పరిష్కారాన్నిచూపించే పౌర్ణమి పూజ !
ఎటువంటి జటిలమైన సమస్యకైనా పరిష్కారాన్నిచూపించే పౌర్ణమి పూజ !
-లక్ష్మీ రమణ
వెన్నెల పారాయణం అంటే , వెన్నెలని తాగడమే ! వెన్నెలేమైనా తేనెలా స్రవించే ద్రవపదార్థమా ? తాగమంటున్నారే ! అనుకుంటున్నారేమో , దానికీ ఒక విధానముంది . చందమామ వంటి ఆ లలితా స్వరూపిణిని అర్చించి చేసే ఈపూజ ఎటువంటి జటిలమైన సమస్యకైనా పరిష్కారాన్ని చూపిస్తుంది. సంకల్పం సిద్ధిస్తుంది . ఆ విధానం ఇక్కడ మీకోసం .
కల్యాణాయుత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం
పూర్ణాం పూర్ణతరాం పరేశమహిషీం పూర్ణామృతా స్వాదినీం
సంపూర్ణాం పరమోత్తమాం అమృతకళాం విద్యావతీం భారతీం
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం॥
అనేకదా అమ్మ రాజేశ్వరీ దేవి దర్శనం . అందువల్ల ఆమె చంద్రునినుండీ స్రవించే అమృతస్వరూపిణి . ఆ అమృతాన్ని ఆస్వాదించాలంటే, ఈ పూజావిధానాన్ని చేయమని పండితులు సెలవిస్తున్నారు . ఆసక్తి కలవారు చక్కగా ఆచరించండి .
పౌర్ణమి రోజు ఈపూజ చేసుకోవాలి. ఏ మాసములో వచ్చే పౌర్ణమిఅయినా ఈ పూజకి అనుకూలమైన రోజే . పాలని చక్కగా కాచి చల్లార్చి, దాంతిలో కాస్త యాలకులు, పటికబెల్లం కలిపి సిద్ధంగా ఉంచుకోవాలి. ఆరుబయట వెన్నలలో, ఆ గిన్నెపైన మూతతీసి ( చంద్ర బింబం పడేలా ప్రయత్నిస్తే మంచిది) పెట్టాలి. తులసిదగ్గర, మేడమీదైనా చక్కగా ఆసనం వేసుకొని కూర్చోవచ్చు. ఆ తర్వాత చంద్రుణ్ణి చూస్తూ, ఆయనలో ఆ పూర్ణచంద్రవదన అయిన లలితాంబికని భావన చేస్తూ , 9 సార్లు లలితా పారాయణం చేయాలి . లలితా సహస్త్రనామం పూర్తిగా ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది అని పండితవచనం . అలా 9 సార్లు పారాయణ చేస్తే , ఆ పారాయణ పూర్తి అయ్యేవరకూ మన శరీరాన్ని శ్రీచక్రం చుట్టి ఉంటుంది. అనంతమైన శక్తిపాతం అది . అమ్మవారి కృపాపాత్రమైన స్పర్శ అది .
ఇలా పూజ పూర్తయిన తర్వాత, ఆపాలని ఇంట్లోవారు ప్రసాదంగా స్వీకరించాలి . దీనివల్ల ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. ఇతరత్రా మీ కామ్యాలు ఏవైనా అవి సిద్ధిస్తాయి,. జటిలమైన సమస్యలన్నీ ఆ అమ్మకృపవల్ల పరిష్కారమవుతాయి . అతంటి వైశిస్థ్యమైనది పౌర్ణమి పూజా విశేషం.
ప్రతి నెల 9 సార్లు చదవలేని వారు ఒక్క సారి చదవచ్చు.ఏదైనా తీరని సమస్య , కోరిక ఉన్నవారు 9 సార్లు చేస్తే ఆటంకాలు తొలగి పోతాయి . ఏ సమస్య లేకున్నా ఆ తల్లి అనుగ్రహము కోసం చేయవచ్చు.
రాత్రి 7.30 తర్వాత ఈ పూజ చేసుకోవచ్చు . బయట చేయడం కుదరని వారు చంద్రుని పాలలో దర్శనం చేసుకొని ఆ పాలు దేవుడి ముందు పెట్టుకుని కూడా చేసుకోవచ్చు . వర్షాకాలంలో, మబ్బులుపట్టి చంద్రదర్శనం ఉండని పౌర్ణమి సమయాల్లో అమ్మవారి రూపాన్ని పాలల్లో చూసి చంద్రుడు గా భావించి పారాయణ చేయవచ్చు.
శ్రీ మాత్రే నమః శుభం భవతు !