోని పుష్పం తో నీళ్లు ప్లేట్ లో వదిలి పెట్టాలి 

తరువాత పుష్పం, అక్షింతలు చేతిలో పట్టుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి 

వస్త్రయుగ్మం సదా శుభ్రం, మనోహర విధం శుభం 
దదామి దేవ దేవేశ, భక్త్యేదం ప్రతిగృహ్యతాం || 
 
వస్త్రయుగ్మం సమర్పయామి || 

చేతిలో వున్న పుష్పం, అక్షింతలు స్వామి వారి మీద వేయాలి. 

తరువాత పుష్పం, అక్షింతలు చేతిలో పట్టుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి 

రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకమ్ 
గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక 
 
యజ్నోపవీతం సమర్పయామి ||

చేతిలో వున్న పుష్పం, అక్షింతలు స్వామి వారి మీద వేయాలి. 

ఒక పుష్పాన్ని గంధంలో అద్ది చేతిలో పట్టుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి 

చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం 
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ 
 
గంధం సమర్పయామి ||

చేతిలో వున్న గంధం తో కూడిన పుష్పాన్ని స్వామి వారి వద్ద పెట్టాలి 

తరువాత అక్షింతలు చేతిలో పట్టుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి 

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ 
శుభాన్ గృహాణ పరమానంద సర్వదేవ నమోస్తుతే 
 
అక్షతాన్ సమర్పయామి ||

చేతిలో వున్న అక్షింతలు స్వామి వారి మీద వేయాలి. 

తరువాత దేవుళ్ళ మీద అక్షింతలు వేస్తూ ఈ నామాలు చెప్పుకోవాలి 

ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణకాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ధూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః

అగరువత్తి వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపిస్తూ ఈ మంత్రాన్ని చెప్పాలి 

దశాంగం గుగ్గులో పేతం సుగన్దిం సుమనోహరమ్
ధూపం గృహాణ దేవేశ సర్వ దేవ నమస్కృత || 

దీపానికి నమస్కారం చేసుకొని రెండు చేతులతో దేవుళ్ళకి చూపిస్తూ క్రింది మంత్రాన్ని చెప్పాలి. 

ఘృతాక్తవర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం 
దీపం గృహాణ దేవేశ, త్రైలోక్య తిమిరాపహం || 

మీరు తయారు చేసుకున్న నైవేద్యాలన్నీ స్వామివారి ముందు పెట్టి నివేదన చేయాలి. 

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ 
సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి…   

అని పై మంత్రం కలశం లో వున్న పుష్పం తో నైవేద్యం చుట్టూ నీళ్లు జల్లాలి. ఆ తరువాత పుష్పాన్ని చేతితో పట్టుకొని 5 మార్లు క్రింది మంత్రాన్ని చెపుతూ స్వామి వారికి చూపించాలి. 

ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, 
ఓం సమానాయ స్వాహా, నైవేద్యం  సమర్పయామి, 

తరువాత పుష్పం తో కలశంలో నీళ్లు క్రింది మంత్రం చెపుతూ ప్లేటులో వదిలి పెట్టాలి. 

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి 
హస్తో ప్రక్షాళయామి  
పాదౌ ప్రక్షాళయామి,
శుద్ధ ఆచమనీయం  సమర్పయామి. 

తరువాత పుష్పం, అక్షింతలు చేతిలో పట్టుకొని ఈ క్రింది మంత్రాన్ని చెప్పుకోవాలి. 

పూగీఫలై  స్సకర్పూరై  నాగవల్లీ దళైర్యుతమ్, 
ముక్తాచూర్ణ సమాయుక్తం  తాంబూలం ప్రతిగృహ్యతామ్ || 
 
తాంబూలం సమర్పయామి |

పై మంత్రం చెప్పిన తరువాత చేతిలో వున్న పుష్పం, అక్షింతలు దేవుళ్ళ వద్ద వేయాలి. 


హారతి వెలిగించి ఈ మంత్రాన్ని చెపుతూ స్వామి వారికి చూపించాలి. 

నీరాజనం గృహాణేదం పంచవర్తి సమన్వితం 
తేజోరాశి మయం,దత్తం గృహాణత్వం సురేశ్వర || 

తరువాత హారతిని ఎడమచేతిలోకి తీసుకొని, కలశం లో వున్న పుష్పం తో నీళ్లు చూపించి, ప్లేటులో వదిలిపెట్టి, పుష్పాన్ని కలశం లో పెట్టేసుకుని, కుడిచేత్తో స్వామికి హారతి చూపించి, కింద పెట్టిన తరువాత మనం కళ్ళకు అద్దుకోవాలి. 

తరువాత లేచి నుంచుని, పుష్పం, అక్షింతలు చేతిలో పట్టుకొని ఈ క్రింది మంత్రాలు  చెప్పాలి 

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి 
తన్నో దంతిహ్ ప్రచోదయాత్ 

ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్నైచ ధీమహి 
తన్నో లక్ష్మిహ్  ప్రచోదయాత్ 

ఓం వేంకటేశాయ విద్మహే ఓం శ్రీమన్నాథాయ ధీమహి
తన్నో శ్రీ శః ప్రచోదయాత్

చేతిలో వున్న పుష్పం, అక్షింతలు దేవుళ్ళ వద్ద ఉంచి నమస్కారం చేసుకోవాలి. 

తరువాత అక్షింతలు తీసుకొని క్రింది మంత్రం చెపుతూ కుడి వైపుగా 3 సార్లు ప్రదక్షిణ చేయవలెను. 

శ్లో ॥ యానికానిచ పాపాని జన్మాన్తరకృతానిచ | 
తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణ పదే పదే || 
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసమ్భవః | 
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల || 
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ | 
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష జనార్ధన  || 
 
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ||

కూచుని అక్షింతలు తీసుకొని స్వామి వారి మీద వేస్తూ, ఈ మంత్రాలు చెప్పాలి. 

పునః పూజాం కరిష్యే 

ఛత్ర మాచ్చాదయామి 
చామరాభ్యం వీజయామి 
నృత్యం దర్శయామి 
గీతం శ్రావ్యయామి 
ఆందోళికానారోహయామి 
అశ్వాన్ ఆరోహయామి 
గజాన్ ఆరోహయామి 
సమస్త రాజోపచార, దేవోపచార , భక్త్యపుచార, శక్త్యుపచార, మంత్రోపచార, తంత్రోపచార పూజా సమర్పయామి 

అక్షింతలు చేతిలో పట్టుకొని ఈ క్రింది మంత్రం చెప్పాలి 

యస్యస్మృత్యాచ నామోఖ్య తపః పూజా క్రియాదిషు 
న్యూనం సంపూర్ణం తాం యాతి సద్యో వందే తమచ్యుతం 
 
మంత్రహీనం క్రియాహీనం భక్తి  హీనం జనార్ధన  
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
 
అనయా ధ్యానమావాహనాది షోడషోపచార పూజయాచ,   భగవాన్ సర్వాత్మకః సర్వం  శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్నో వరదో భవతు
ఏ తత్ఫలం పరమేశ్వరార్పణమస్తు 
 

అంటూ,ఆచమనం చేసిన పాత్రలోని నీటిని తీసుకుని చేతిలో పోసుకొని, అక్షింతలను పళ్ళెంలో వదలాలి. 

- శుభం - 

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi